పల్లెపై బూడిద పడగ..

Villagers Facing Lot Of Problems In PSR Nellore Due To Power Generation Projects - Sakshi

సాక్షి, తోటపల్లిగూడూరు: తీర ప్రాంతం పల్లెలపై బూడిద పడగేస్తోంది. పచ్చని పల్లెలు పవర్‌ ప్రాజెక్ట్‌లు వెదజల్లే వాయు కాలుష్యం దెబ్బకు విలవిలలాడుతున్నాయి. మండలంలోని వరకవిపూడి పంచాయతీ అనంతపురంలో సెంబ్‌కార్ఫ్‌ గాయత్రి పవర్‌ ప్రాజెక్ట్‌ (ఎన్‌సీసీపీపీఎల్‌) ఏర్పాటైంది. 1,300 మెగావాట్ల విద్యుతుత్పత్తి లక్ష్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌ ప్రస్తుతం విద్యుతుత్పత్తి కొనసాగిస్తోంది. దీనికి సమీపంలోనే టీపీసీఎల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ కూడా తన కార్యకాలాపాలను సాగిస్తోంది. విద్యుతుత్పత్తి ప్రారంభించిన సెంబ్‌కార్ఫ్‌ గాయత్రి పవర్‌ ప్రాజెక్ట్‌ ఏడాదికే విషవాయువుల రూపంలో తన విశ్వరూపం చూపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ నుంచి బూడిద రూపంలో వెలుబడుతున్న విష వాయువులు వరకవిపూడి, మండపం పంచాయతీలతో పాటు ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోన్నాయి. 

మనుషులు.. మొక్కలు విలవిల
థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్ట్‌లతో వరకవిపూడి పంచాయతీలోని అనంతపురం, శివరామపురం మండపం పంచాయతీలోని ఇసుకదొరువు, కాటేపల్లి, సీఎస్‌పురం, గొల్లపాళెం గ్రామాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. విద్యుత్‌ ప్లాంట్ల నుంచి విడుదలయ్యే బూడిద, విషవాయులు ఇళ్లను చుట్టుముట్టతుండంతో ఆరుబయట విశ్రాంతి తీసుకునే పరిస్థితి లేకుండా పోతోంది. క్యాన్సర్, అల్సర్, ఇతర గుండె సంబంధిత వ్యాధులతో స్థానికులు వైద్యశాలల చుట్టూ తిరుగాల్సి వస్తోంది. ఇళ్లల్లో పెంచుకొంటున్న పూల మొక్కలతో పాటు ఏళ్ల నాటి వటవృక్షాలు సైతం ఎండుముఖం పట్టి మోడు బారిపోతున్నాయి.

ఏళ్ల తరబడి నీడతో పాటు ప్రాణవాయువును ఇచ్చిన పచ్చని చెట్లు తమ కళ్లెదుటే నిలువునా ఎండిపోతుండడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేçస్తున్నారు. స్థానికంగా ఉన్న వందల ఎకరాల్లో పంటలు సైతం పండక భూములను బీళ్లుగా మార్చుకోవాల్సి పరిస్థితులు నెలకొన్నాయి. వరిపైర్లపై వీటి ప్రభావం అధికంగా ఉండడంతో పంటల దిగుబడి గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పరిస్థితిలో గ్రామాలను వదిలి ఇతర ప్రాంతాలకు వలస పోవాల్సిన పరిస్థితులు దాపరించాయని స్థానిక రైతులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

పచ్చని పల్లెలు బూడిదవుతున్నాయి
సెంబ్‌కార్ఫ్‌ గాయత్రి పవర్‌ ప్రాజెక్ట్‌ కారణంగా పచ్చని పల్లెలు బూడిదవుతున్నాయి. ప్రాజెక్ట్‌ నుంచి బూడిద రూపంలో కాలుష్యం విడుదలవుతూ పంటలు, పూల మొక్కలు, చెట్లు నిలువున ఎండిపోతున్నాయి. కాలుష్యంతో స్థానికులు వివిధ రోగాల బారిన పడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ప్రాజెక్ట్‌ల నుంచి విడుదలవుతున్న కాలుష్యం నియంత్రణ విషయంలో కంపెనీ యాజమాన్యాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అన్యాయం.

– ఉప్పల శంకరయ్యగౌడ్,   అనంతపురం
 
చెప్పిందొకటి.. చేస్తుంది మరొకటి
ప్రాజెక్ట్‌ ప్రారంభం, ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలకు ఇచ్చిన హామీలు గాని, కనీస సౌకర్యాల కల్పనలో సెంబ్‌కార్ఫ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ యాజమాన్యం పూర్తిగా గాలికొదిలేసింది. కాలుష్యం బారిన పడిన గ్రామాలకు, స్థానికులను రక్షించండంటూ మొత్తుకొంటున్న కంపెనీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. విషయాయుల ప్రభావంతో స్థానిక గ్రామాల ప్రజలు అనేక రోగాలతో అల్లాడుతున్నారు. విషవాయువులు అధికమై ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బతుకీడుస్తున్న పైనాపుపురం గ్రామ వాసులను వేరే ప్రాంతానికి తరలించాలని అభ్యర్థిస్తున్న ఉలుకుపలుకు లేదు.  

– నెల్లూరు శివప్రసాద్, పైనాపురం   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top