అటు పర్యావరణ పరిరక్షణ.. ఇటు జంతు సంరక్షణ

Wild Life Week Celebrates In Prakasam - Sakshi

నల్లమలలో వన్యప్రాణి వారోత్సవాలు

పూర్తిగా ప్లాస్టిక్‌ వాడకం నిషేధం

సాక్షి, మార్కాపురం:  ప్రకాశం, గుంటూరు, కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో సుమారు 2.5లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దుగా ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో ఈ నెల 1నుంచి 7వ తేదీ వరకు వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలు జరుగుతున్నాయి. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మార్కాపురం డీఎఫ్‌ఓ ఖాదర్‌బాష ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో 48 పెద్ద పులులు, 60కి పైగా చిరుతలు, వేల సంఖ్యలో దుప్పులు, జింకలు, ఎలుగుబంట్లు, నెమళ్లు, అరుదైన పంగోలిన్, రాబంధువులు నివసిస్తున్నాయి. వేటగాళ్ల ఉచ్చు నుంచి కాపాడేందుకు అటవీ శాఖాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నల్లమల అటవీ ప్రాంతాన్ని రాజీవ్‌ అభయారణ్యంగా ప్రకటించారు. మొత్తం 24 బేస్‌ క్యాంప్‌లు ఏర్పాటు చేసి 120 మంది టైగర్‌ ట్రాకర్లను నియమించారు. వివిధ ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా విజయపురిసౌత్, కర్నూలు జిల్లా రోళ్లపెంట, శ్రీశైలం, గిద్దలూరు సరిహద్దులుగా నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. దేశంలో పెద్ద పులులు ఎక్కువగా ఉన్న నల్లమల అటవీ ప్రాంతంలో వాటి రక్షణ కోసం రివాల్వర్లను కూడ సిబ్బందికి అందిస్తున్నారు.

1 నుంచి ప్లాస్టిక్‌ నిషేధం 
పర్యావరణ పరిరక్షణలో భాగంగా నల్లమలలో ఈ నెల 1 నుంచి ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు డీఎఫ్‌ఓ ఖాదర్‌బాష తెలిపారు. ఇందు కోసం దోర్నాల –శ్రీశైలం, దోర్నాల– ఆత్మకూరు మధ్య ప్రత్యేక స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయటంతో పాటు దోర్నాల, కొర్రపోలు, శ్రీశైలం గణపతి ఆలయం వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్, ప్లాస్టిక్‌ కవర్లను వాహనాలను తనిఖీ చేసి ఉన్నట్లయితే తొలగిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడ సహకరించాలన్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం, గంధం, ఇనుమద్ది, టేకు లాంటి వక్షాలతో పాటు అరుదైన ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. వాటి సంరక్షణకు కూడ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

అవగాహన కార్యక్రమాలు
వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా మార్కాపురం అటవీశాఖ పరిధిలో అక్టోబర్‌ 1నుంచి7వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డీఎఫ్‌ఓ ఖాదర్‌బాష తెలిపారు. తుమ్మలబయలు ఏకో టూరిజం పార్కుకు విద్యార్థులను తీసుకెళ్లి అవగాహన కల్పించామన్నారు. వ్యాసరచన, వక్తృత్వ పోటీలను ఈ నెల 3న మార్కాపురం జెడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులకు నిర్వహించామన్నారు. 4న యర్రగొండపాలెంలోని కొమరోలుకు దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతాన్ని బీఈడీ, డీఈడీ విద్యార్థులతో కలిసి సందర్శిస్తామని తెలిపారు.
- ఖాదర్‌బాష, డీఎఫ్‌ఓ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top