అక్రమార్కులపై విజిలెన్స్ కొరడా | Vigilance akramarkulapai whip | Sakshi
Sakshi News home page

అక్రమార్కులపై విజిలెన్స్ కొరడా

May 20 2014 1:22 AM | Updated on Sep 2 2017 7:34 AM

జిల్లా కేంద్రంగా సోమవారం రాత్రి జరిగిన విజిలెన్స్ దాడుల్లో భారీ మొత్తంలో బియ్యంతో పాటు పంచదార, గోధుమపిండి ప్యాకెట్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మచిలీపట్నం క్రైం, న్యూస్‌లైన్ : జిల్లా కేంద్రంగా సోమవారం రాత్రి జరిగిన విజిలెన్స్ దాడుల్లో భారీ మొత్తంలో బియ్యంతో పాటు పంచదార, గోధుమపిండి ప్యాకెట్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  రేషన్ సరుకులను అక్రమంగా నిల్వ ఉంచి వ్యాపారాలు చేస్తున్నారంటూ విజయవాడ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ఏవీజీ విజయ్‌కుమార్‌కు అందిన విశ్వసనీయ సమాచారంతో ఆయన ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు మచిలీపట్నంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు.

వర్రేగూడెంకు చెం దిన కందుల జయబాబు అదే ప్రాంతంలోని సయ్యద్‌హుస్సేన్, భాజీ ఇంట్లో రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సరఫరా అయ్యే 24 క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచాడు. విజిలెన్స్ అధికారులు సదరు గోడౌన్‌పై ఆకస్మిక దాడి చేసి పరిశీలించగా బియ్యం కట్టలు పట్టుబడ్డాయి. చింతచెట్టుసెంటర్‌లోని కందుల వెంకటగణేష్ తన ఇంట్లోని ఓ గదిలో అక్రమంగా నిల్వ ఉంచిన 76 కిలోల బరువు ఉన్న 156 అర కిలోల పంచదార ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకున్నారు.

గొడుగుపేటలోని 14వ నెంబరు రేషన్ దుకాణంపై ఆకస్మిక దాడి చేసి 17 క్వింటాళ్ల బియ్యం ప్యాకెట్లతో పాటు 0.38 క్వింటాళ్ల పంచదార ప్యాకెట్లు, 0.52 క్వింటాళ్లకందిపప్పు, 0.30 క్వింటాళ్ల ఉప్పు ప్యాకెట్‌లతో పాటు 0.37 క్వింటాళ్ల గోధుమపిండి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నూరుద్దీన్‌పేటలో కందుల బాపూజీకి చెందిన  ఇంట్లో సోదాలు చేసిన అధికారులు   88.50 క్వింటాళ్ల బియ్యం ప్యాకెట్లతో పాటు 26 క్వింటాళ్ల ముతక బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

కాగా ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ సరుకులను అక్రమంగా నిల్వ ఉంచి అక్రమార్జన కోసం అక్రమమార్గంలో వ్యాపారాలకు పాల్పడుతున్న వారందరిపై క్రిమినల్ కేసులతో పాటు 6ఏ కేసులను బనాయిస్తామని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ పి.రాజేష్ తెలిపారు.

కాగా రేషన్ సరుకులను అక్రమంగా నిల్వ ఉంచి పట్టుబడిన వారిపై సోమవారం రాత్రి విజిలెన్స్ అధికారులు ఇనగుదురుపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఆకస్మిక దాడుల్లో ఎస్‌ఐ వైవివి.సత్యన్నారాయణ, పీసీలు మహేష్, సురేష్‌తో పాటు రెవెన్యూశాఖ తరఫున, బందరు ఆర్‌ఐ గంగాధర్, వీఆర్‌వోలు చలం, పి.సీతారామారావు, ఎండీ షకీర్  పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement