
మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ గరిక ఈశ్వరమ్మ
సూళ్లూరుపేట/సూళ్లూరుపేట రూరల్: క్యామెల్ కేసులో ప్రధాన నిందితురాలు, సూళ్లూరుపేట మున్సిపల్ చైర్‌పర్సన్ గరిక ఈశ్వరమ్మ ఇంకా పరారీలోనే ఉంది. కాగా కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త కథనాలు వెలుగు చూస్తున్నాయి. పట్టుబడిన కీలక నిందితురాలిని అధికార పార్టీ నేత ఒత్తిడితో వదిలేయడంతో పోలీసులకు కొత్త చిక్కులు వచ్చాయి. ఈ క్రమంలో మహిళా హోంగార్డ్‌ని బాధ్యురాలిని చేస్తూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసు గురించి ఎస్పీ ఆరాతీస్తున్నట్లు తెలిసింది.
వెలుగుచూస్తున్న విషయాలు
క్యామెల్ కో–ఆపరేటివ్ మహిళా సొసైటీకి ఈశ్వరమ్మ కేవలం కార్యదర్శిగా ఉంటూ అధ్యక్షురాళ్లుగా తనకు అనుకూలంగా ఉన్న నిరక్షరాస్యులను నియమించింది. బుజ్జమ్మ, చెంగమ్మ, జమీలా అనే వారిని రెండేసి సంవత్సరాలు అధ్యక్షురాళ్లుగా ఉంచి తర్వాత తీసివేసింది. ఈశ్వరమ్మ బ్యాంకులను మోసం చేసిన విషయాన్ని జమీలా అనే మహిళ కనిపెట్టి సంస్థకు రాజీనామా చేసి వెళ్లిపోయింది. అనంతరం ఈ వ్యవహారాన్ని బ్యాంకర్ల దృష్టికి తీసుకెళ్లింది. తర్వాత ఈశ్వరమ్మ వనిత అనే మహిళను అధ్యక్షురాలిగా నియమించుకుని చెక్కుల మీద సంతకాలు చేయించుకుంటూ వచ్చి ఆమెను కేసులో ఇరికించింది. వనిత భర్త చెంగయ్య ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై కాలు విరిగి మంచం పట్టాడు. ఈనెల 21వ తేదీ సోమవారం రాత్రి ఈశ్వరమ్మ భర్త ఈశ్వరయ్య ఫోన్ చేసి పరిస్థితి బాగాలేదు మీరు వెంటనే ఊరు వదిలి నాలుగురోజులు పాటు ఎక్కడైనా తలుదాచుకోమని సలహా ఇచ్చాడని చెంగయ్య చెబుతున్నాడు.
ఎంతెంత తీసుకున్నారంటే..
క్యామెల్ మహిళా మ్యాక్స్ సంస్థ పేరుతో రూ.కోట్లు రుణాలుగా తీసుకుని దారిద్య్రరేఖకు దిగువనున్న మహిళలకు రుణాలుగా ఇచ్చి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేస్తామని ఈశ్వరమ్మ అనేక సమావేశాల్లో చెప్పారు. వీటికి నాబార్డ్, కో–ఆపరేటివ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధికారులు కూడా హాజరయ్యారు. క్యామెల్ సొసైటీని 2002 నుంచి నిర్వహిస్తున్నారు. సొసైటీ అభివృద్ధి పేరుతో 2012లో నాబార్డు నుంచి రూ.1.69 కోట్లు, వీపీఎన్‌ఆర్‌ఎం గ్రాంట్ రూ.8.76 లక్షలు, నాబార్డ్ అనుబంధ సంస్థ అగ్రి బిజినెస్ ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి 2012 జూన్‌లో రూ.95 లక్షలు, అక్టోబర్‌లో మరోమారు రూ.99.75 లక్షలు రుణాలుగా తీసుకున్నారు. మళ్లీ అదే ఫైనాన్స్ సంస్థ నుంచి డిసెంబర్ 2013లో రూ.కోటి, బిజినెస్ కరస్పాండెంట్ రుణంగా రూ.2.50 కోట్లు తీసుకున్నారు. 2013లోనే సూళ్లూరుపేట స్టేట్ బ్యాంక్ నుంచి సీసీ రుణంగా రూ.1.99 కోట్లు పొందారు. కాగా స్టేట్ బ్యాంక్ ఇండియా వారు ఈశ్వరమ్మకు పట్టణంలోని పరమేశ్వరినగర్‌లో ఉన్న రెండు ప్లాట్లను అటాచ్‌మెంట్ పెట్టినట్టుగా తెలుస్తోంది.
