గొంతెండుతోంది

Water Problems in Chittoor - Sakshi

జిల్లాలో అడుగంటిన భూగర్భజలాలు

తాగునీటి కోసం విలవిల్లాడుతున్న ప్రజానీకం

వేసవి ఆసరాగా నీటి మాఫియా ఆగడాలు

ప్రభుత్వ స్థలాల్లో బోర్లు వేసి కోట్లలో వ్యాపారం

పశ్చిమ ప్రజానీకం వలసబాట

గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణం

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌: జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వరుణుడు ముఖం చాటేశాడు. 65శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో సగటు నీటిమట్టం 50.21మీటర్ల దిగువకు పడిపోయింది. జిల్లావ్యాప్తంగా 80శాతం బోర్లు ఎండిపోయాయి. పశ్చిమ మండలాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో పడమర మండలాల్లో భూగర్భజలాలు 98 మీటర్ల దిగువకు చేరుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. జిల్లాలోని 66 మండలాల్లో సుమారు 1,225 గ్రామ పంచాయతీల్లో తాగునీటి సమస్య త్రీవంగా ఉంది. ప్రధానంగా 4 వేల గ్రామాలు నీటికోసం అల్లాడుతున్నాయి. గత ప్రభుత్వం తాగునీటి సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం వహించడంతో జిల్లా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణం
జిల్లాలో తాగునీటి సమస్యను గుర్తించి తగు ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు, అధికారులు నిర్లక్ష్యం వహించారు. వేసవిలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ట్యాంకర్లతో, బోర్ల సహాయంతో అందించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ప్రతి మండలంలోనూ తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. బిందెలతో కార్యాలయాల వద్ద ధర్నాలు చేసినా పట్టించుకున్న నాథుడు లేడు. కొన్ని ప్రాంతాల్లో అధికారులు 15రోజులకొకసారి ఒక ట్యాంకర్‌ను పంపి చేతులు దులుపుకుంటున్నారు. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరించడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు గొప్పలు చెప్పుకున్న గత ప్రభుత్వం ఎక్కడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిన దాఖలాలు లేవు. కరువు కాటకాలతో అల్లాడుతున్న పశ్చిమ ప్రాంతాల ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు.

మాటలకే పరిమితమైన ప్రాజెక్టులు
జిల్లాలో నీటి వనరులు ఆశించినంత మేర లేకపోవడం, హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత పాలకుల అలసత్యం ప్రజల పాలిట శాపంగా మారింది. అరణియార్‌ ప్రాజెక్ట్‌లో నీరు లేకపోవడం, స్వర్ణముఖి నదిలో ఇసుక మాఫియా తవ్వకాలతో పరీవాహక ప్రాంతాలు ఎడారిగా మారాయి. ఈ క్రమంలో గ్రామీణులు సైతం తాగునీరు కొనుగోలు చేయకతప్పడం లేదు. గ్రామాల్లో చేతిపంపులు మరమ్మతులకు నోచుకోవడం లేదు.

నీటి మాఫియా ఆగడాలు
జిల్లాలో తాగునీటి సమస్యను గుర్తించిన కొందరు గత ప్రభుత్వం అండదండలతో మాఫియాగా ఏర్పడి కోట్లలో వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూముల్లో, స్వర్ణముఖి పరీవాహక ప్రాంతాలలో విచ్చలవిడిగా బోర్లు వేసి కోట్లకు కోట్లు దండుకుంటున్నారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే 200వరకు బోర్లు వేసి వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. అడ్డుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు, అధికారులు మామూళ్ల మత్తులో పడి సహాయ సహకారాలు అందిస్తున్నారు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్‌ నీటికి రూ.800 నుంచి రూ.1,200 వరకు వసూలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రోజుకు రూ.5 నుంచి 6కోట్ల వ్యాపారం నడుస్తున్నట్లు సమాచారం. తిరుపతి నగరంలోనే రోజుకు రూ.2 నుంచి 3కోట్ల వ్యాపారం జరుగుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

జూన్‌ నుంచి క్యాన్‌ వాటర్‌ రూ.30
జిల్లాలో తాగునీటి సమస్య తారస్థాయికి చేరడంతో ఆర్‌ఓ ప్యూరిఫైడ్‌ వాటర్‌ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. నగరాల్లో ప్రతి సందులోనూ వాటర్‌ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 20లీటర్ల వాటర్‌ క్యాన్‌ రూ.10 నుంచి రూ.20వరకు విక్రయిస్తున్నారు. దీన్ని జూన్‌ ఒకటో తేదీ నుంచి రూ.30కి పెంచాలని వాటర్‌ప్లాంట్‌ అసోసియేషన్‌ నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇదే నిజమైతే సామాన్యులు తాగునీరు కొనలేని పరిస్థితి. గత ప్రభుత్వం ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎన్టీఆర్‌ సుజల స్రవంతి పేరుతో రూ.2కే 20లీటర్ల నీరు అంటూ ఆర్భాటంగా పథకాన్ని ప్రవేశపెట్టింది. సమగ్రంగా అమలు చేయకపోవడంతో ప్రారంభంలోనే నీరుగారిపోయింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top