యామనీ బాల.. అవినీతి గోల

Yamini bala Four Years Graph In Anantapur - Sakshi

ఏ పని చేయాలన్నా ఎమ్మెల్యేకు పర్సంటేజీ

ఇసుక తరలింపులు, నీరు–చెట్టులో భారీ అక్రమాలు

చక్రం తిప్పుతున్న యామినీబాల సోదరుడు

చదువుకున్న వ్యక్తి కావడంతో తమ నియోజకవర్గం అభివృద్ధి పథంలోదూసుకెళుతుందని అందరూ భావించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కాబట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తారనుకున్నారు. అయితే అందరి అంచనాలుతారుమారయ్యాయి. ఎన్నికల సమయంలో ఒక విధంగాను, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రీతిగాను సదరు వ్యక్తి వ్యవహర్తిస్తుండడంతో నియోజకవర్గ అభివృద్ధి పూర్తిగా పడకేసింది. ప్రతి పనికీ పర్సంటేజీ ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతుండడంతో ఆదర్శానికి కాలం చెల్లింది. చదువుకున్న మేధావి తనం కాస్త కమీషన్లకక్కుర్తిలో మట్టి కొట్టుకుపోయింది.ఇదీ శింగనమల నియోజకవర్గ ఎమ్మెల్యే యామినీ బాల...  నాలుగేళ్ల పాలనలో సాధించిన ప్రగతి.

శింగనమల :ఉపాధ్యాయురాలిగా... విద్యాధికారిగా పనిచేస్తూ ఊహించని విధంగా ఎమ్మెల్యేగా అయ్యారు యామినీ బాల. 2014 ఎన్నికల సమయంలో గెలుపొందేందుకు ఎన్నో వాగ్ధానాలు చేశారు. కులం కార్డుతో ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఈ నాలుగున్నరేళ్లలో ప్రతి పనికీ పర్సంటేజీలు దండుకుంటూ పనుల నాణ్యతకు తిలోదకాలచ్చేశారు. ఇసుక, మట్టి అక్రమ రవాణాకు తెరదీసి రూ. కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు.

అభివృద్ధికి ఆమడ దూరంగాఎస్సీ కాలనీలు
ఎస్సీలకు కేటాయించిన శింగనమల నియోజకవర్గంలో ఈ నాలుగేళ్లలో ఎస్సీ కాలనీల్లో ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోలేకపోయాయి. సమస్యలపై స్థానికులు ఎప్పటికప్పుడు మొరబెడుతున్నా.. ఆమె పట్టించుకోలేదు. ఫలితంగా ఎస్సీ కాలనీలు అభివృద్ధికి ఆమడ దూరంగా మురికి కూపాలను తలపిస్తున్నాయి.

చక్రం తిప్పుతున్న అశోక్‌
యామినీబాల సోదరుడు అశోక్‌ అంతా తానై నియోజకవర్గ వ్యాప్తంగా అవినీతి, అక్రమాలకు తెరదీశారు. ప్రతి పనిలోనూ పర్సంటేజీలు తీసుకోవడం, పనుల కేటాయింపులు, అధికారుల బదిలీలు ఇతరత్రా అన్ని విషయాలు ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈయనకు తెలియకుండా నియోజకవర్గంలో ఏ ఒక్క పని జరగదనే ప్రచారం ఉంది. నీరు చెట్టు పనులు, ఇసుక దందా, సబ్సిడీ రుణాల మంజూరు ఇలా ప్రతి పనిలో అవినీతి తారాస్థాయికి చేరుకుంది.

