సాగునీటి శాఖలో ‘పెదబాబు’, ‘చినబాబు’ అవినీతి సాగుపై ‘సంతకానికి ససేమిరా!’ శీర్షికన ‘సాక్షి’ శనివారం ప్రచురించిన వార్త ఉన్నతాధికార వర్గాల్లో సంచలనం సృష్టించింది.
ఇద్దరు సీఎస్‌లు తిరస్కరించిన ఫైల్‌ను మళ్లీ కేబినెట్‌కు తీసుకెళ్లడమా?
♦ ఉన్నతాధికార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ
♦ సంచలనం రేకెత్తించిన ‘సంతకానికి ససేమిరా!’
సాక్షి, హైదరాబాద్: సాగునీటి శాఖలో ‘పెదబాబు’, ‘చినబాబు’ అవినీతి సాగుపై ‘సంతకానికి ససేమిరా!’ శీర్షికన ‘సాక్షి’ శనివారం ప్రచురించిన వార్త ఉన్నతాధికార వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు(సీఎస్‌లు) తిరస్కరించిన ‘అంచనాల పెంపు’ ప్రతిపాదనను రెండోసారి మంత్రివర్గం ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకోవడం పట్ల పలువురు సీనియర్ ఐఏఎస్‌లు విస్మయం వ్యక్తం చేశారు. మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన తర్వాత కూడా ‘అంచనాల పెంపు’పై సంతకం చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తిరస్కరించారంటే.. నిబంధనల ఉల్లంఘన ఎంత అడ్డగోలుగా, అసంబద్ధంగా, యధేచ్ఛగా సాగిందనే అంశంపై ఉన్నతాధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంత విడ్డూరమైన వ్యవహారాన్ని ఎప్పుడూ చూడలేదంటున్నాయి. అవినీతి పె తీవ్రంగా స్పందించాల్సిన ప్రభుత్వం.. దానికి రాజముద్ర వేయడానికి ప్రయత్నిస్తోందని మండిపడుతున్నాయి.ఈ యత్నంలో.. సొమ్ము దిగమింగిన పెద్దలంతా బాగుంటారని, సంతకాలు చేసిన అధికారులే ఇరుక్కుపోతారనే ఆవేదన ఆ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
మళ్లీ మంత్రివర్గానికా..: ఒకసారి మంత్రివర్గం ఆమోదించిన అంశాన్ని మరోసారి మంత్రివర్గం ముందుకు తీసుకెళ్లిన చరిత్ర ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనూ లేదని, అడ్డగోలు అవినీతికి మంత్రివర్గం మళ్లీ ఎలా ఆమోదముద్ర వేస్తుందని ఐఏఎస్‌లు ప్రశ్నిస్తున్నారు. సీఎం చంద్రబాబు, నీటిపారుదల మంత్రి దేవినేనిలు.. ఈ అవినీతికి రాజముద్ర వేయడానికి ఎలా అంగీకరిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికే మంత్రివర్గం పరిమితం కావాలని, అవినీతి వ్యవహారాలకు రాజముద్ర వేసే వేదికలుగా మారిస్తే ప్రజలు క్షమించరని అంటున్నాయి.
చర్యలే సమంంజసం : ఇద్దరు సీఎస్‌లు తిరస్కరించిన అంశాన్ని లోతుగా విచారించడానికి ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలని, నిబంధనలను ఉల్లంఘించిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఐఏఎస్‌లు సూచిస్తున్నారు.