విశాఖ ఎయిర్‌పోర్ట్‌ సీఎస్‌వో బదిలీ

Visakha Airport CSO Venugopal was transferred to Chennai - Sakshi

చెన్నైకి సాగనంపిన ఏఏఐ

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్న కుట్రదారులకు సహకరించారని ఆరోపణలు

కేసులో సూత్రధారిగా భావిస్తున్న హర్షవర్ధన్‌తో చెట్టపట్టాల్‌

ఆది నుంచి వేణుగోపాల్‌ది వివాదాస్పద తీరే

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కుట్రదారులకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ ఎయిర్‌పోర్ట్‌ చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ (సీఎస్‌వో) వేణుగోపాల్‌ను ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) చెన్నైకి బదిలీ చేసింది. జాతీయ స్థాయిలో కలకలం రేపిన వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో కుట్రకోణం బయటపడకుండా, సూత్రధారుల జోలికి వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘సిట్‌’ మొక్కుబడిగా విచారణ చేస్తుంటే.. కేంద్ర పరిధిలోని సీఐఎస్‌ఎఫ్, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా మాత్రం కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అనుమానితులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై అప్పుడే చర్యలు మొదలు పెట్టాయి. ఘటన జరిగిన అక్టోబరు 25న అనుమానాస్పదంగా వ్యవహరించిన సీఎస్‌వో వేణుగోపాల్‌ను చెన్నైకి సాగనంపుతూ శనివారం  ఉత్తర్వులు వెలువడ్డాయి.

ఆది నుంచీ టీడీపీ నేతలతోనే..
ఐదేళ్లుగా విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోనే కొనసాగుతున్న వేణుగోపాల్‌కు ఇప్పటివరకు రెండుసార్లు బదలీ ఉత్తర్వులు వచ్చినా అధికార పార్టీ నేతల అండతో నిలిపివేయించుకున్నారు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ నేతలతో అంటకాగే వేణుగోపాల్‌.. జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు పనిచేస్తున్న ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌ ప్రసాద్‌ చౌదరితో కూడా చెట్టపట్టాల్‌ వేసుకుని తిరిగేవారు. ఘటన జరిగిన రోజు ఆయన వ్యవహారశైలి జగన్‌పై హత్యాయత్న కుట్రకు సహకరించారనేలా ఉంది. ఇదే విషయమై సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు వేణుగోపాల్‌ వ్యవహారశైలిని సూటిగా ప్రశ్నించారు కూడా. హత్యాయత్న ఘటన జరిగిన సమయంలో వైఎస్‌ జగన్‌ పక్కన ఉండకుండా నిందితుడు శ్రీనివాసరావు వెంట ఎందుకు పరుగులు తీయాల్సి వచ్చిందని నిలదీశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా వారు వేణుగోపాల్‌పై ప్రశ్నలు కురిపించారు.

కప్పు కాఫీకి అనుమతించలేదుగానీ..
వైఎస్‌ జగన్‌ గత రెండు నెలలుగా ఎయిర్‌పోర్టుకు విచ్చేసిన సందర్భాల్లో వైఎస్సార్‌సీపీ స్థానిక నేత జియ్యాని శ్రీధర్‌ ఇంటి నుంచి కాఫీ వచ్చేది. హత్యాయత్న ఘటనకు రెండు వారాల క్రితం సీఎస్‌వో వేణుగోపాల్‌.. బయటి నుంచి కాఫీ తీసుకురావడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. వైఎస్‌ జగన్‌కు ఒక్కరికే ఇంటి నుంచి తీసుకువస్తామని ఎంత చెప్పినా వేణుగోపాల్‌ అంగీకరించలేదు. ఇదే అదనుగా శ్రీనివాసరావు వీవీఐపీ లాంజ్‌లోకి వచ్చి జగన్‌పై హత్యాయత్నం చేయడం చూస్తుంటే ఉద్దేశ్యపూర్వకంగానే వేణుగోపాల్‌ బయట నుంచి వస్తున్న కాఫీని అడ్డుకున్నారా.. అన్న అనుమానాలు తలెత్తాయి.సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌లే కాదు.. మంత్రి గంటా, స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి కూడా బయటి నుంచి వచ్చే ఫుడ్‌నే ఎయిర్‌పోర్ట్‌ వీవీఐపీ లాంజ్‌లో తీసుకుంటుంటారు. వైఎస్‌ జగన్‌కు తీసుకువచ్చే కాఫీ విషయంలో వేణుగోపాల్‌ వ్యవహరించిన తీరుతోపాటు  శ్రీనివాసరావు ఎయిర్‌పోర్టులోకి స్వేచ్ఛగా కత్తులు తీసుకువచ్చినా అడ్డుకోలేకపోవడంతో ఆయనపై సందేహాలు బలపడ్డాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top