నీరు–చెట్టు పనుల్లో యథేచ్ఛ దోపిడీ
నీరు–చెట్టు పథకం కింద శింగనమల మండలంలో టీడీపీ నాయకులు చేపట్టిన రూ. 8 కోట్ల పనుల్లో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. రూ. లక్ష విలువైన పనికి రూ. 10వేలు చొప్పున ఇరిగేషన్‌ అధికారుల నుంచి వసూలు చేశారు. శింగనమల చెరువు, సలకంచెరువు, నాగులగుడ్డం వద్ద ఉన్న చెన్నవరం చెరువు, చిన్నజలాలపురం చెరువు, కాలువల్లో చేపట్టిన పూడిక తీత పనుల్లోనూ భారీ అక్రమాలు చేటుచేసుకున్నాయి. పనులు నామమాత్రంగా చేసి నిధులు దోచేశారు. శింగనమల మండలంలోని ఉల్లికల్లు ఇసుక రీచ్‌లలో ఎమ్మెల్యే పీఏ రంగప్రవేశం చేసి అక్రమంగా ఇసుక తరలించి సొమ్ము చేసుకున్నారు. టిప్పరుకు రూ. 2 వేలు చొప్పున వసూలు చేశారు. నియోజకవర్గంలోని శింగనమల, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో దాదాపు రూ.70 కోట్లు వరకు నీరు–చెట్టు పనులు జరిగాయి. ఇందులో రూ.1 లక్ష పనికి రూ.5 వేలు చొప్పున కమీషన్‌ను ఎమ్మెల్యేకు ఇచ్చినట్లు టీడీపీ నాయకులే ఆరోపణులు చేస్తున్నారు.

అవినీతి ఆరోపణలు
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా శాఖల వారీగా టార్గెట్లు కేటాయించి అధికారులతో డబ్బు వసూలు చేశారు.
బీకేఎస్‌ మండలంలో నిరుపేదలను బెదిరించి వారు సాగుచేస్తున్న భూమిని లాక్కొన్నారు. ఎమ్మెల్యే యామినీబాల అ«ధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆమె తమ్ముడు అశోక్‌ బీకేయస్‌ మండలంలోని గోవిందపల్లి గ్రామంలో దూదేకుల వన్నూర్‌కు చెందిన 5 ఎకరాల పొలంను ఎమ్మెల్యే బినామీల పేరుతో పట్టా చేయించారు.

అధికారులపై పెత్తనం
శింగనమల నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో అన్ని శాఖల అధికారులపై ఎమ్మెల్యే యామినీబాలతో పాటు ఆమె అనుచరుల పెత్తనం తీవ్ర స్థాయిలో ఉంది. ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు, ఈబీసీ కింద అర్హులకు రుణాలు మంజూరు చేయడానికి ఈ నియోజకవర్గంలో నామమాత్రపు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద కూర్చొని జాబితాను పరిశీలించి తుది అభ్యర్థులను ఖరారు చేశారు. ఇదే తరహాలో పింఛన్ల లబ్ధిదారుల ఎంపిక కూడా జరిగింది. ఈ విషయంగా ఎంపీడీవోల లాగిన్‌ ఐడీలు, పాస్‌వర్డ్‌లను ఆమె గుప్పిట్లో ఉంచుకుని మొత్తం వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చేసుకున్నారు. టీడీపీ నాయకుల పెత్తనాన్ని భరించలేక పుట్లూరు ఎంపీడీఓ నెహమ్యా డిప్యూటేషన్‌పై తాడిపత్రికి వెళ్లారు. డిప్యూటేషన్లు రద్దు అయిన తర్వాత ఆయన పుట్లూరుకు రాలేని పరిస్థితి నెలకొంది. శింగనమల ఎంపీడీఓగా పనిచేసిన లలితకుమారి వీరి ఒత్తడి తట్టుకోలేక ఇంకా రెండేళ్ల సర్వీస్‌ను వదులుకుని స్వచ్ఛంద ఉద్యోగ విరమణ తీసుకున్నారు.