పోలీసుల తీరుపై అనుమానాలు
ఆర్థికపరమైన కేసులో కీలక నిందితురాలిగా ఉన్న ఈశ్వరమ్మను పోలీసులు విచారణ పేరుతో తీసుకువచ్చిన వెంటనే టీడీపీ నాయకుడు పరసా వెంకటరత్నయ్య ఒక్క ఫోన్‌కాల్‌తో విడిచి పెట్టినట్లుగా చెబుతున్నారు. ఈశ్వరమ్మను వదిలిపెట్టడంతో ఆమె కుటుంబసభ్యులతో సహా ఇంటికి తాళాలు వేసుకుని పరారైంది. ఇదిలా ఉండగా 22వ తేదీ మంగళవారం రాత్రి ఈశ్వరమ్మకు ఓ పోలీసు అధికారి ఫోన్ చేసి అరెస్ట్ గురించి చెప్పారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈశ్వరమ్మకు, ఆమె భర్తకు ఇంకా ముందే అరెస్ట్ గురించి తెలుసని, అందుకే వారు పక్కాప్లాన్‌తో పరారైనట్లు చెబుతున్నారు. ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు వారిపాలిట శాపంగా మారింది. సంస్థ అధ్యక్షురాలైన వనిత మాత్రం మూడురోజులుగా పోలీస్ కస్టడీలోనే ఉంది. రెండురోజులుగా సీఐ కిషోర్‌బాబు, ఎస్సై కె.ఇంద్రసేనారెడ్డి రెండు బృందాలుగా ఏర్పడి ఈశ్వరమ్మ కోసం గాలించినా ఎక్కడా దొరకలేదు. ఇప్పటికి కేసులో ఎటువంటి పురోగతి లేదు. కాగా ఈ కేసు వ్యవహారంలో మరో కొత్త కోణం బయటకు వచ్చింది. 22వ తేదీ రాత్రి ఈశ్వరమ్మను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకుచ్చారు. ఆ సమయంలో నిందితురాలు తనకు రుతుస్రావం మొదలైందని బుకాయించడం మొదలుపెట్టింది. దీంతో ఎస్సై ఈశ్వరమ్మను ఇంటికి తీసుకెళ్లి తిరిగి తీసుకురావాలని హోంగార్డు నాగూరమ్మకు చెప్పారు. అయితే హోంగార్డు ఈశ్వరమ్మతో వెళ్లకపోవడంతో ఆమె సులభంగా తప్పించుకు పారిపోయింది. తాజాగా హోంగార్డు నాగూరమ్మపై చర్యలు తీసుకున్నారు. ఆమెను సరెండర్ చేసి సమస్యను జిల్లా ఎస్పీ ముందుకు నెట్టేశారు. ఈశ్వరమ్మ బెంగళూరుకు పరారైందని అనుమానిస్తున్నారు. ఆమె కాల్ రికార్డును పరిశీలిస్తున్నారు.
వనిత అమాయకురాలు
రూ.కోట్లు మింగేసిన ఈశ్వరమ్మను పోలీసులు, రాజకీయ నాయకులు విడిచిపెట్టేసి వనితను మాత్రం పోలీసుల కస్టడీలో ఉంచుకోవడం దారుణం. నేను కూడా టీడీపీలో ఉన్నాను. పరసారత్నం కార్యకర్తలకు చిన్నపాటి సాయం చేయుడు. అయితే రూ.7 కోట్లు బ్యాంకుల సొమ్మను స్వాహా చేసిన మహిళను ఎలా విడిచిపెట్టమని చెప్తారు?. పరసారత్నం వెంటనే మొత్తం వ్యవహారానికి సూత్రధారి అయిన ఈశ్వరమ్మను అప్పగించి అమాయకురాలైన వనితను విడిపించాలి. – రాజేశ్వరి, నిరుపేద మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు