కాటేసిన కాలువ

Two Students Died In Canal In Cheepurupalli Vizianagaram District - Sakshi

ఇద్దరు చిన్నారులను  కాలువ రూపంలో కాటేసిన మృత్యువు

స్నానానికి దిగుతుండగా ప్రమాదం

ఈత రాకపోవడంతో  స్నేహితులిద్దరూ మృత్యుకౌగిలికి

విషాదంలో తల్లిదండ్రులు 

ఇద్దరు చిన్నారులూ ఐదోతరగతి చదువుతున్నారు. మంచి స్నేహితులు. ఉదయం పాఠశాలకు వెళ్లి  మధ్యాహ్నం సెలవుపెట్టారు. సరదాగా ఆటల్లో నిమగ్నమయ్యారు. సైకిల్‌పై గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉన్న తోటపల్లి కుడి ప్రధాన కాలువ వద్దకు చేరుకున్నారు. దుస్తులు ఒడ్డున పెట్టి స్నానం కోసం దిగబోయారు. అంతే.. కాలువ రూపంలో మృత్యువు కాటేసింది. ఇద్దరినీ అందని లోకాలకు తీసుకుపోయింది. పిల్లలే సర్వస్వంగా బతుకుతున్న కుటుంబాలను విషాదంలోకి నెట్టేసింది. 

సాక్షి, చీపురుపల్లి రూరల్‌: చీపురుపల్లి పట్టణంలోని జి.అగ్రహారం గ్రామానికి చెందిన ఇజ్జరోతు సతీష్‌(9) ఖరీదు గౌరీ శంకర్‌(9) సోమవారం సాయంత్రం గ్రామ సమీపంలో ఉన్న తోటపల్లి కాలువలో పడి మృతిచెందారు. స్థానిక పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... ఇద్దరు చిన్నారులు స్థానికంగా ఉన్న వేర్వేరు ప్రైవేటు పాఠశాలల్లో ఐదోతరగతి చదువుతున్నారు. ఉదయం పాఠశాలకు వెళ్లారు. మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చిన వీరు పాఠశాలకు సెలవుపెట్టారు. ఆటల్లో నిమగ్నమయ్యారు. సాయంత్రం 3 గంటల సమయంలో సైకిల్‌పై తోటపల్లి కాలువ వైపు వెళ్లారు. ఇద్దరూ దుస్తులు తీసి ఒడ్డున పెట్టారు. స్నానానికి దిగబోయి కాలువలో పడిపోయారు.

ఈత రాకపోవడంతో మునిగిపోయారు. ఇద్దరు చిన్నారుల్లో ఒకరి మృతదేహం కాలువలోని నీటిలో తేలి ఉండడాన్ని అటువైపుగా వస్తున్న రైతులు గమనించారు. గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో స్థానికులు దిగి విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు. ఒడున రెండు జతల దుస్తులు కనిపించడంతో మరో విద్యార్థి ఉండొచ్చని భావించి కాలువలో దిగి వెతికారు. కాలువలోని బురదలో కూరుకుపోయిన మరో చిన్నారి మృతదేహం కనిపించడంతో గగ్గోలు పెడుతూ బయటకు తీశారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.

మరణంలోనూ వీడని స్నేహం.. 
వారిద్దరు చిన్నారులు మంచి స్నేహితులు. ఒకటే వయస్సు. మృత్యువులోనూ స్నేహం వీడలేదు. మృతుల్లో సతీష్‌ తల్లిదండ్రులు శంకరరావు డ్రైవర్‌ కాగా తల్లి అరుణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తోంది. వీరికి సతీష్‌ ఒక్కడే కుమారుడు. ఒక్కగానొక బిడ్డను మృత్యువు కాటేయడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. కుమారుడి మృతదేహాన్ని పట్టుకుని వారు విలపిస్తున్న తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది. మరో విద్యార్థి గౌరీ శంకర్‌ తల్లిదండ్రులు సత్యనారాయణ, కనకరత్నంలు అగ్రహారం గ్రామం రోడ్డు సమీపంలో చిన్నపాటి టిఫిన్‌ దుకాణం నడుపుకుంటూ కాలం గడుపుతున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక కుమారుడు. అల్లారుముద్దుగా సాకుతున్న కుమారుడిని మృత్యువు కబళించడంతో భోరున విలపిస్తున్నారు. దేవుగా ఎందుకిలా చేశావు.. నీకు మేము ఏం అన్యాయం చేశావు... మా  పిల్లలను తీసుకుపోయావంటూ ఏడ్చిన తీరు అక్కడివారిని కలచివేసింది. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top