
సిఫారసుల కొండ !
కొత్త ఏడాదికి తిరుమల కొండ వీఐపీలతో పోటెత్తనుంది. ఇప్పటికే పలువురు లేఖలు పంపించారు. మరికొందరు వీఐపీ సిఫారసుల తో క్యూ కడుతున్నారు.
* కొత్త ఏడాదికి పోటెత్తనున్న తిరుమల
*ఇప్పటి నుంచే మొదలైన లేఖలు
* వైకుంఠ ఏకాదశికీ అదే తాకిడి
సాక్షి, తిరుపతి : కొత్త ఏడాదికి తిరుమల కొండ వీఐపీలతో పోటెత్తనుంది. ఇప్పటికే పలువురు లేఖలు పంపించారు. మరికొందరు వీఐపీ సిఫారసుల తో క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సారి సాధారణ భక్తుల దర్శనం గాలికేననే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. సాధారణంగా తిరుమలలో శ్రీవారిని రోజుకు 60 నుంచి 70 వేల మంది మాత్రమే ద ర్శించుకోవచ్చు. కొత్త సంవత్సరం నేపథ్యంలో ఈ సంఖ్య లక్ష దాటవచ్చని అంచనా. ఈ మేరకు టీటీడీ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
సాధారణ భక్తుల కన్నా, వీఐపీ భక్తుల సౌకర్యాలపైనే టీటీడీ దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. సాధారణ భక్తులు క్యూలో వచ్చి వెళ్లిపోతారు.. వీఐపీలకు ప్రత్యేక దర్శనాలు, వారికి గదులు తదితరాలతో ఏ విధంగా సంతృప్తిపరచాలనే విషయంపై టీటీడీ తర్జనభర్జన పడుతోంది. టీటీడీ ట్రస్టు బోర్డు చైర్మన్, సభ్యుల సిఫారసులతో పాటు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల సిఫారసులకు సంబంధించిన భక్తులు 20 నుంచి 30 వేల మందికి తక్కువ కాకుండా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరికే సమయం సరిపోతే, సాధారణ భక్తులకు టీటీడీ ఏ విధంగా న్యాయం చేస్తుందో అధికారులకే తెలియాలి.
టీటీడీ వీఐపీ పాస్‌లను నియంత్రించేందుకు, నిర్ణీత సంఖ్యలో అందజేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. టీటీడీకి చెందిన ఒక అధికారి మాట్లాడుతూ ఎవరినీకాదనే పరిస్థితి ఉండదని, టీటీడీ బోర్డు సభ్యులు తమతమ కుటుంబ సభ్యులను వెన్నంటి తీసుకుని వెళతారని, ఈ సమయంలో వారిని వీఐపీ పాస్ అడగలేమన్నారు. ఇప్పటికే టీటీడీ కార్యాలయానికి వేల సంఖ్యలో సిఫారసు లేఖలు వచ్చాయని, వీరందరికీ వీఐపీ పాస్‌లు పంపినా, వేల సంఖ్యలో అవుతాయని తెలిపారు. దర్శనంతో పాటు వసతి గదుల కేటాయింపులోనూ సమస్యలు తలెత్తనున్నాయని తెలిపారు. ఇప్పటికే బోర్డు సభ్యులు కొన్ని గదులను ఆక్రమించుకుని ఉన్నారని తెలిపారు. చైర్మన్ కూడా దాదాపు పది గదుల్లో తమకుటుంబ సభ్యులతో ఉంటున్నారని చెప్పారు. వీరిని ఎవరూ అడగలేరని, భక్తుల ఇబ్బందిని తెలుసుకుని వారే గదులు టీటీడీకి అప్పగించాలని సూచించారు. అయితే ఎవరూ గదులను ఖాళీ చేసే పరిస్జితిలో లేరని వాపోయారు.
వైకుంఠ ఏకాదశికీ అదే తాకిడి
వైకుంఠ ఏకాదశికీ ఇప్పటి నుంచే సిఫారసుల తాకిడి మొదలైనట్లు తెలిసింది. వైకుంఠ ఏకాదశి వచ్చేనెల 11వ తేదీ కాగా, ద్వాదశి రోజునా భక్తుల కోసం వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. అయితే ఎక్కువ మంది ఏకాదశి రోజునే స్వామి వారి దర్శనంచేసుకోవాలని భావిస్తారు. దీంతో ఆ రోజు కూడా తాకిడి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ మూడు రోజుల తాకిడిని ఏ విధంగా టీటీడీ ఎదుర్కొంటుందో, సాధారణ భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం ఎలా కల్పిస్తుందో వేచి చూడాల.