కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి పుణ్యక్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, భక్తిభావాన్ని...
నరసరావుపేటరూరల్ : కోటప్పకొండలోని శ్రీ త్రికోటేశ్వరస్వామి పుణ్యక్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, భక్తిభావాన్ని పెంపొందిస్తామని సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. శుక్రవారం ఆలయ ఆవరణలో జరిగిన సామూహిక అక్షరాభ్యాసం, మహాసరస్వతి హోమంలో ఆయన పాల్గొన్నారు. చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించి ఆశ్వీరదించారు. అనంతరం త్రికోటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.
ఆయన మాట్లాడుతూ, ఏకాదశి సందర్భంగా శ్రీ మేధాదక్షిణామూర్తి పాదల చెంత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారభించామని, నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. జూలై 1నుంచి ప్రారంభించే వేదపాఠశాలలో 30 మంది విద్యార్థులకు, 8 రకాల కోర్సులను ఇక్కడ బోధిస్తామన్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంజూరు చేసిన రూ.4కోట్లతో భవనాలు నిర్మిస్తామని, టీటీడీ సహకారంతో కొండపై మొక్కలు నాటనున్నట్టు చెప్పారు.
సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి ఇతర జిల్లాల నుంచి తల్లిదండ్రులతో వచ్చిన 300 మంది చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. వారందరికీ పలక, బలపం, పెద్దబాలశిక్ష, సరస్వతీ అమ్మవారి రూపం, కంకణం, ప్రసాదాలు అందజేశారు. అనంతరం తల్లిదండ్రులు తమ చిన్నారులతో సరస్వతీ యాగంలో పాల్గొన్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రామకృష్ణ కొండలరావు బహదూర్, ఈవో శ్రీనివాసరావు, ఎం ఈవో జి.జయకుమార్, సీఆర్పీలు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.