'ఎర్ర' ఇన్ఫార్మర్‌ అంటూ.. | Two villagers thretended to kill resident, case registered | Sakshi
Sakshi News home page

'ఎర్ర' ఇన్ఫార్మర్‌ అంటూ..

Mar 30 2017 9:27 AM | Updated on Sep 5 2017 7:30 AM

ఎర్ర చందనం ఇన్ఫార్మర్‌ అన్న నెపంతో ..

చిత్తూరు: ఎర్ర చందనం ఇన్ఫార్మర్‌ అన్న నెపంతో పి.కాటయ్య అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన క్రాంతి, రమేష్‌ అనే ఇద్దరు దాడికి యత్నించిన సంఘటన చిత్తూరు జిల్లా కేవీబీ పురం మండలం అంజూరులో చోటు చేసుకుంది. బాధితుడు కాటయ్య కథనం మేరకు ఈ నెల మొదటి వారంలో అంజూరు అడవుల్లో ఆరుగురు వ్యక్తులు ఎర్రచందనం చెట్లను నరుకుతున్నారు. దీనిని గుర్తించిన డీఆర్‌ఓ పట్టాభి చెట్ల నరుకుతున్న వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇందులో ఐదుగురు పరారీ కాగా యుగంధర్‌(40) అనే వ్యక్తిని మాత్రం అదుపులోకి తీసుకొన్నారు.
 
పట్టుబడ్డ యుగంధర్‌తో పాటు మిగిలిన ఐదుగురిపై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. జైలు శిక్ష అనుభవించిన నిందితులు ఈ నెల 21న బెయిలుపై విడుదలై గ్రామానికి వచ్చారు. తమను గ్రామంలో మోహన్, గురవయ్య అనే ఇద్దరు పోలీసులకు పట్టించారని పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. గ్రామ పెద్దలు ఇన్‌ఫార్మర్‌లుగా వ్యవహరించిన మోహన్, గురవయ్యలకు చెరో రూ.5 వేలు చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఇది జరిగి రెండు రోజులు కూడా గడవక ముందే అదే గ్రామానికి చెందిన కాటయ్యపై ఎర్రచందనం కేసులో నిందితులైన రమేష్, క్రాంతిలు దాడికి యత్నించారు.
 
అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చావని అంటూ ఈ విషయాన్ని ఫారెస్టు అధికారులే తమకు చెప్పారని.. చంపేస్తామని బెదిరించారు. చుట్టు పక్క ఉన్న స్థానికులు వీరిని అడ్డుకోవడంతో సమస్య సద్దుమణిగింది. ఈ సంఘటనపై కాటయ్య కేవీబీ పురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు తన ప్రాణానికి రక్షణ కల్పించాలని కోరాడు. కాటయ్య ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని స్థానిక ఎస్‌ఐ పరశురాం తెలిపారు. ఈ సంఘటన అంజూరులో కలకలం రేపింది. తనపై జరిగిన దాడి యత్నాన్ని స్థానిక పోలీసులతో పాటు అటవీశాఖ ఉన్నతాధికారులకు, మంత్రికి కాటయ్య ఫిర్యాదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement