ఈ ఘటన దురదృష్టకరం: వాసిరెడ్డి పద్మ

Vasireddy Padma Meets Molestation Victim In West Godavari District - Sakshi

అత్యాచార బాధితురాలిని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ

సాక్షి, విజయవాడ: ఏలూరులో వివాహితపై లైంగికదాడి జరగడం దురదృష్టకరమని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ విచారం వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఏలూరు రూరల్‌ నాగేంద్రకాలనీ శివారు ప్రాంతంలో వివాహితపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. ఈ క్రమంలో బాధితురాలిని వాసిరెడ్డి పద్మ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఘటనకు పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇంటి వద్ద దించుతామంటూ నమ్మించి బాధితురాలిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు దిశ చట్టాన్ని తీసుకువచ్చామని తెలిపారు. 

అదే విధంగా ఈ చట్టం పటిష్టంగా అమలు చేసేందుకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారిణిలను ప్రభుత్వం నియమించిందని పేర్కొన్నారు. ఇటువంటి కేసులు త్వరితగతిన విచారించి న్యాయం చేసేందుకు ప్రతి జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ మహిళల పక్షానే ఉంటుందని స్పష్టం చేశారు. కాగా నాగేంద్ర కాలనీకి చెందిన ఓ వివాహిత.. తన కుమారుడికి టాబ్లెట్లు తెచ్చేందుకు రాత్రి 10 గంటల సమయంలో సమీపంలోని మెడికల్‌ షాపునకు వెళ్లివస్తుండగా.. అదే కాలనీకి చెందిన యాకోబు అనే రౌడీషీటర్‌ వచ్చి ఆమెను ఇంటివద్ద దించుతానని చెప్పి బలవంతంగా తన బైక్‌ ఎక్కించుకున్నాడు. ఆమెను నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకువెళ్లి మరికొందరు యువకులతో కలిసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇక రాజధాని ప్రాంతంలో మహిళలను పావులుగా చేసుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటని వాసిరెడ్డి పద్మ దుయ్యబట్టారు. ఇన్నాళ్లు రాజధాని ప్రాంతంలో పెత్తనం చేసిన మగవాళ్లు ఏమయ్యారని ప్రశ్నించారు.(భర్త ఊళ్లో లేకపోవడం.. మృగాళ్లు రౌడీ షీటర్లు కావడంతో..)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top