కడలే ఆధారం.. తీరమే ఆవాసం

World Fishermen Day Special Story In Krishna - Sakshi

ప్రమాదకర వేటే వారి జీవనబాట

కడలి పుత్రులు.. కన్నీటి గాథలు

వనరత్నాలతో మత్స్యకారుల జీవితాలల్లో కొత్త వెలుగులు నింపిన ప్రభుత్వం 

రేపు ప్రపంచ మత్స్యకారల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం  

కడలి అలల పైన.. వలల మాటున పొట్టకూటి కోసం నిత్యం తిప్పలు తప్పని జీవితాలు. బతుకు తీరం దాటేందుకు తీరం నుంచి సుదూరం వెళ్లాల్సిందే.. ఇంతచేసినా బతుకు ఒడ్డున పడుతుందన్న నమ్మకం, బతికి ఒడ్డున పడతాం అన్న నమ్మకం ఉండదు.. మరు గడియలో ఏం జరుగుతుందో ఒక పట్టాన అంతు పట్టని రోజుల తరబడి ప్రయాణం.. అయినా భగవంతుడిపై భారం వేసి, సముద్రంపై నమ్మకం ఉంచి, బతుకుపోరు సాగిస్తారు మత్స్యకారులు.. సముద్రం ఉట్టి చేతులతో పంపదు.. అన్న నానుడిని మననం చేసుకుంటూ, వలలు భుజాన వేసుకుని, ఎన్ని రోజులకు వస్తారో వారికే తెలీని పయనానికి సిద్ధమవుతారు మత్స్యకారులు.. రేపు ప్రపంచ మత్స్యకారుల         దినోత్సవం సందర్భంగా  ప్రత్యేక కథనం 

సాక్షి, నాగాయలంక(అవనిగడ్డ): తీరప్రాంతంలో అందునా కృష్ణానది బంగాళాఖాతంలో సంగమించే సాగర సంగమ ముఖద్వారం చెంత.. అటు సాగర అలల ఘోష, ఇటు నదీపాయల హొయల నడుమ నిత్యం బతుకు సమరం సాగించే మత్స్యకారుల జీవనశైలికి అద్దం పట్టే దృశ్యాలు మనకెన్నో కనిపిస్తాయి. వలల మాటున వారు నిత్యం ఎదుర్కొనే సమస్యలు కూడా అలాగే స్పృశిస్తుంటాయి. నాగాయలంక సాగరతీరం, కృష్ణానదీ పాయలు, ప్రతి ఆదివారం గ్రామంలో జరిగే వారపుసంతలోనూ ఇలాంటి బతుకు చిత్రాలు జీవిత పరమార్ధాన్ని గుర్తుచేస్తునే ఉంటాయి.

సాగరంలో లభించే మత్స్య సంపద , నాగాయలంకలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉప్పు చేపల వారపు సంత

15 వేల కుటుంబాలకు ఆధారం.. 
దివిసీమలోని నాగాయలంక, కోడూరు మండలాలలో సంగమేశ్వరం నుంచి నాలి, సొర్లగొంది, దీనదయాళపురం, పర్రచివర, ఏటిమొగ, గుల్లలమోద, ఎదురుమొండి దీవుల్లోని ఈలచెట్లదిబ్బ, నాచుగుంట, ఎదురుమొండి, నాగాయలంక,  పాలకాయతిప్ప, బసవవానిపాలెం, హంసలదీవి తదితర గ్రామాలలో బంగాళాఖాతం, కృష్ణానదిలో అత్యధిక మత్స్యకార కుటుంబాలు నిత్యం చేపలవేట సాగిస్తున్నాయి. దివిసీమలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 15వేల కుటుంబాలు మత్స్య పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు.  

‘సన్‌ డ్రై’ ఫిష్‌.. 
నాగాయలంకలో దశాబ్దాల కాలంగా ప్రతి ఆదివారం జరిగే వారపుసంతలో డ్రై ఫిష్‌ అమ్మకాలు మత్స్యకారులు, ముఖ్యంగా మత్స్యకార మహిళల బతుకు చిత్రాలను ప్రతిబింభిస్తుంటాయి. గత యాభై ఏళ్లుగా కేవలం ఆదివారం మాత్రమే కొనసాగుతూ వస్తున్న ఆదివారం డ్రై ఫిష్‌ మార్కెట్‌ కొద్ది సంవత్సరాలుగా సంతాశీల పాటదారుల నిరంకుశత్వం కారణంగా ఎక్కువ శాతం శనివారమే ముగించేస్తున్నారు.  మీన ప్రియలకు జిహ్వచాపల్యం చూపించే ఉప్పు చేపల్లో (డ్రై ఫిష్‌)లలో పండుగప్ప, మాగ, మాతగురక వంటి భారీచేపలు, రొయ్యపప్పు, చప్పిడి మెత్తళ్లు లాంటి వాటికి డ్రై ఫిష్‌ మార్కెట్‌ తరతరాలుగా ప్రసిద్ధి. శని, ఆదివారాలు నాగాయలంక సంతలో ఉప్పుచేపలు (డ్రై ఫిష్‌)అమ్మకాలు ఇప్పటికీ కొనసాగుతునే ఉన్నాయి.

నవరత్నాలతో  కొత్త వెలుగులు.. 
రాష్ట్రంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల పథకాలు తీరప్రాంత మత్స్యకారుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపాయి.  నాగాయలంక, కోడూరు మండలాలలో 842 మోటరైజ్డ్‌ నావలకు గతంతో లీటరుకు రూ.6.03 సబ్సిడీ ఇవ్వగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు తొమ్మిది రూపాయల సబ్సిడీతో నెలకు 300లీటర్లు ఇస్తున్నారు. ఆమేర సబ్సిడీ వరకు తగ్గించి ఎంపికచేసిన పెట్రోలు బంకుల్లో నేరుగా ఆయిల్‌ తీసుకోవచ్చు. రెండవది చేపలవేట నిషేధకాలంలో ఇప్పటివరకు రూ.4వేలు ఉన్న భృతిని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏకంగా రూ.10వేలకు పెంచారు. దీనికోసం 4500 మంది లబ్ధిదారులను మత్స్యశాఖ గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపింది. అలాగే  వేటసమయంలో ప్రమాదవశాత్తూ ఎవరైనా చనిపోతే ప్రమాద బీమాను రూ.10లక్షలకు, అంగవైకల్యం సంభవిస్తే రూ.5లక్షలకు పభుత్వం పెంచింది. ప్రజాసంకల్ప పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన విద్యుత్‌చార్జీలు, ఆయిల్‌ సబ్సిడీ లాంటి రాయితీలను అధికారంలోకి రాగానే అమలులోకి తేవడంతో అటు ఆక్వారైతులకు ఇటు తీరప్రాంత మత్స్యకారుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఈసందర్భంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్విహించాలని మత్స్యకారులు, మత్స్యకార సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top