ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా మారనుంది విశాఖ వాసుల పరిస్థితి.
సాక్షి, విశాఖపట్నం: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా మారనుంది విశాఖ వాసుల పరిస్థితి. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న తెలుగుదేశం మహానాడు నగరాన్ని ట్రాఫిక్ దిగ్బంధంలోకి నెట్టనుంది. నగరానికి నడిబొడ్డున ఉన్న ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మహానాడును నిర్వహించడాన్ని విద్యార్థి, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.
మహానాడు వేదిక జాతీయ రహదారి (ఎన్‌హెచ్–16)కు చేరువలో ఉంది. హైవేలో ఉన్న మద్దిలపాలెం జంక్షన్ నుంచి ఏయూ, ఓల్డ్ సీబీఐ, పెదవాల్తేరు, చినవాల్తేరు, లాసన్స్‌బే కాలనీ, వుడా పార్క్, బీచ్ రోడ్ తదితర ప్రాంతాలకు వెళ్లాలంటే మహానాడు జరిగే మైదానం పక్కన ఉన్న డబుల్ రోడ్ మీదుగానే వెళ్లాలి. నిత్యం ఆ రోడ్డులో వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
ఇలాంటి స్థితిలో మహానాడు జరిగే మూడు రోజులే కాకుండా రెండు రోజుల ముందుగానే ఆ రోడ్డును బ్లాక్ చేయనున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే రద్దీతో నిత్యం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి పడరానిపాట్లు పడుతున్నామని వాహన చోదకులు ఆవేదన చెందుతున్నారు.