మంత్రి మాటలు నీటి మూటలు | water supply stopped to dharmavaram canal | Sakshi
Sakshi News home page

మంత్రి మాటలు నీటి మూటలు

Dec 13 2013 3:12 AM | Updated on Sep 2 2017 1:32 AM

కూడేరు మండల పరిధిలోని పీఏబీఆర్ డ్యాం నుంచి ధర్మవరం కుడికాలువకు బుధవారం నీటి సరఫరాను అధికారులు నిలిపి వేశారు.

కూడేరు, న్యూస్‌లైన్: కూడేరు మండల పరిధిలోని పీఏబీఆర్ డ్యాం నుంచి ధర్మవరం కుడికాలువకు బుధవారం నీటి సరఫరాను అధికారులు నిలిపి వేశారు. చెరువులను నీటితో నింపుతామన్న  మంత్రి రఘువీరారెడ్డి, ఎంపీ అనంతవెంకటరెడ్డి ఆదేశాలు ప్రకటనలకే పరిమితమయ్యాయి.  వివరాల్లోకి వెళితే ‘జీడిపల్లి జలాశయం నుంచి పీఏబీఆర్ డ్యాంకు 400 క్యూసెక్కులు నీటిని విడుదల చేయించాను. కుడికాలువ కు రోజు 300 క్యూసెక్కులు నీటిని విడుదల చేయండి’ అని గత నెల 27న పీఏబీఆర్ డ్యాంను సందర్శించిన సందర్భంగా హెచ్‌ఎల్‌సీ అధికారులకు మంత్రి  రఘువీరారెడ్డి ఆదేశించారు. కాని జీడిపల్లి జలాశయం నుంచి వస్తున్న నీరు నాలుగు రోజులు కిందట ఆగిపోయింది. ప్రస్తుతం డ్యాంలో  1.45 టీఎసీల నీరు నిల్వ ఉంది.

 తాగునీటి ప్రాజెక్టులకు నీటి సరఫరాను దృష్టిలో పెట్టుకొని డ్యాంకు ఇన్‌ఫ్లోలేనందున కుడికాలువకు నీటి సరఫరాను అధికారులు బంద్ చేసినట్లు సమాచారం. డ్యాంలో ఇన్‌ఫ్లో పెరిగితేనే కుడికాలువకు నీటిని  విడుదల చేసే అవకాశం ఉందని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. తుంగభద్ర డ్యాం నుంచి కేటాయింపు మేరకు , జీడిపల్లి జలాశయం నుంచి నికర జలాలను తెప్పించడంలో మంత్రి, ఎంపీ అనంతవెంకటరెడ్డి విఫలమైయ్యారని ప్రజలు నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి.  కుడికాలువ కింద ఉన్న 49 చెరువులకు నీరు చేరే పరిస్థితులు లేవు.  దీంతో రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.   కుడికాలువ నీటి విడుదలపై శ్రద్ధ చూపి చెరువులను నీటితో నింపాలని రైతులు, ప్రజలు మంత్రిని కోరుతున్నారు.

Advertisement

పోల్

Advertisement