ఇంట్లో పొదుపునకు పోపు డబ్బా చిహ్నం అంటూ ఉంటారు.
సాక్షి, హైదరాబాద్: ఇంట్లో పొదుపునకు పోపు డబ్బా చిహ్నం అంటూ ఉంటారు. కానీ, వ్యాట్ దెబ్బకు ఆ పోపు డబ్బా సత్తుపోతోంది. చెంచాలు మొదలుకుని కూరలు తరిగే కత్తి వరకూ వ్యాట్ దెబ్బకు మోతమోగిపోతున్నాయి. పైకి కనిపించకుండా బాదడాన్ని బాగా నేర్చుకున్న వాణిజ్య పన్నుల శాఖ... ఆఖరుకు వంటింటి సామగ్రినీ వదలడం లేదు.
ఆధునిక వంటగదులను పన్ను పరిధిలో చేర్చడం వల్ల వాణిజ్య పన్నుల శాఖకు ఏటా రూ. 5 వేల కోట్లకు పైగానే ఆదాయం వస్తున్నట్లు అంచనా. అంటే వ్యాట్ రూపంలో రాష్ట్ర ఖజానాకు చేరుతున్న రూ. 42 వేల కోట్లలో ఇది పదిశాతానికి పైగానే కావడం గమనార్హం.
అన్నం వండేందుకు ఉపయోగించే గరిట మొదలుకొని ప్రెషర్ కుక్కర్, పప్పులు, బియ్యం నిల్వ చేసుకునే డబ్బాలు, నీళ్లు పట్టుకునే సీసాలు, కూరలు తరిగే కత్తులు వంటి సామగ్రి, ఇడ్లీ గిన్నెలు... ఇలా ఒకటేమిటి ఆఖరుకు చెంచాలు, పోపు గింజల డబ్బాలపైనా 14.5 శాతం వ్యాట్ వసూలు చేస్తున్నారు.
రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఆధునిక వంట పరికరాల కొనుగోళ్లు పెరిగాయి. చిన్న ఇళ్లలో నివసించాల్సి రావడంతో.. తక్కువ స్థలం ఆక్రమించేలా వస్తువులు అమర్చుకోవడంపై మధ్య తరగతి వారు దృష్టి పెట్టారు. సులభ వాయిదాలపై చెల్లింపు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ఫ్రిజ్‌లు, మైక్రోవేవ్‌లు, విద్యుత్ కుక్కర్ల కొనుగోళ్లు పెరిగాయి.
గత నాలుగేళ్లుగా వంటగదిలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలు నాలుగు రెట్లు పెరిగినట్టు అధికారుల అంచనా. దీంతో ప్రభుత్వానికి వ్యాట్ రూపంలో భారీగా పన్నులు వస్తున్నాయి. వాస్తవానికి వీటిలో చాలా వరకూ రెండేళ్ల కింద వ్యాట్ మినహాయింపు పొంది వాటి జాబితాలో ఉండడం గమనార్హం.