మోతె మండల పరిధిలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. మండలం గుండా పాలేరు వాగు వెళ్తుండడంతో ఇసుకాసురాల పంట పండుతోంది.
మోతె మండల పరిధిలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. మండలం గుండా పాలేరు వాగు వెళ్తుండడంతో ఇసుకాసురాల పంట పండుతోంది. రోజూ 200 నుంచి 500 ట్రాక్టర్ల వరకు ఇసుక రవాణా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇసుక అక్రమ రవాణా అరికట్టాలన్న కలెక్టర్, ఎస్పీ ఆదేశాలను ఇక్కడ బేఖాతరు చేస్తున్నారు. ఈ దందాలో పోలీసులే ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మోతె, న్యూస్‌లైన్: మోతె మండలంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునే అధికారులే కరువయ్యారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాలను సైతం అతిక్రమించి సంబంధిత అధికారులు ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమార్కుల నుంచి డబ్బులు దండుకొని కేసులు నమోదు చేయకుండా రోజువారీ, నెలవారీ ఒప్పందాలతో వదిలేస్తున్నట్లు సమాచారం.
మండల పరిధిలో ఉర్లుగొండ,తుమ్మగూడెం, నర్సింహాపురం, కూడలి గ్రామాల పరిసర ప్రాంతాల వ్యవసాయ భూములకు ఆనుకొని ఉన్న పాలేరు వాగు నుంచి గత నెలరోజుల నుంచి జోరుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఇంత పెద్ద మొత్తంలో ఇసుక దందా జరుగుతున్నా అధికారులు మాత్రం ఉదయం పూట చూసీచూడనట్లుగా వదిలేసి రాత్రి వేళలో వసూళ్ల వేట సాగిస్తున్నారు. మామూళ్ల విషయంలో ట్రాక్టర్ల యజమానులతో నేరుగా ఫోన్ చేసి బేరసారాలు కుదుర్చుకొంటున్నారు.
సీనరేజ్ డబ్బు వసూలు
మోతె మండలంలోని కూడలి, తుమ్మగూడెం, నర్సింహాపురం గ్రామాలకు చెందిన భూయజమానులు కొందరు పాలేరు వాగుకు పక్కన ఉన్న తమ పంట భూముల్లోని ఇసుకను విక్రయించేందుకు ట్రాక్టర్ యజమానుల నుంచి రూ.20 వేల నుంచి రూ.50 వేల వ రకు నెలవారీ పాట పెట్టి డబ్బులు దండుకొంటున్నారు. మరికొందరు రోజవారీగా ట్రిప్పు ఇసు కకు రూ.100నుంచి రూ.200 వరకు దండుకొంటున్నారు.