
సాక్షి, విజయవాడ : ఏపీ ప్రభుత్వం, సింగపూర్ కంపెనీలు స్విచ్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం శుభపరిణామం, దీన్ని మేము మనస్పూర్తిగా స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిరావు పేర్కొన్నారు. అప్పట్లో చంద్రబాబు చెప్పినా వినిపించుకోకుండా స్విచ్ చాలెంజ్‌ను సింగపూర్ కంపెనీలకు అనుకూలంగా మార్చడానికి ఏకంగా రూల్స్ మార్చారు. ఈ ఒప్పందం ఒక లోపభూయిష్టమైనదని, దీనిని రద్దు చేయడంపై ప్రజలందరూ సంతోషించాలని పేర్కొన్నారు. స్విచ్ చాలెంజ్ ఒప్పందం వల్ల రూ. 306 కోట్లు సింగపూర్ కంపెనీలు పెట్టుబడితే రూ. 3604 కోట్లు లబ్ధి చేకూరనుంది. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుందని తెలిపారు. ఈ ఒప్పందం రద్దు అయితే రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదు అంటూ టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. స్విస్ చాలెంజ్ ఒప్పందం రద్దు వల్ల ఏపీలోని 13 జిల్లాల అభివృద్ది జరిగేలా అధికార వికేంద్రికరణ జరగాలి అని అభిప్రాయపడ్డారు. రాజధానిలో 45,50 అంతస్తుల నిర్మాణాలపై ప్రభుత్వం పునరాలోచించాలని తెలిపారు.