గొంతెండుతోంది

Water Problem In Psr Nellore - Sakshi

తాగునీటికి కష్టాలు

వలసబాట పట్టిన పల్లెలు

ఈ చిత్రంలో కనిపిస్తున్న బోరుని ఉదయగిరి మండలం కొట్టాలపల్లిలో వారం రోజుల క్రితం వేశారు. 480 అడుగుల లోతులో ఇంచ్‌ నీరు పడింది. అవి కూడా తాగేందుకు పనికిరాని ఉప్పునీరు. గతంలో ఇదే గ్రామంలో వందడుగులు బోరు వేస్తే పుష్కళంగా నీరు పడేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. గ్రామంలో 70 కుటుంబాలున్నాయి. రెండు రక్షిత మంచినీటి పథకాలు, రెండు చేతిపంపుల్లో నీరు పూర్తిగా ఇంకిపోయింది. దీంతో గ్రామానికి చెందిన రామారావు, చెన్నకేశవుల కుటుంబాలు వలసవెళ్లాయి. ప్రస్తుతం ఈ గ్రామస్తులు గుక్కెడు మంచినీరు కావాలన్నా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవి పేరంటాలమ్మ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంటుకు పరుగు పెట్టవలసిందే.   

ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గంలోనే పెద్ద పట్టణమైన వింజమూరులో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. పట్టణంలోని 35 వేల జనాభా ఇప్పటికే నీటి కోసం తంటాలు పడుతున్నారు. రక్షిత మంచినీటి పథకాల్లో నీరు అడుగంటింది. చాలామంది ఇళ్లల్లో వేసుకున్న బోర్లలో కూడా నీరు తగ్గిపోయింది. గతేడాది మే నెలలో ఇదే పట్టణంలో నీటి సమస్య తలెత్తగా ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే నీరు సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ముందుముందు ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలనే బెంగ అటు ప్రజల్లోనూ, ఇటు అధికారుల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాకు అధిక వర్షపాతాన్నిచ్చే ఈశాన్య రుతుపవనాలు ముఖం చాటేయడంతో నవంబరు, డిసెంబరు నెలల్లో వర్షాలు కురవలేదు. దీంతో జిల్లాలోని 95 శాతం చెరువులకు నీరు చేరలేదు. కేవలం డెల్టా ప్రాంతాలకు మాత్రమే సోమశిల ద్వారా నీరు సరఫరా అయ్యింది. ఉదయగిరి, కావలి, ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లోని మెట్ట ప్రాంతాల్లో తీవ్ర నీటికొరత పొంచి ఉంది. ఉదయగిరి నియోజవర్గంలో ఒక్క జలదంకి మండలం మినహా మిగతా ప్రాంతాల్లో ఈ ప్రభావం కనిపిస్తోంది.

వలసబాట పట్టిన పల్లెలు  
తాగునీటి సమస్యతో ఉదయగిరి నియోజకవర్గంలోని సీతారామపురం, ఉదయగిరి, వరికుంటపాడు మండలాల్లోని పలు కుటుంబాలు వలసబాట పట్టాయి. నియోజకవర్గంలోని సుమారు 360 గ్రామాల్లో ఈ వేసవిలో తాగునీటి సమస్య తలెత్తే అవకాశమున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే జిల్లాలో 2700 ఆవాసాల్లో నీటి సమస్య పొంచివుందని ముందస్తు అంచనా వేశారు. తాగునీటి సమస్యను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇటీవల జరిగిన అధికారుల సమావేశంలో కలెక్టర్‌ ఆదేశించారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. అయితే గతేడాది ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసిన యజమానులకు ఇంతవరకు నిధులు విడుదల చేయకపోవడంతో ఈ ఏడాది సరఫరా చేసేందుకు ఎవరూ ముందుకురావడం లేదు.

పశువుల పరిస్థితీ అంతే  
పాడి రైతులకు ఈ ఏడాది కలిసి రాలేదు. కరువు నేపథ్యంలో పశుగ్రాసం కొరత వేధిస్తోంది. అలాగే పశువులకు తాగునీరు దొరకడం కష్టంగా మారింది. దీంతో చాలామంది పాడి రైతులు గేదెలను తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. కొందరు గొర్రెలు, మేకల కాపరులు సుదూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చి డ్రమ్ముల్లో నిల్వ చేసుకుని వినియోగిస్తున్నారు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చే రెండు నెలల్లో పరిస్థితులు మరింత దారుణంగా ఉండనున్నాయి. 

పంటలు ఎండిపోయాయి
వ్యవసాయ బోర్లలో నీరు లేక పంటలు ఎండిపోయాయి. పశువులకు మేత దొరకడం లేదు. బోర్ల నుంచి గుక్కెడు నీరు వచ్చే పరిస్థితి లేదు. మా గ్రామంలో ఉన్న నాలుగు బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. దీంతో రెండు కిలోమీటర్లు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.  ఇంత ఇబ్బంది పడుతున్నా అధికారులకు మా గోడు పట్టడం లేదు.
–  గడ్డం చంద్రకుమారి, కొట్టాలపల్లి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top