రైతు భరోసా సమస్యలపై అనూహ్య ‘స్పందన’

Unexpected Response To The Spandana Program On Rythu Bharosa - Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులు 2,85,469

అక్కడికక్కడే పరిష్కారమైనవి 1,38,868

అవసరమైతే మరో రెండు రోజులు పొడిగింపు 

వ్యవసాయ మంత్రి కన్నబాబు వెల్లడి 

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ రైతు భరోసా అమలులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, డివిజన్, మండల కేంద్రాలలో నిర్వహించిన ప్రత్యేక స్పందన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో రైతులు, కౌలు రైతులు, గిరిజన రైతులు తమ సమస్యలను విన్నవించారు. చనిపోయిన రైతుల కుటుంబ సభ్యులు వారి సమస్యలను అధికారులకు నివేదించి రైతు భరోసా కింద సాయం అందించాలని కోరారు. మండల కేంద్రాలలో ఏర్పాటు చేసిన స్పందన శిబిరాల వద్దకు ఉదయం నుంచే బారులు తీరిన రైతులు తమ సమస్యలను రెవెన్యూ, వ్యవసాయ, బ్యాంక్, రైతు భరోసాతో సంబంధం ఉన్న అధికారులకు తెలియజేస్తూ రాత పూర్వకంగా వినతి పత్రాలు అందజేశారు.

ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్‌ అనంతపురం జిల్లా పెనుగొండ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని పలు సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించేలా సంబంధిత అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. రాష్ట్ర మంత్రి కృష్ణదాస్‌ నరసన్నపేటలో, అగ్రి మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి కృష్ణా జిల్లా అవనిగడ్డ, కోడూరు మండల కేంద్రాలలో పాల్గొని కార్యక్రమ తీరును పర్యవేక్షించారు. ఒకటి రెండు చోట్ల కంప్యూటర్లు పని చేయలేదన్న ఫిర్యాదులు రాగానే సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించారు. 

ప్రధాన సమస్యలు.. పరిష్కారాలు.. 
స్పందన కార్యక్రమంలో ప్రధానంగా ఆధార్‌ నంబరు సరిపోలక పోవడం, బ్యాంక్‌ ఖాతాతో ఆధార్‌ నంబర్, ఎన్‌పీసీఐతో అనుసంధానం కాకపోవడం, బ్యాంకింగ్‌ ప్రక్రియ సరిగా లేకపోవడం, చనిపోయిన వారి ఖాతాలు వారసుల పేరిట నమోదు కాకపోవడం, ప్రజా సాధికార సర్వేలో నమోదు కాకపోవడం తదితర సమస్యలు వచ్చాయి. గ్రామ రెవెన్యూ, వ్యవసాయ, బ్యాంక్‌ అధికారులు కూడా పాల్గొనడం వల్ల పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగతా సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు.  

భూ రికార్డుల సమస్యలపై రేపు వీడియో కాన్ఫరెన్స్‌  
వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు కాకినాడ నుంచి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి, నిర్వహణ తీరును ప్రశంసించారు. ఇప్పటి వరకు లబ్ధి పొందిన వారు కాక మిగతా వారి నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు. భూమి రికార్డులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సోమవారం వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో తాను, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్టు తెలిపారు. అవసరమైతే ముఖ్యమంత్రితో మాట్లాడి రైతు భరోసా స్పందన కార్యక్రమాన్ని మరో రెండు రోజులు నిర్వహిస్తామని ‘సాక్షి’ ప్రతినిధికి చెప్పారు. గిరిజన ప్రాంతాలలో కమ్యూనికేషన్‌ సౌకర్యం సరిగా లేనందున ఆఫ్‌లైన్‌లోనే ఫిర్యాదులు స్వీకరించి అప్‌లోడ్‌ చేయండని ఆదేశించామన్నారు. ఉమ్మడి కుటుంబాలలో ఎదురవుతున్న సమస్యలూ వచ్చాయని, వారిలోనూ అర్హులైన వారందరికీ రైతు భరోసా అందుతుందని హామీ ఇచ్చారు.  

అర్హులందరికీ సాయం 
‘స్పందన’లో వచ్చిన ఫిర్యాదులను ఈనెల 15 లోగా పరిష్కరించి అర్హులందరికీ ఆర్థిక సాయం అందేటట్లు చూస్తామని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ చెప్పారు. రైతు భరోసా స్పందన కార్యక్రమం సంతృప్తికరంగా జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,85,469 సమస్యలు వచ్చాయని, వాటిలో అక్కడికక్కడే 1,38,868 సమస్యలను పరిష్కరించామన్నారు. పెండింగ్‌లో ఉన్న 1,46,601 సమస్యలను ఈ నెల 15వ తేదీ లోగా పరిష్కరించాలని తమ శాఖ అధికారులను ఆదేశించామని తెలిపారు. అనంతపురం జిల్లా నుంచి అత్యధికంగా వినతులు వచ్చాయన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top