కుప్పం కేంద్రంగా అటవీశాఖలో అవినీతి

Two Forest Department Officials Suspended For Corruption Case - Sakshi

ఇద్దరు అటవీ శాఖ అధికారుల సస్పెన్షన్‌ 

నిధుల దుర్వినియోగం చేశారని ఆరోపణలు  

మరో నలుగురికి నోటీసులు జారీ 

టీడీపీ నాయకుల అండతోనే అక్రమాలు

కుప్పం: అటవీశాఖలో కుప్పం కేంద్రంగా జరిగిన అవినీతి బట్టబయలైంది. నిధులు దుర్వినియోగంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా పని చేశారన్న ఆరోపణల మేరకు నలుగురు అధికారులను సస్పెండ్‌ చేస్తూ అనంతపురం చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు అధికారి ప్రతాప్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. మరో నలుగురికి నోటీసులు జారీ చేశారు.   

నిధుల దుర్వినియోగం.. 
రామకుప్పం మండలం చిల్లిమానుగుంట అటవీ పరిధిలో రూ.9,34,388లతో కుంట తవ్వకం చేపట్టినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. వాస్తవంగా అక్కడ కొత్తకుంట తవ్వకుండా పాత కుంటకు మెరుగులు దిద్ది నిధులు కాజేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే 2016–17లో సింగమానుకుంటలో నీరు–చెట్టు పనుల్లో రూ.9,34,383 అవినీతి జరగినట్లు అధికారులు తేల్చారు. అలాగే అడవిలో చల్లేందుకు 15 వేల కిలోల కానుగ, చింత, మర్రి, నేరేడు విత్తనాలు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. రూ.14,42,609లతో ఈ విత్తనాలను కర్ణాటక రాష్ట్రం ముళబాగల్‌లో కొనుగోలు చేసినట్లు చూపారు. ఎక్కడా విత్తనాలు కొనకం చేపట్టలేదని అధికారులు నిర్ధారణకు వచ్చారు.  

నిబంధనలు అతిక్రమణ 
అటవీ నిబంధనల ప్రకారం పూచిక పుల్ల కూడా అడవి నుంచి తొలగించరాదనే నిబంధనలు ఉన్నాయి. ఇక్కడి అధికారులు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చారు. టీడీపీ నాయకుల మన్ననలు పొందేందుకు నడుమూరు మోడల్‌ సూŠక్‌ల్‌ నుంచి బేటరాయస్వామి కొండ వరకు 320 మీటర్ల రోడ్డును అడవిలో వేసేందుకు సహకరించినట్టు విచారణ అధికారులు తేల్చారు. గుడుపల్లె మండలంలో బూరుగులపల్లి నుంచి మల్లప్పకొండకు అటవీ ప్రాంతంలో 332 మీటర్ల రోడ్డు నిర్మాణానికి శాఖ అనుమతులు లేకుండానే సహకరించినట్లు గుర్తించారు. బేటరాయస్వామి కొండపై కమ్యూనిటీ భవనం నిర్మాణానికి అనుతులు ఇచ్చినట్టు తేల్చారు.  

సస్పెండ్‌ అయిన అధికారులు వీరే.. 
నిధుల దుర్వినియోగం, నిబంధనలు అతిక్రమించారనే ఆరోపణలపై కుప్పం ఎఫ్‌ఆర్వో కాలప్పనాయుడు, పలమనేరు సెక్షన్‌ అధికారి మధుసూదన్, నడుమూరు ఫారెస్ట్‌ బీట్‌ అధికారులు పరమేశ్, మున్నాను సస్పెండ్‌ చేశారు. అప్పటి చిత్తూరు వెస్ట్‌ డీఎఫ్‌వో చక్రపాణి, ఉద్యోగ విరమణ చేసిన డిప్యూటీ రేంజ్‌ అధికారి గంగయ్యపై శాఖపరమైన చర్యలకు అనంతపురం చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు ప్రతాప్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. కుప్పం వదిలి బయటికి పోరాదని ఆదేశించారు. 

టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే అవినీతి 
2016–2018 మధ్య టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నియోజకవర్గం కావడం, స్థానిక నాయకుల మన్ననలు పొందాలనే ఉద్దేశంతో రేంజర్‌ కాలప్పనాయుడు, సిబ్బంది అత్యుత్సాహం చూపినట్టు సమాచారం. కుప్పానికి నోడల్‌ అధికారిగా కాలప్పనాయుడి నియమించడంతో అటవీ సిబ్బంది కొంత హల్‌చల్‌ చేశారు. టీడీపీ నాయకులు చెబితే అడవిలో ఇసుక దోపిడీ, కలప నరికివేతకు ఇట్టే అనుమతులు ఇచ్చేవారు. ప్రధానంగా బేటరాయస్వామి కొండకు అడవిలో రోడ్డు, మల్లప్పకొండకు రోడ్డు నిర్మాణం విషయంలో చంద్రబాబు పీఏ మనోహర్‌ ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top