మారిన కృష్ణా నది సరిహద్దులు

మారిన కృష్ణా నది సరిహద్దులు


చిక్కిపోయిన  కృష్ణమ్మ 



వరదలతో దిశ మారిన ప్రవాహం

కొత్తగా ఏర్పడిన గ్రామాలు


 

కృష్ణానది కాలక్రమేణా చిక్కిపోతోంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం నది ప్రవాహ పరిస్థితికి, ఇప్పటికి ఎంతో వ్యత్యాసం ఉంది. నది వెడల్పు పది కిలోమీటర్ల మేర కుంచించుకుపోయి ఎన్నో గ్రామాలు కొత్తగా ఏర్పడ్డాయి. నీటి        ప్రవాహం దిశ మారిన నేపథ్యంలో పలు ప్రాంతాలు నదిలో కలిసి కనుమరుగయ్యాయి.

 

విజయవాడ : పూర్వం కృష్ణా నదిని కృష్ణ వేణిగా పిలిచేవారు. కృష్ణా నదికి గుంటూరు జిల్లా వైపు ఉన్న కాలువను పేకమ్మగా వ్యవహరించేవారు. ఇది ప్రస్తుతం ఉన్న ప్రకాశం బ్యారేజీ వద్ద మొదలై రాయపూడి, వెలగపూడి, మందడం, ఎర్రబాలెం మీదుగా ప్రవహించి మంగళగిరి వద్ద ఉన్న ట్రంక్ రోడ్డును దాటి తుంగభద్రలో కలిసేది. అయితే ప్రస్తుతం నది ప్రవాహం ఇలా లేదు. తుపానులు, వరదలు, ఉప్పెనుల, భూకంపాలు, భూమిలో ఏర్పడిన సహజసిద్ధ మార్పులతో నది ప్రవాహ స్వరూపం మారిపోయింది. గతంలో మంగళగిరి ట్రంక్ రోడ్డు వరకు కృష్ణానది విస్తరించి ఉండేది. కృష్ణానది ఆయకట్టు రికార్డుల్లో సైతం మంగళగిరి ట్రంక్ రోడ్డును నది హద్దుగా పేర్కొన్నారు. వరదలు వచ్చిన సమయంలో మంగళగిరి వద్ద నదిలో నీటి ఉధృతి అధికంగా ఉండేది. అమరావతి సమీపంలోని వైకుంఠపురం నుంచి మంగళగిరి వరకు కృష్ణా నది ప్రవహించేది.

 

కొత్త గ్రామాల ఏర్పాటు



 సుమారు 13వ శతాబ్దానికి పూర్వం తుళ్లూరు మండలంలోని అనేక గ్రామాలు ఉన్న ప్రాంతం కృష్ణానదిలో అంతర్భాంగా ఉండేది. చరిత్రలో ఆయా గ్రామాల ప్రస్థావన లేకపోవడమే ఇందుకు నిదర్శనం. వైకుంఠపురం వద్ద మొదలైన కృష్ణానది మంగళగిరి వద్ద తుంగభద్రలో కలిసేది. హరిశ్చంద్రపురం, వెలగపూడి, వెంకటాయపాలెం, తాళ్లయపాలెం, లింగాయపాలెం, మందడం తదితర గ్రామాలు ప్రస్తుతం ఉన్న చోట గతంలో కృష్ణానది ప్రవహించేది. నదిలో నీటి ప్రవాహం తగ్గడంతో విశాలమైన భూభాగం ఏర్పడింది. 15వ శతాబ్దం తర్వాత వలస వచ్చినవారు ఆ భూభాగంలో నివసించడంతో ఈ గ్రామాలు ఏర్పడ్డాయి.



దరణి కోట రాజుల హయాంలో ఉద్దండరాయునిపాలెం ఏర్పడింది. 15 వశతాబ్దం తర్వాత కోట గణపతి దేవుడి ప్రధాని ప్రోలి నాయకుని తండ్రి ఉద్దండరాయుని పేరుతో ఈ గ్రామం ఏర్పడింది.కోట కేతరాజు ఇద్దరు భోగపత్నుల తండ్రి ఎర్రమనాయుడు పేరుతో  ఎర్రబాలెం ఏర్పడిందని చరిత్ర పేర్కొంటోంది.పల్నాటి యుద్ధం తర్వాత ఆ యుద్ధంలో పాల్గొన వీరులు అనేక మంది కృష్ణాయపాలెం, వెంకటాపురం ప్రాంతాలకు వలసవచ్చారు. వారిలో హరిజనుడు వెంకటపాలెం, యాదవుడు కృష్ణాయపాలెం ఏర్పాటు చేశారని శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top