మందుబాబులూ బహుపరాక్‌

Vijayawada Police Focus Drunk And Drive Tests And Triple Ridings - Sakshi

మద్యం తాగి వాహనం నడిపితే కఠిన చర్యలు

కొరడా ఝుళిపిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు

నేటి నుంచి ట్రిపుల్‌ రైడింగ్, డ్రైవింగ్‌ లైసెన్స్‌లపై ప్రత్యేక తనిఖీలు

మోతాదుకు మించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో ఎక్కువవుతోంది. దీని కారణంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డ్రంకెన్‌ డ్రైవింగ్‌పై ట్రాఫిక్‌ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ బ్రీత్‌ అనలైజర్‌తో పరీక్షిస్తూ.. పరిమితికి మించి మద్యం శాతం ఉంటే జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. 

సాక్షి, అమరావతిబ్యూరో: మోతాదుకు మించి మద్యం సేవించి ఇష్టారాజ్యంగా వాహనాలతో రోడ్లపైకి వచ్చే వారిపై ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలోని ప్రధాన కూడళ్లలోనే కాకుండా సాధారణ రహదారుల్లోనూ తనిఖీలు చేపట్టి మందుబాబుల ఆటకట్టిస్తున్నారు. 

లెక్క దాటుతున్నారు..!
బీఏసీ (బ్లడ్‌ ఆల్కహాల్‌ కాన్సంట్రేషన్‌) ప్రమాణాల మేరకు ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో మద్యం మోతాదు(ఆల్కహాల్‌ కంటెంట్‌) 30 మిల్లీగ్రాములకు మించకూడదు. అయితే బ్రీత్‌అనలైజర్‌తో పరీక్షల్లో చాలా మందికి 100 మిల్లీగ్రాములను దాటేస్తోంది. విజయవాడలోని ఘంటసాల మ్యూజిక్‌ కళాశాల సమీపంలోని బీఆర్‌టీఎస్‌ ఫుడ్‌ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ పోలీసులు తనిఖీలు చేపడుతుండగా.. మోటార్‌ బైక్‌పై వస్తున్న ఒక వ్యక్తి స్నేక్‌ డ్రైవింగ్‌ చేస్తూ వచ్చాడు. పోలీసులు అతన్ని ఆపి బ్రీత్‌అనలైజర్‌తో పరీక్ష చేయగా ఆల్కహాల్‌ కంటెంట్‌ 548 మిల్లీగ్రామలు ఉంది. అలాగే ఫూటుగా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఏడుగురు వ్యక్తులు ఆటోనగర్‌ గేట్‌ వద్ద ట్రాఫిక్‌ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో దొరికారు. వారందరినీ బ్రీత్‌అనలైజర్స్‌తో పరీక్ష చేయగా మద్యం మోతాదు 301 నుంచి 400 మిల్లీగ్రాములుగా నమోదైంది. ఇలా గత మూడు నెలల కాలంలో 17 రోజుల పాటు నిర్వహించిన తనిఖీల్లో 1–100 మిల్లీగ్రాముల ఉన్న వారు 386 మంది, 101–200 మి.గ్రాములు నమోదైన వారు 231 మంది, 201–300 మి.గ్రాములు దాటిన వారు 46 మంది, 301–600 మిల్లీగ్రాములు ఉన్న వారు 9 మంది ఉన్నారు. 

ప్రమాదాలకు ఆస్కారం..  
మద్యం నిషాలో వాహనాలు నడిపేప్పుడు అయోమయం, ఆందోళనకు గురై ప్రమాదాలు చేసే అవకాశాలున్నాయి. చాలామంది ఈ సమయంలో నిర్లక్ష్యంగా నడపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య పెరుగుతుండడంతో రహదారి భద్రతపై సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఉల్లంఘనులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. 

976 మందిపై కేసులు..  
ఈ నేపథ్యంలో విజయవాడ ట్రాఫిక్‌ పోలీసులు మందుబాబులపై దృష్టిసారించారు. ఈ ఏడాది మూడు నెలల వ్యవధిలో 17 రోజులు డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. జనవరి 31న 104 మందిపై కేసులు నమోదు చేయగా.. ఫిబ్రవరి 23న చేపట్టిన తనిఖీల్లో 107 మంది దొరికారు. అలాగే అదే నెల 29న మరో 93 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇక ఈ నెల 2వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 672 మందిపై ట్రాఫిక్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో మోటార్‌ సైకిల్‌ వాహనచోదకులు 742 మంది కాగా.. ఆటో డ్రైవర్లు 161 మంది, కారు డ్రైవర్లు 36 మందితోపాటు ఇతర వాహనాల డ్రైవర్లు ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. రాత్రిపూటే కాకుండా పగటి పూట కూడా నగరంలోని ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, సీవీఆర్‌ ఫ్‌లై ఓవర్, కనకదుర్గవారధి, కంకిపాడు, గన్నవరం, నున్న పోలీసు స్టేషన్ల పరిధిలో తనిఖీలు చేపట్టగా 34 మంది లారీ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ దొరికిపోయారు. వీరిపైనా కేసులు నమోదు చేశారు. 

నేటి నుంచి ప్రత్యేక తనిఖీలు
కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రస్తుతం ట్రిపుల్‌ రైడింగ్, లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపే వారు, ప్రమాదకర డ్రైవింగ్, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్, డేంజరస్‌ పార్కింగ్‌లపై ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నారు.

తాగి నడిపితే కఠిన చర్యలు..  
మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలు చేస్తున్న వారిని కట్టడి చేసేందుకే డ్రంకెన్‌డ్రైవ్‌పై దృష్టి సారించాం. కొన్ని ప్రాంతాల్లో పగలూ నిర్వహిస్తున్నాం. గతంలో ప్రధాన రహదారుల్లో తనిఖీలు చేసేవాళ్లం. ఇప్పుడు సాధారణ రహదారుల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నాం. గత మూడు నెలల్లో 17 రోజులు తనిఖీలు నిర్వహించి 976 మందిపై కేసులు నమోదు చేశాం. డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడ్డవారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి జరిమానా విధిస్తున్నాం. భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకుంటాం.– టి.వి. నాగరాజు, డిప్యూటీ పోలీసు కమిషనర్‌(ట్రాఫిక్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top