ఇచ్చిన హామీల అమలు తీరు
శింగనమల చెరువును లోకలైజేషన్‌  చేయిస్తామంటూ 2014 ఎన్నికల సమయంలో శింగనమలలో జరిగిన బహిరంగసభలో యామినీబాల, శమంతకమణి వాగ్ధానం చేశారు. నేటికీ ఇది అమలు కాలేదు.
శింగనమలలో మోడల్‌ çస్కూల్‌ ఏర్పాటు హామీ నేటికీ అమలు కాలేదు.
ఎన్నికల్లో గెలిస్తే అర్హులైన వారందరికీ ఇంటి పట్టాలు మంజూరు చేస్తామన్నారు. గెలిచిన తర్వాత ఏ ఒక్కరికీ పట్టా ఇవ్వలేదు.
నార్పల వద్ద కూతలేరులో మురికినీరు కలుషితం కాకుండా ప్రత్యేక కాలువ ఏర్పాటు హామీ నెరవేరలేదు.
పుట్లూరు మండలంలోని పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి చెరువులను నింపడంలో విఫలమయ్యారు.
పుట్లూరు మండలంలో తాగునీటి సమస్య పరిష్కారం కాలేదు.
బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని అమ్మవారిపేట గ్రామం వద్ద నార్పల రహదారి పక్కన మోడల్‌ స్కూల్‌ నిర్మాణం ఊసే లేకుండా పోయింది.
యల్లనూరు మండల వ్యాప్తంగా ఉన్న చిత్రావతి నదికి ఏటా నీటిని విడుదల చేయలేకపోయారు.  
ప్రతి గ్రామానికీ తారురోడ్డు నిర్మాణం గాలిలో కలిసిపోయింది. ఇప్పటికీ మట్టి రోడ్లపైనే ప్రజలు ప్రయాణిస్తున్నారు.
పశువైద్యశాలకు శాశ్వత భవన నిర్మాణం చేయించలేకపోయారు.
= పాఠశాలల్లో గదుల కొరత తీరలేదు. అదనపు తరగతి గదుల నిర్మాణం పట్టించుకోలేదు.

ఆమెకు సొంత ప్రయోజనాలే ముఖ్యం
ఎమ్మెల్యే యామినీ బాలకు సొంత ప్రయోజనాలే ముఖ్యం. ఈ నాలుగున్నరేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తీ వెనుకబడింది. పింఛన్ల పంపిణీలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్‌ గృహాల లబ్ధి నిజమైన పేదలకు దక్కలేదు. పక్కా గృహ నిర్మాణాలన్నీ టీడీపీ కార్యకర్తలకే మంజూరు చేయించారు. నీరు చెట్టు పనుల్లో  పెద్ద ఎత్తన నిధులు దోపిడీకి పాల్పడ్డారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు ఇవ్వడంలో వైఫల్యం చెందారు. చెరువులన్నీ నింపుతామంటూ ప్రకటించి, ఏ ఒక్క చెరువునూ నింపలేకపోయారు. పంట పెట్టే సమయంలో హెచ్చెల్సీకి లైనింగ్‌ పనులు చేపట్టి అన్నదాతల పొట్ట కొట్టారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారు. స్వతహాగా ఉపాధ్యాయురాలైనప్పటికీ నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి చేసిన కృషి అంటూ ఏదీ లేదు. బెల్టు షాపులను  పరోక్షంగా ప్రోత్సహించారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు.– జొన్నలగడ్డ పద్మావతి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త

రైతులను మోసం చేశారు
అధికారంలోకి రాగానే శింగనమల చెరువును లోకలైజేషన్‌ చేస్తామంటూ 2014 ఎన్నికల సమయంలో యామినీబాల మాట ఇచ్చారు. గెలిచిన తర్వాత ఇంత వరకూ చెరువు అభివృద్ధి గురించి ఏ మాత్రం ఆమె పట్టించుకోలేదు. లోకలైజేషన్‌ చేసి నీటి కేటాయింపులు రాబట్టలేకపోయారు. కేవలం రైతులను, కూలీలను ఆనాడు మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. అందరినీ మోసం చేశారు.             
 – తిరుపతయ్య, రైతు, శివపురం, శింగనమల మం‘‘

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top