ఏం జరుగుతుందో ? | Vizianagaram District ZP chairman Controversy | Sakshi
Sakshi News home page

ఏం జరుగుతుందో ?

Feb 4 2015 2:32 AM | Updated on Aug 11 2018 3:38 PM

ఏం జరుగుతుందో ? - Sakshi

ఏం జరుగుతుందో ?

ఉపాధి పనుల కేటాయింపు రగడ ఎక్కడికి దారితీస్తుందో తెలియడం లేదు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభా

 పనుల కేటాయింపు నిలిపేయాలని జెడ్పీ చైర్‌పర్సన్‌కు మంత్రి ఆదేశం
  ఈసారికి ఇలాగే కానీయాలన్న  చైర్‌పర్సన్ స్వాతిరాణి
  కలెక్టర్ వద్ద ఫైల్
  మంత్రి, జెడ్పీ చైర్‌పర్సన్ వివాదంపై పార్టీ వర్గాల్లో విసృ్తత చర్చ  

 
 సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఉపాధి పనుల కేటాయింపు రగడ ఎక్కడికి దారితీస్తుందో తెలియడం లేదు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కిమిడి మృణాళిని, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి మధ్య జరుగుతున్న అంతర్గత పోరులో ఎవరిది పైచేయి అవుతుందన్న దానిపై పార్టీ నేతల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కలెక్టర్ వద్దకు చేరింది.  ఆయన తీసుకునే నిర్ణయంకోసం అందరూ ఎదురు చూస్తున్నారు.  వారం రోజులుగా  ఆ ఇద్దరు నేతలు హైదరాబాద్‌లో ఉండడంతో వ్యవహారం గుంభనంగా ఉండిపోయింది. కానీ వారిలో జెడ్పీచైర్‌పర్సన్ ఇప్పటికే జిల్లాకొచ్చారు. మంత్రి కూడా జిల్లాకు రానున్నారు. దీంతో కలెక్టర్‌పై  ఒత్తిడి  రాక తప్పదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం  మెటీరియల్ కాంపోనెట్ పనుల కింద జిల్లాకు రూ. 35కోట్లు కేటాయించారు. వీటి ద్వారా తమ నేతల మెప్పు పొందాలని అటు జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతి రాణి, మంత్రి మృణాళిని ఆరాటపడుతున్నారు.
 
  ఇరువురు వేర్వేరుగా కేటాయింపులు చేసి, మండలాల వారీగా ప్రతిపాదనలు పంపించాలని తమ నేతలకు సూచించిన విషయం తెలిసిందే. ఇందులో జెడ్పీ చైర్‌పర్సన్ కాసింత ముందంజలో నిలిచారు. అలా వచ్చిన ప్రతిపాదనలపై జెడ్పీ ద్వారా తీర్మానం చేసి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా కలెక్టర్‌కు పంపించారు.  ఇంతలోనే కొందరు నేతలకు సందేహం వచ్చి మంత్రిని వాకబు చేయడంతో జెడ్పీ చైర్‌పర్సన్, మంత్రి ఇద్దరూ  కాంపోనెట్ పనుల కోసమే ప్రతిపాదనలు స్వీకరించారని తేలింది. దీంతో మంత్రి రంగంలోకి దిగి   పనుల ప్రతిపాదనలను నిలిపేయాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ను ఆదేశించినట్టు సమాచారం. జిల్లా వ్యాప్తంగా ప్రతిపాదనలు తీసుకున్నాక ఎలా నిలిపేస్తామని, జెడ్పీ తీర్మానంతోనే వెళ్లాలని చైర్‌పర్సన్ కరాఖండీగా చెప్పినట్టు  తెలియవచ్చింది.
 
 ఈ సందర్భంలో ఓవర్ టేక్ చేస్తున్నావని, మంచిది కాదని చైర్‌పర్సన్ స్వా తిరాణిని మంత్రి వారించినట్టు కూడా బయట వినిపిస్తోంది. ఈ సారికైతే  ప్రతిపాదిత కేటాయింపులు ఆపేది లేదని,   భవిష్యత్‌లో ఉపాధి నిధులు మంజూరైతే మీ ప్రకారంగా చేసుకోవాలని  మంత్రికి తెగేసి చెప్పినట్టు సమాచారం. ఇంతలోనే హైదరాబాద్‌లో శిక్షణా తరగతులకోసం ఆ ఇద్దరు నేతలు వెళ్లడంతో ఆ వ్యవహారం అలా ఉండిపోయింది. శిక్షణా తరగతులు ముగియడంతో ఇప్పటికే చైర్‌పర్సన్ స్వాతిరాణి జిల్లాకొచ్చారు. మంత్రి కూడా ఈరోజు, రేపో జిల్లాకొచ్చే అవకాశం ఉంది. ఉపాధి పనుల ప్రతిపాదిత ఫైలు కలెక్టర్ వద్ద ఉంది. మంత్రి తన పంతం నెగ్గించుకోవాలంటే కలెక్టర్ వద్దే ఆ ఫైలు ఆపేయాలి. అంటే తప్పనిసరిగా కొర్రి వేయాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించే అవకాశం ఉంది. అదే జరిగితే చైర్‌పర్సన్ ప్రతిఘటనను కలెక్టర్ ఎదుర్కోవల్సి ఉంటుంది. ఒకవేళ  మంత్రి వెనక్కి తగ్గితే చైర్‌పర్సన్ మాట చెల్లుబాటు అయినట్టు అవుతుంది.  ఈ నేపథ్యంలో  కలెక్టర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని   పార్టీ వర్గాల్లో  విసృ్తత చర్చ నడుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement