ఎంత చదివినా.. ఉద్యోగం రాలేదు..

Women Suicide Attempt In YSR Kadapa - Sakshi

ఇద్దరూ చదువుకున్నారు.. పెళ్లి చేసుకున్నారు.. ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చినా జీవితం బాగు పడుతుందనుకున్నారు.. ఎంత శ్రమించినా ఒకరికి కూడా రాలేదు.. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె సూసైడ్‌ నోట్‌ రాసి బలవన్మరణానికి పాల్పడింది.

రాయచోటి టౌన్‌(వైఎస్సార్‌ కడప) : ‘నేను ఎంత కష్టపడి చదివినా ఉద్యోగం రాలేదు. నాకు సొంత జీవితం లేదు. అలాంటప్పుడు నేను చచ్చినా.. బతికినా ఒక్కటే. అందుకే నాకు నేను ఆత్మహత్య చేసుకొంటున్నాను’ అని రాయచోటి పట్టణంలో నివాసం ఉంటున్న కుసుమ అనే నిరుద్యోగ మహిళ సూసైడ్‌ నోట్‌ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకుంది. నా చావుతో నా తల్లిదండ్రులు, భర్తకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ నోట్‌ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకొంటున్నానంటూ ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. రాయచోటి పట్టణ పరిధిలోని బోస్‌ నగర్‌లో నివాసం ఉండే మురళీకృష్ణ భార్య కుసుమ (27) ఆదివారం తెల్లవారుజామున ఈ అఘాయిత్యం చేసుకుంది.

మృతురాలి బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సంబేపల్లె మండలం బొగ్గలవారిపల్లెకు చెందిన వెంకటరమణ, నాగ రత్నమ్మకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడు మురళీకృష్ణ, రెండో కుమారుడు శివ. మురళీకృష్ణ ఎమ్మెస్సీ మ్యాథ్స్‌ పూర్తి చేశాడు. ఆయనకు అనంతపురం జిల్లా ముదిగుబ్బకు చెందిన కుసుమతో వివాహం జరిగింది. ఆమె కూడా బీకాం పూర్తి చేసింది. వీరు కొన్నేళ్లు అన్యోన్యంగా జీవనం సాగించారు. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు.

పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ..
ఇద్దరూ కలసి రాయచోటి పట్టణానికి వచ్చి ప్రైవేట్‌ సంస్థలలో పని చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. మురళీకృష్ణ ముందుగా ఓ విద్యాసంస్థలో పని చేస్తుండే వాడు. వేతనం చాలకపోవడంతో మరో విద్యాసంస్థలో చేరాడు. ఆమె కొన్నాళ్లు ప్రైవేట్‌ సంస్థలలో పని చేసింది. ఇలా తక్కువ వచ్చే జీతాలతో ఎలా కాపురం సాగించాలంటూ బ్యాంక్‌ కోచింగ్‌ చేస్తూనే.. ఆర్‌ఆర్‌బీకి సిద్ధం అవుతోంది. దీనికోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా ఇంటిలోనే ఉంటూ ఎంతో శ్రద్ధగా చదివేది. ఇలా గంటల కొద్దీ చదివితే ఎలా అంటూ భర్త అనేక సార్లు వారించినా వినేది కాదు. ఎలాగైనా ప్రభుత్వం ఉద్యోగం సాధించాలనే తపనతో మరింత కఠోరంగా శ్రమించేది.

నిర్వేదానికి లోనై..
 గత పోటీ పరీక్షలలో ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైంది. ఈ నేపథ్యంలో మానసికంగా కుంగిపోయింది. తీవ్ర నిర్వేదానికి లోనైంది. ప్రతి చిన్న విషయానికి కోపగించుకొనేది. ఇలా ఉండటంతో పది రోజుల క్రితం అనంతపురం జిల్లాలోని పుట్టింటికి తీసుకెళ్లి మానసిక వైద్యుడితో చికిత్స చేయించుకొని వచ్చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి తన భర్తతో కొంత వాగ్విదానికి దిగింది. చాలా పొద్దుపోయే వరకు ఇద్దరూ గొడవ పడటంతో.. నీతో వాదించలేనంటూ మురళీకృష్ణ పక్క దగిలోకి వెళ్లి పడుకొన్నాడు. అప్పటికే అర్ధరాత్రి దాటిపోయింది. ఇక పడుకొంటుందిలే అనుకొని నిద్రపోయాడు. ఈ సమయంలో ఆమె తనకు తానుగా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని మృతి చెందింది.

తెల్లవారుజామున నిద్ర లేచి చూసే సరికి ఫ్యాన్‌కు మృతదేహం వేలాడుతూ కనిపించింది. వెంటనే బంధువులకు విషయాన్ని తెలిపాడు. అంతలోనే పోలీసులకు చెప్పడంతో వారు వచ్చి మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం కావడంతో ఆస్పత్రిలో అధికారులు ఎవరూ లేకపోవడంతో పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో ఉంచారు. మధ్యాహ్నం సమయానికి కుసుమ పుట్టింటి వారు రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే అల్లుడు మురళీకృష్ణ తీవ్ర నిర్వేదంలో రోదిస్తుండగా వారు ఆయన వద్దకు చేరుకున్నారు. ‘చాలా మంచి వాడివని, నా కూతురికి దొరికిన దేవుడవని సంతోషించాం కదా నాయనా.. ఇలా ఎందుకు జరిగింది’ అంటూ రోదించారు. వారు మురళీకృష్ణను పట్టుకొని బోరున విలపించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top