ఉపాధి పనులు కల్పించాలని కైకలూరు ఎంపీడీవో కార్యాలయాన్ని వారహపట్నం గ్రామస్తులు ముట్టడించారు
► కైకలూరు ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించిన కూలీలు
కైకలూరు : ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్వగ్రామం వరహాపట్నంతో పాటు సమీప గ్రామాల్లోనూ పూర్తిస్థాయి ఉపాధి పనులు ఉండటం లేదని వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు కైకలూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన చేశారు. రాచపట్నం, చింతలచెరువు, గోపవరం గ్రామాలకు చెందిన ఉపాధిహామీ పథకం మేట్లు, కూలీలు ఆందోళనలో పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయం నుంచి బయటకు వచ్చి సమాధానం ఇవ్వాలని పట్టుబట్టారు. గ్రూపులకు కేవలం ఆరు రోజులు పని మాత్రమే కల్పిస్తున్నారన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం తూర్పు కృష్ణా కార్యదర్శి మురాల రాజేష్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఉపాధిహామీ నిధులను గృహనిర్మాణాలకు కేటాయిస్తున్నారని వాపోయారు.
పని కోసం ఎవరైనా జాబ్‌కార్డుతో దరఖాస్తు చేసుకుంటే 14 రోజుల్లో పని కేటాయించాలన్నారు. అలా జరగకపోతే ఉపాధి చట్టం ప్రకారం సదరు వ్యక్తికి కూలి డబ్బులు చెల్లించాలని చెప్పారు. ఆందోళన తీవ్రమవ్వడంతో ఇన్‌చార్జి ఎంపీడీవో పార్థసారథి బయటకు వచ్చి కూలీలతో మాట్లాడారు. సోషల్ ఆడిట్ కారణంగా పనులు కేటాయింపు ఆలస్యమైందన్నారు. మండలంలో 20 గ్రామాల్లో పనులు జరుగుతున్నాయన్నారు. జాబ్ కార్డు, ఆధార్ నంబరు నమోదు కాకపోతే ఖాతాలో నగదు జమ కాదన్నారు. చేసిన పని కొలతలు ఖచ్చితంగా ఉంటేనే నగదు కేటాయిస్తారని తెలిపారు. రాచపట్నంలో 6000 పని దినాలు చేసుకునే పనులు ఉన్నాయన్నారు. ఈ సమయంలో వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ కైకలూరు మండలంలో కేవలం 7 గ్రామాల్లో మాత్రమే పనులు జరుగుతున్నాయన్నారు. పూర్తి స్థాయిలో అందరికీ పనులు కేటాయించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో సిబ్బంది కొరత కారణంగా పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం కైకలూరు, కలిదిండి నాయకులు కురేళ్ల లాజర్, డి.టి.మూర్తి చైతన్య, ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.