లచ్చిరాజుపేటకు అచ్చిరాని వినాయక చవితి

Vinayaka Chaturthi Ban In Lachiraju Peta Vizianagaram District - Sakshi

ఆ ఊరిలో వినాయక చవితి చేస్తే అశుభం కలుగుతుందని బలపడిన నమ్మకం

తాజాగా మరోసారి విఫలమైన యువత ప్రయత్నం 

సాక్షి, పార్వతీపురం(విజయనగరం): వినాయకుడు ఆదిదేవుడు. వినాయకుని పూజకు ప్రతీ ఒక్కరూ ఆసక్తి చూపుతారు. భక్తిశ్రద్ధలతో పూజలో పాల్గొంటారు. వినాయకుని విగ్రహం మండపానికి తీసుకువచ్చేందుకు యువత తహతహలాడుతుంటారు. చందాలు ఎత్తుకుంటారు. మండపాన్ని రంగులతో అలంకరిస్తారు. చిన్నా పెద్దా అని తేడాలేకుండా నృత్యాలు చేస్తూ, భజనలు చేస్తూ ఆనందంగా గడుపుతారు. అయితే... విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం లచ్చిరాజుపేట గ్రామ ప్రజలకు ఆ సంతోషం దూరమయ్యింది. గత రెండు దశాబ్దాలుగా ఆ గ్రామ ప్రజలు వినాయక చవితి ఉత్సవాలకు దూరంగా ఉంటున్నారు. వినాయక చవితి అంటేనే ఆ గ్రామ ప్రజల గుండెల్లో గుబులు రేగుతోంది. వినాయక చవితి ఏర్పాట్లు చేస్తామని ఆలోచన చేస్తేనే  చాలా... ఏదో ఒక రూపంలో అశుభం జరుగుతుందన్నది గ్రామస్తుల నమ్మకం. గతంలో రెండు పర్యాయాలు వినాయక చవితి ఏర్పాట్లు చేసే సమయంలో మరిపి అచ్చియ్య(40), కోరాడ గంగవేణి(25)చనిపోయారు. దీంతో 20 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడం మానేశారు.

తాజాగా మరో ఘటన.. 
గ్రామ యువత అంతా చేయిచేయి కలిపి ఈ ఏడాది వినయాక చవితిని జరుపుకోవాలని నిశ్చయించారు. ఇందులో భాగంగా ఓ రోజు ఆలస్యంగా మంగళవారం ఉదయం గ్రామంలోని కొందరు యువత వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసేందుకు పార్వతీపురం పట్టణానికి వచ్చారు. అయితే యువత వినాయక విగ్రహం కొనుగోలు చేయకముందే వారికి ఒక ఫోన్‌ వచ్చింది. గ్రామానికి చెందిన అంబటి నారాయణమ్మ(80) అనే వృద్ధురాలు మృతి చెందిందని గ్రామస్తులు తెలియజేశారు. దీంతో యువత విగ్రహం కొనుగోలు చేయకుండానే వెనుదిరిగారు. దీనికి పరిష్కారం ఏమిటనే విషయాన్ని గ్రామ పెద్దలు పండితులతో చర్చించేందుకు సిద్ధమవుతున్నారు.

సరదాగా చేద్దామనుకున్నాం..
వినాయక చవితిని పండగలా జరుపుకోవాలనుకున్నాం. మాకు తెలిసి 20 సంవత్సరాలుగా ఈ పండగ చేయలేదు. ఎప్పుడో ఏదో జరిగిందని ఇప్పుడు కూడా అలాగే ఎందుకు జరుగుతుందని భావించాం. యువకులంతా కలసి వినాయక చవితి ఏర్పాట్లు చేసుకుందామనుకున్నాం. ఒక రోజు ఆలస్యంగా అయినా ఫరవాలేదు.. వినాయక విగ్రహాన్ని తీసుకువచ్చి చవితి పండగను చేద్దామని భావించాం. విగ్రహం కొనుగోలు చేయడానికి నేను పార్వతీపురం వచ్చాను. ఇంతలోనే ఊరి నుంచి ఫోన్‌ వచ్చింది. ఊరిలో వృద్ధురాలు చనిపోయిందని. దీంతో మా లచ్చిరాజు పేటకు వినాయక చవితి అచ్చిరాదని మరోసారి రుజువైంది. –  వెంకటరమణ, లచ్చిరాజు పేట 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top