ఆశావహులదీ అదే బాట | when they head north of seats | Sakshi
Sakshi News home page

ఆశావహులదీ అదే బాట

Apr 22 2014 12:29 AM | Updated on Aug 10 2018 8:06 PM

ఆశావహులదీ అదే బాట - Sakshi

ఆశావహులదీ అదే బాట

జిల్లా టీడీపీలో బుసలు కొడుతొన్న అసమ్మతి ఇంకా దారికి రాలేదు. మెట్టు దిగడానికి రెబల్స్ ససేమిరా అంటున్నారు.

  •     టీడీపీ ముఖ్యనేతల మంత్రాంగం విఫలం
  •      అరకు, పాడేరు, విశాఖ ఉత్తరం సీట్లలో తలనొప్పి
  •      సీటురాని నేతల నుంచీ మొదలైన సహాయ నిరాక‘రణం’
  •      బుజ్జగింపులు, ఎరలకు లొంగని రెబల్స్
  •  సాక్షి, విశాఖపట్నం: జిల్లా టీడీపీలో బుసలు కొడుతొన్న అసమ్మతి ఇంకా దారికి రాలేదు.  మెట్టు దిగడానికి రెబల్స్ ససేమిరా అంటున్నారు. ముఖ్యనేతలు మంత్రాంగం నెరుపుతున్నా బెట్టువీడనంటున్నారు. మరోపక్క టిక్కెట్ దక్కని పలువురు ఆశావహులు పార్టీకి విధేయులుగా ఉంటూనే తెరవెనుక సహాయనిరాకరణ మొదలుపెట్టేశారు.

    దీంతో ఇప్పుడు జిల్లాలో టీడీపీ మునుపెన్నడూలేని గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. అరకు,పాడేరు, విశాఖ ఉత్తరం,యలమంచిలో రెబల్స్ నామినేషన్ల ఉపసంహరించుకోకూడదని తాజాగా నిర్ణయించుకోవడంతో టీడీపీ నేతలకు పాలుపోవడంలేదు. అరకు సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే సోమకు ఇచ్చి కొత్తగా పార్టీలో చేరిన కుంబా రవిబాబుకు చంద్రబాబు కోలుకోలేని షాక్ ఇచ్చారు. రెబల్‌గా బరిలో నించున్న ఈయనకు ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పోస్టు ఇస్తామని ఆశచూపారు.

    బాబు మాటలు నమ్మబోనంటూ ఆయన బరిలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. పాడేరులో బీజేపీతో టీడీపీ పొత్తునకు నిరసిస్తూ టీడీపీ అభ్యర్థులు ప్రసాద్, కొత్తపల్లి సుబ్బారావు నామినేషన్లు వేశారు. వీరిలో సుబ్బారావు రెబల్‌గానే ఉండాలని నిర్ణయించుకున్నారు. విశాఖ ఉత్తరంలో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకు వ్యతిరేకంగా మాజీ ఐఏఎస్ అధికారి దువ్వారపు రామారావు రెబల్‌గానే కొనసగాలని నిర్ణయించుకున్నారు.
     
    బీరాలు పలికి నీరుగారిపోయిన సుందరపు
     
    యలమంచిలి టిక్కెట్ తనకు కాకుండా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్లకు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన నియోజకవర్గ ఇంఛార్జి సుందరపు విజయ్ అసంతృప్తితో పార్టీ కార్యాలయాన్ని తన అనుచరులతో తగులబెట్టించారు. టిక్కెట్ ఇచ్చేవరకు ఆమరణ దీక్ష విరమించుకోనని బీరాలు పలికారు. రెబల్‌గా నామినేషన్ కూడా వేశారు.

    పార్టీ అభ్యర్థిని ఓడిస్తానని శపథం పూనారు. మొన్న చంద్రబాబు బుజ్జగించినా ససేమిరా అన్నారు. ఎమ్మెల్సీ ఇస్తానన్నా వద్దని పోటీ చేస్తానని గొప్పలకు పోయారు. తీరా ఇప్పుడు నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు బహిరంగంగా ప్రకటించడంపై అనుచరులు మండిపడుతున్నారు. తనకోసం పార్టీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే..ఇప్పుడు టిక్కెట్ వచ్చిన అ   భ్య ర్థితో చేతులు కలపడంపై గుర్రుగా ఉన్నారు. పార్టీ  ప్రలోభాలకు లొంగిపోయి తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు.         

    పాడేరు,మాడుగుల,చోడవరం,పాయకరావుపేట నియోజకవర్గాల్లో  టిక్కెట్లు ఆశించి భంగపడ్డ పలువురు నేతలు నియోజకవర్గాల్లో పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకు సహకరించకూడదని నిర్ణయించుకున్నారు. రెబల్‌గా నామినేషన్ వేయాలని వీరు మొదట్లో నిర్ణయించినా తద్వారా వచ్చే ప్రయోజనం లేదని భావించిచివరి నిమిషంలో వెనక్కుతగ్గారు. ప్రచారం విషయంలో ప్రస్తుత  అభ్యర్థికి సహకరించకూడదనే భావనలో ఉన్నారు. అభ్యర్థులు వీరిని కలిసేప్రయత్నాలు చేస్తున్నా చిక్కకపోవడంతో ఎలా నెట్టుకురావాలో తెలియక సతమతమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement