విశాఖ–చెన్నై కారిడార్‌కు ఆమోదం లేదు

The Visakha-Chennai Corridor Is Not Approved - Sakshi

రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి పీయూష్‌ గోయల్‌ జవాబు 

సాక్షి, విశాఖపట్నం: విశాఖ–చైన్నై మధ్య ఈస్ట్‌ కోస్ట్‌ ఎకనామిక్‌ కారిడార్‌లో భాగంగా ఇండస్ట్రియల్‌ కారి డార్‌ పనులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనకు నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ ట్రస్ట్‌(ఎన్‌ఐసీడీఐటీ) ఇంకా ఆమోదం తెలపలేదని శుక్రవారం రాజ్యసభలో పరిశ్రమల శాఖ మంత్రి పీయూస్‌ గోయల్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టు అభివృద్ధి కోసం ఎలాంటి నిధుల కేటాయింపు కూడా జరగలేదన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబు చెబుతూ విశాఖ–చైన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో భాగంగా విశాఖపట్నం, మచిలీపట్నం, చిత్తూరు, దొనకొండలను అభివృద్ధి కేంద్రాలుగా ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌(ఏడీబీ) గుర్తించినట్లు మంత్రి చెప్పారు.

ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ ప్రాజెక్టు పనుల కోసం ఏడీబీ బ్యాంక్‌ ఇప్పటివరకు రూ.63.1 కోట్లను విడుదల చేసింది. నాలుగు కేంద్రాల్లో ముందుగా విశాఖపట్నం, చిత్తూరును ప్రధానంగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఏడీబీ బ్యాంక్‌ ఆర్థిక సాయంతో నాయుడుపేటలో నీటి శుద్ధి కేంద్రాన్ని, పారిశ్రామిక ప్రాంతాన్ని మెరుగుపరిచే చర్యలు చేపట్టింది. బల్క్‌ వాటర్‌ సప్‌లై, సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ల నిర్మాణం జరుగుతోంది. విశాఖ, చిత్తూరులో విద్యుత్‌ సబ్‌స్టేషన్లు సామర్థ్యం పెంచే పనులు జరగుతున్నాయి. నాయుడుపేట, రౌతుసురమాలలోని పారిశ్రామిక క్లస్టర్‌లకు రోడ్డు అభివృద్ధి చేసే పనులు జరుగతున్నట్లు మంత్రి తెలిపారు.

ముందుగా విశాఖ–చిత్తూరు కేంద్రాల అభివృద్ధి..
విశాఖ–చైన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో ముందుగా విశాఖ–చిత్తూరు కేంద్రాలను అభివృద్ధి చేసే అంశాన్ని చేర్చాలని ఏపీ ప్రభుత్వం ఎన్‌ఐసీడీఐటీని కోరిందని మంత్రి చెప్పారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే దీని మాస్టర్‌ ప్లాన్, ఇంజినీరింగ్‌ పనుల చేపట్టి మౌలిక వసతుల కల్పన కింద వివిధ అంశాలకు అయ్యే వ్యయాన్ని అంచనా వేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ ఇంకా అభివృద్ధి చేసే దశలోనే ఉన్నందున ఎప్పటికీ పూర్తవుతుందన్న అంచనా లేదని తెలిపారు.  ఇండస్ట్రియల్‌ కారిడార్‌ కోసం విశాఖలో 6629 ఎకరాలు భూమి సేకరించాల్సి ఉన్నట్లు మంత్రి తెలిపారు. విశాఖ, చిత్తూరు కేంద్రాల అభివృద్ధి కోసం మొత్తం 31,515 వేల ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉండగా ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు 4891 ఎకరాలు సేకరించినట్లు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top