అరుణమ్మ డబుల్ గేమ్ | Will Galla Aruna Kumari Join TDP? | Sakshi
Sakshi News home page

అరుణమ్మ డబుల్ గేమ్

Published Sun, Jan 19 2014 5:14 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

రాష్ట్ర కేబినెట్‌లో కొనసాగుతున్న మంత్రి గల్లా అరుణకుమారి తెలుగుదేశంతో దోస్తీ కడుతున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది.

 సాక్షి, తిరుపతి:రాష్ట్ర కేబినెట్‌లో కొనసాగుతున్న మంత్రి గల్లా అరుణకుమారి తెలుగుదేశంతో దోస్తీ కడుతున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది. మంత్రి పదవిలో ఉంటూనే ప్రతి పక్ష టీడీపీ అంతర్గత వ్యవహారాల్లో కీలకపాత్ర పోషిస్తుండడం అటు అధికారపార్టీ నేతలతో పాటు తెలుగుదేశం నాయకులు జీర్ణించుకోలేకున్నారు.   కుమారుడు గల్లా జయదేవ్‌కు గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ టికెట్టు దాదాపుగా ఖాయం చేసుకున్న అరుణమ్మ ఇప్పుడు చంద్రగిరిపై కూడా కన్నేశారని చెబుతున్నారు. అందులో భాగంగానే భర్త గల్లా రామచంద్రనాయుడును చంద్రగిరి నుంచి బరిలోకి దింపేందుకు పావులు కదుపుతున్నట్టు దేశం వర్గాల్లో విస్తృతంగా ప్రచారంజరుగుతోంది. 
 
 ఇప్పటివరకు జయదేవ్‌ను మాత్రమే రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్న మంత్రి తాజా పరిణామాల్లో భర్తను కూడా అసెంబ్లీ బరిలోకి తెచ్చేందుకు నిర్ణయించుకున్నట్టు సమాచారం. చంద్రగిరి నియోజకవర్గంలో తమ కుటుంబాన్ని నమ్ముకున్న వారి రాజకీయ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పటివరకు తెలుగుదేశంతో ప్రత్యక్ష పోరాటం చేసిన తాను ఒక్కసారిగా ఆ పార్టీ తరుపున పోటీ చేస్తే ప్రజల్లో వ్యతిరేకత ఎదుర్కోవాల్సి రావచ్చన్న కారణంతో రామచంద్రనాయుడును తెరపైకి తెస్తున్నట్టు దేశం వర్గాల్లో వినిపిస్తోంది. జిల్లాలో రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబంగా గల్లా కుటుంబానికి పేరుంది. 
 
 అయితే ఆ ముద్ర చెరిగిపోకుండా ఉండేందుకు భర్తను రాజకీయాల వైపు ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. ఇప్పటివరకు ఎన్నికల సమయంలో భార్య గెలుపు కోసం తెరవెనుక పాత్ర పోషిస్తూ వచ్చిన రామచంద్రనాయుడు ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకతప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆ కుటుంబానికి సన్నిహితంగా మెలుగుతున్న వారు ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే చంద్రగిరి టికెట్టు గల్లా కుటుంబానికి ఇచ్చే విషయంలో మంత్రి చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయనే విషయంలో కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లుగా అధికారం కోల్పోయి కష్టకాలంలో పార్టీ జెండాలు భుజనావేసుకున్న వారి అవకాశాలను చివరి నిమిషంలో మంత్రి గండికొడుతోందనే ఆందోళన టీడీపీ వర్గాల్లో ఉంది. మొత్తానికి మంత్రి డబుల్‌గేమ్ రాజకీయవర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. 
 
 నారా గిరీష్‌తో చెక్...
 మంత్రి గల్లా అరుణకుమారి చేస్తున్న ప్రయత్నాలకు నారా గిరీష్‌తో చెక్ పెట్టేందుకు తెలుగుదేశంలోని ఒక వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకాలంగా చంద్రగిరిలో గల్లా కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేసి ఇప్పుడు వారితో కలసి పనిచేయడమంటే ఇబ్బందికరంగా వారు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు కుమారుడు గిరీష్‌ను రంగంలోకి తెస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి పదవికి గిరీష్ పేరు పరిశీలనకు వచ్చిన విషయం తెలిసిందే. ఒకప్పుడు రామ్మూర్తినాయుడును పార్టీ నిర్లక్ష్యం చేసిందనే విమర్శలకు ఫుల్‌స్టాప్ పడడంతో పాటు గల్లా ప్రయత్నాలకు కూడా చెక్ పెట్టినట్టు అవుతుందని మంత్రి వ్యతిరేకుల ఎత్తుగడగా కనిపిస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement