వైఎస్సార్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఒక మహిళ వరద నీటిలో కొట్టుకుపోయింది.
సుండుపల్లె (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఒక మహిళ వరద నీటిలో కొట్టుకుపోయింది. సుండుపల్లె మండలం మాచిరెడ్డిపల్లె పంచాయతీ రాయవరం గ్రామానికి చెందిన పాలెం చంద్ర, ఆయన భార్య మణెమ్మ(35).. కుమార్తె, మరొక స్త్రీతో కలసి సోమవారం రాయవరం వైపు కాలినడకన బయలుదేరారు. మార్గమధ్యంలో వారు మడికాడు వద్ద బాహుదా నది లో లెవల్ వంతెనపైకి వచ్చిన వరద నీటి ఉధృతికి కొట్టుకుపోయారు. అప్రమత్తమైన చుట్టుపక్కలవారు ముగ్గురిని కాపాడగలిగారు. మణెమ్మ వరద నీటిలో గల్లంతయ్యింది. ఆమె కోసం అధికారులు గాలిస్తున్నారు.
సమాచారం తెలుసుకున్న తహశీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి లో లెవల్ వంతెన వద్ద సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఆదినారాయణరెడ్డి ప్రాజెక్టులోకి 30వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో రెండు గేట్లెత్తి 30 వేల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు జేఈ రెడ్డయ్య తెలిపారు.