త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో వెలిగొండ ప్రాజెక్టుకు 2 వేల కోట్ల రూపాయలు కేటాయించి తన రాజకీయ,
మార్కాపురం :త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో వెలిగొండ ప్రాజెక్టుకు 2 వేల కోట్ల రూపాయలు కేటాయించి తన రాజకీయ, పరిపాలన చిత్తశుద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరూపించుకోవాలని సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసనసభ గత సమావేశాల్లో వెలిగొండ మొదటిదశను వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తిచేసి నీరందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. కానీ, శనివారం తాము ప్రాజెక్టును సందర్శించగా, ఒక టన్నెల్ 7 కి.మీ, మరో టన్నెల్ 12 కి.మీ మాత్రమే పూర్తయిందని చెప్పారు. రెండు టన్నెల్స్ పూర్తి కావాలంటే మరో రెండేళ్లు పడుతుందని అక్కడి సిబ్బంది తెలిపారన్నారు. టన్నెల్ కాంట్రాక్టర్లే రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రులుగా ఉన్నారని, వారి ప్రయోజనాల కోసం టెండర్లు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని శ్రీనివాసరావు ఆరోపించారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే బిల్లుకు మద్దతు తెలిపిన చంద్రబాబు, నరేంద్రమోదీ, వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ఈ అంశంపై మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఫిబ్రవరిలో ఉద్యమం...
వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా 15 మండలాల రైతులతో ఫిబ్రవరిలో జిల్లా వ్యాప్తంగా సీపీఎం ఆధ్వర్యంలో ఉద్యమం చేపట్టనున్నట్లు జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు తెలిపారు. విలేకరుల సమావేశంలో సీపీఎం మార్కాపురం డివిజన్ కార్యదర్శి సోమయ్య, జిల్లా నాయకులు జాలా అంజయ్య, కనిగిరి కార్యదర్శి అనిల్, సీపీఎం పట్టణ, మండల కార్యదర్శులు బాలనాగయ్య, రఫి, రైతు సంఘ డివిజన్ కార్యదర్శి గాలి వెంకట్రామిరెడ్డి, డిజైన్ స్లేట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు రూబెన్ పాల్గొన్నారు.