మత్తుకు బానిసలవుతున్నయువతీ యువకులు

Youth Addicted To Drugs In Guntur - Sakshi

సాక్షి, తాడేపల్లి : కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గతంలో అక్కడక్కడా మాత్రమే గంజాయితో పాటు మాదక ద్రవ్యాలు కనిపించేవి. నేడు వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది. మత్తు పదార్థాల్ని అమ్మేవారు కూడా రూటును మార్చి విద్యా సంస్థలు, యూనివర్సిటీలు ఎక్కడ ఉన్నాయో అక్కడ పాగా వేసి గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు చేస్తున్నారు. యువతీ, యువకులకు మొదట గమ్మత్తుగా ఉంటుందంటూ అలవాటు చేసి మత్తులో ముంచుతూ వారితోనే రవాణా చేయిస్తూ అమ్మకాలు చేయిస్తున్నారు. పోలీసులు కూడా పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడో, రాజకీయ నాయకులు గళం విప్పినప్పుడో, అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడో మాత్రమే దృష్టి సారిస్తున్నారు. కేజీ నుంచి రెండు కేజీలు మాత్రమే పట్టుకుంటూ కేసులు నమోదు చేస్తున్నారు.

విస్తరించిన అమ్మకాలు 
నాలుగు సంవత్సరాల కిందట గంజాయి విక్రయాలు తాడేపల్లి కేంద్రంగా జరిగేవి.  ప్రస్తుతం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రధానమైన కాలేజీల వద్ద, జన సంచారం ఎక్కువగా ఉండే వద్ద కూడా అమ్ముతున్నారు. ఆడవారిని సైతం ఈ మత్తులోకి దించి, లైంగిక దాడులు చేస్తున్నారు. బయటకు ఎవరూ కూడా చెప్పుకోకుండా డ్రగ్స్‌ మాఫియా జాగ్రత్తలు తీసుకుంటూ గుట్టుచప్పుడుకాకుండా వ్యాపార కార్యకలాపాల్ని  నిర్వహిస్తోంది. 

తూతూమంత్రంగా కేసుల నమోదు 
మంగళగిరి సర్కిల్‌లో రెండు రోజుల వ్యవధిలో పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.  అవి కూడా వారు నిఘా ఏర్పాటు చేసి పట్టుకున్నవి కావు. తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెంలో వివాదంలో ఉన్న ఓ స్థలంలో గుట్కా తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్థలానికి సంబంధించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటకు వచ్చింది. ఘటన స్థలానికి పోలీసులు వెళ్లి గుట్కా తయారీ మిషన్లను సీజ్‌ చేశారు. ఇందులో పట్టుబడిన దేవులపల్లి అనిల్‌ నేతృత్వంలో తాడేపల్లికి చెందిన శ్రీకాంత్, టాంజానియా దేశానికి చెందిన కె.ఎల్‌.యు. విద్యార్థి మోనాషబానీలతో పాటు పోలీసులు ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారి వద్ద నుంచి వివరాలు సేకరించకుండానే పోలీసులు రాజకీయ పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు కేవలం కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చూపించారు.

తాడేపల్లి పట్టణ పరిధిలో ముగ్గురు యువతులు, ఓ యువకుడు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ గంజాయి అమ్ముతున్నారు. ఈ క్రమంలో విక్రయదారుల మధ్య గొడవలు చోటుచేసుకొన్నాయి. వారిలో ఒకరికి గాయాలయ్యాయి. విషయం కాస్తా బయటకు వచ్చి పోలీసులు గుట్టుచప్పుడుకాకుండా వారి ఇంటిపై దాడి చేశారు. ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

నాలుగు నెలల కిందట తాడేపల్లి బైపాస్‌రోడ్డులోని హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వద్ద బాపట్లకు చెందిన ఓ విద్యార్థి 2 కేజీల గంజాయితో పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు అరెస్టు చేశారే కానీ, ఎవరు తీసుకొస్తున్నారు, ఎలా తీసుకొస్తున్నారు అనే విషయాలను విచారించలేదు. దీంతో అసలు మాఫియా తప్పించుకొని అమాయకులైన విద్యార్థులు, యువతీ, యువకులు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. దుర్వ్యసనాలకు అలవాటైన యువతీ, యువకులు తిరిగి మరలా వారినే నమ్ముకుంటూ రూపాయికి కక్కుర్తి పడి, ఆ ఊబిలో ఇరుక్కుంటున్నారు.

తాడేపల్లి బైపాస్‌లోని హైవే టవర్స్‌ వద్ద ఉన్న ఓ విల్లాలో 15మంది విద్యార్థులు హుక్కా, గంజాయి పీలుస్తూ ఆ మత్తులో స్థానికంగా ఉన్న వారిపై విరుచుకుపడ్డారు. స్థానికులు తమదైన శైలిలో దాడి చేయడంతో అక్కడనుంచి వారు పరారయ్యారు. ఆ సమయంలో వారు ఉన్న గదిలో గంజాయి విత్తనాలతో పాటు, గంజాయితో తయారుచేసిన వివిధ రకాల మాదక ద్రవ్యాలు కనిపించడం విశేషం. పోలీసుల దృష్టికి విషయం వెళ్లినా, వారందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనూ గుట్టుచప్పుడు కాకుండా విషయాన్ని తొక్కిపట్టి ఉంచారు. దీంతో అసలు మూలాలు కనిపించకుండా పోయాయి.

రవాణా ఇలా ...
విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఏజెన్సీ ఏరియాల్లో ఉన్న అమాయక ప్రజల్ని,  యువతీ యువకుల్ని గంజాయి రవాణాలో బలిపశువులుగా చేస్తున్నారు. అక్కడి నుంచి గుంటూరు, కృష్ణా జిల్లాలకు తరలిస్తున్నారు. ఏజెన్సీ ఏరియాల్లో ఏజెంట్లు కొంతమంది రవాణాదారులను ఎంచుకుని, వారి పేరనే ఫోన్‌ సిమ్‌లు తీసుకొని, మాట్లాడుతూ ఇక్కడ ఉన్న ఏజెంట్లకు అందచేస్తారు. డబ్బులు సైతం ఆన్‌లైన్‌ పేమెంట్లే జరుగుతున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. పోలీసులు ఈ రవాణా చేసేవారిని పట్టుకున్న సమయంలో వారి వద్ద ఎటువంటి సమాచారం లేకపోవడంతో అరెస్టు చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో అసలు సూత్రధారులు తప్పించుకు తిరుగుతున్నారు. వీవీఐపీలు సంచరించే ఈ ప్రాంతంలో మాదక ద్రవ్యాలు, గంజాయి సప్‌లై చేసే వారి గుట్టును రట్టు చేసేందుకు అన్ని శాఖలు పకడ్బందీగా ప్రణాళిక రూపొందించి నివారించకపోతే భవిష్యత్తులో మరిన్ని అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటాయని పలువురు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top