వార్డు హద్దులు.. ఓటర్ల సంఖ్య మారుతున్నాయ్‌

Wards Reorganization In Kavali Municipality - Sakshi

సాక్షి, కావలిః కావలి మున్సిపాలిటీలో వార్డుల సరిహద్దులు, ఓటర్లు సంఖ్య మారుతున్నాయి. పట్టణంలో పురుషులు – 46,655, మహిళలు– 49,406 , థర్డ్‌ జెండర్‌– 21 ఓటర్లుగా ఉన్నారు. కాగా కావలి మున్సిపాలిటీలో వార్డుల సంఖ్యపై అయోమయం కొనసాగుతోంది ఉంది. రానున్న మున్సిపల్‌ ఎన్నికలకు ప్రస్తుతం ఉన్న వార్డుల సంఖ్య 40 యథాతదంగానే ఉంటుందా, సంఖ్యలో మార్పు చోటు చేసుకొంటుందా అనే అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. 2014లో  ఎన్నికలు జరిగినప్పుడు కావలి మున్సిపాలిటీ ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా ఉండింది. ఈ ప్రకారం 40 వార్డులు చేసి ఎన్నికలు నిర్వహించడంతో ప్రస్తుత పాలకవర్గం అధికారంలో ఉంది. కాగా రెండేళ్ల క్రితం కావలి మున్సిపాలిటీని ప్రభుత్వం మొదటి శ్రేణి మున్సిపాలిటీగా హోదా పెంచింది.

కావలి: ప్రస్తుతం అమల్లో ఉన్న మున్సిపల్‌ చట్టం ప్రకారం మొదటి శ్రేణి మున్సిపాలిటీగా పరిగణలోకి తీసుకొని, పట్టణంలో ఉన్న జనాభా ప్రకారం ( 2011 జనాభా లెక్కలు ప్రకారం) 35 వార్డులు కానీ, 37 వార్డులు కానీ చేయాల్సి ఉంది. అయితే ఇటీవల కాలంలో మున్సిపాలిటీ అత్యున్నత స్థాయి వర్గాలు పట్టణాలలో వార్డుల సంఖ్య అవకాశం ఉన్నంత మేరకు పెంచాలని, దానివల్ల పరిపాలన సౌలభ్యత పెరుగుతుందని నిర్ణయించారు. అలాగే పట్టణంలో ప్రజలకు మున్సిపాలిటీ ద్వారా నాణ్యమైన సేవలు అందించడానికి దోహదపడుతుందని నిశ్చితాభిప్రాయానికి వచ్చారు. ఈ నిర్ణయం కావలి మున్సిపాలిటీలో అమలు పరిస్తే 42 వార్డులు చేయాల్సి ఉంది. ఇలా మున్సిపాలిటీలో వార్డు సంఖ్యపై అస్పష్టత కొనసాగుతుండగానే, స్థానిక మున్సిపాలిటీ అధికారులు వార్డులు వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించారు.

గత మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టణంలో 75,388 ఓటర్లు ఉండగా, ఇప్పుడు 96,082 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో వార్డుకు గతంలో గరిష్టంగా 2,485 ఉండగా, తాజాగా ప్రకటించిన ఓటర్లు జాబితా ప్రకారం వార్డుకు గరిష్టంగా 3,336 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే గతంలో వార్డుకు కనిష్టంగా 1,259 ఓటర్లు ఉండగా, తాజాగా ప్రకటించిన జాబితా ప్రకారం వార్డుకు కనిష్టంగా1,661 మంది ఓటర్లు ఉన్నారు. అంటే గత ఎన్నికల నాటి కంటే ఇప్పుడు పట్టణంలో ఓటర్లు 20,699 మంది పెరగడంతో, ప్రతి వార్డులో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగారు. ఈ అంశాలను కావలి మున్సిపాలిటీ అధికారులు నిర్దిష్టంగా రాష్ట్ర మున్సిపల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడంతో, అసలు కావలి మున్సిపాలిటీ మొదటి శ్రేణి అయిన అంశాన్ని కూడా రాష్ట్ర స్థాయి మున్సిపల్‌ అత్యున్నత వర్గాలు గమనించలేదు. అందుకే 2014లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల నాటి నుంచి ఎటువంటి మార్పులు చోటుచేసుకుని మున్సిపాలిటీల జాబితాలో కావలి మున్సిపాలిటీ చేరింది.

అందుకే అప్పట్లో రాష్ట్రస్థాయిలో వార్డుల పునర్విభజన చేయాల్సిన మున్సిపాలిటీల జాబితాలో కావలి మున్సిపాలిటీకి చోటు దక్కలేదు. కాగా తాజాగా ప్రభుత్వం కావలి మున్సిపాలిటీలో వార్డుల సరిహద్దులను, ఓటర్ల సంఖ్యను మార్చాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 11వ తేదీలోగా ప్రజలు ఇప్పుడు అమల్లో ఉన్న వార్డుల సరిహద్దులపై అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా మున్సిపాలిటీల కార్యాలయంలో తెలియజేయాలని కమిషనర్‌ కె.వెంకటేశ్వరరావు ప్రకటించారు. పట్టణంలో ప్రస్తుతం మొత్తం 96,082 ఓటర్లు ఉండగా, అసలు డోర్‌ నంబర్లు లేనివి ఉండగా 2,000 ఓట్లు, మరో 2,000 ఓటర్లు 11–33 డోర్‌ నెంబర్‌తో ఉన్నాయి. ఇప్పుడున్న వార్డులలో ఓటర్లు సంఖ్య కూడా గందరగోళంగా ఉంది. దీనిని కూడా సరిదిద్దే ప్రయత్నం జరగనున్నది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top