టీటీడీలో సమ్మె సైరన్‌..

Ttd Regular employees Anxiety - Sakshi

సంతకాల సేకరణతో రెగ్యులర్‌ ఉద్యోగులు ఆందోళనకు శ్రీకారం

సమస్యలు పరిష్కరించకుంటే దశల వారీగా ఉధృత నిరసనలు

మరో వారంలో ఆందోళన బాట పట్టనున్న కాంట్రాక్టు ఉద్యోగులు

ఆగస్టు 15లోపు సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు సై

సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) రెగ్యులర్‌ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. 22 డిమాండ్లతో గురువారం టీటీడీ పరిపాలన భవనం ముందు ఉద్యోగ సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణతో తమ ఆందోళనకు శ్రీకారం చుట్టారు. సమస్యలు పరిష్కరించకపోతే దశలవారీగా నిరసన కార్యక్రమాలు ఉధృతం చేయాలని నిర్ణయించారు. రెగ్యులర్‌ ఉద్యోగులందరికీ నివాస స్థలాలు, ఖాళీ పోస్టులు భర్తీ, సమాన పనికి సమాన వేతనం, మల్టీ సూపర్‌ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా అందించటం, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మరో వారం రోజుల్లో కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు కూడా ఆందోళనకు సిద్దమవుతున్నారు. ఆగస్టు 15లోపు సమస్యలను పరిస్కరించకపోతే... సమ్మె తప్పదని హెచ్చరిస్తున్నారు. టీటీడీలో రెగ్యులర్‌ ఉద్యోగులు 8,500 మంది ఉండగా.. అవుట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు 14,500 మంది ఉన్నారు. పారిశుధ్య విభాగం నుంచి ఇతర విభాగాలన్నింటిలో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులే అధికం.

అయితే తాము కాంట్రాక్టర్ల చేతిలో దోపిడీకి గురవుతున్నామని వారు చెబుతున్నారు. చాలీ చాలని వేతనాలతో బతుకులీడుస్తున్నామని, సగటున ఒక్కో కార్మికునికి రూ. 7 వేల వేతనం కూడా రావడం లేదని, వచ్చే జీతంతో ఇంటి అద్దెలు చెల్లించలేక, పిల్లలకు చదువులు చెప్పించలేక, కుటుంబ పోషణ భారమై దుర్భర జీవితం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టరు మారినప్పుడల్లా ఉద్యోగులను భయం వెంటాడుతోంది. ఎవర్ని పనిలో నుంచి తీసేస్తారో తెలియకుండా ఉంది.  

టీటీడీలో అమలు కాని జీవో
రాష్ట్ర ప్రభుత్వం అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచుతూ జీవో నంబర్‌ 151 విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ జీఓ విడుదల చేసి రెండేళ్లవుతున్నా టీటీడీలో మాత్రం అది అమలు కావడం లేదు. జీవో అమలైతే కింది స్థాయిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు కూడా నెలకు రూ. 12 వేలు వేతనం అందుతుంది. జీవో అమలు చేయాలని కార్మికులు ఆందోళన చేస్తున్నా టీటీడీ పట్టించుకోవడం లేదు.

సమాన పనికి సమాన వేతనంపై సుప్రీం కోర్టు మార్గదర్శకాలు అమలు చేయడంలేదని కార్మికులు చెబుతున్నారు. ఆ ఆదేశాల ప్రకారం రెగ్యులర్, అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు అనే తేడా ఉండకూడదు. ఒకే విధమైన పనిచేసే వారికి ఒకే రకమైన వేతనం ఇవ్వాలి. దీన్ని అమలు చేస్తే జీవో 151 కంటే మెరుగైన వేతనం లభిస్తుందని కార్మికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

భోజనం, వైద్యం అందదు..
టీటీడీ నిత్యం లక్ష మందికి అన్నదానం చేస్తోంది. అయితే సంస్థలో పనిచేసే అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులకు మాత్రం సరైన భోజనం పెట్టటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెగ్యులర్‌ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన క్యాంటీన్లలో వీరికి ప్రవేశం లేదు. ప్రముఖ ధార్మిక సంస్థగా పేరుగాంచిన టీటీడీలో కనీస కార్మిక చట్టాలు కూడా అమలు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అనారోగ్యం పాలైతే టీటీడీ ఆసుపత్రుల్లో తమకు చికిత్స చేయరని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆగస్టు 15, జనవరి 26న ఇచ్చే ప్రశంసాపత్రాలు కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు.

కాంట్రాక్టర్‌ ఎందుకు?
టీటీడీకి తమకు మధ్య కాంట్రాక్టర్‌ ఎందుకని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. తమకు ఇచ్చే వేతనాలను  కాంట్రాక్టర్‌ స్వాహా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్‌ లేకుండా ఉంటే టీటీడీ ఇచ్చే వేతనం పూర్తిగా చేతికి అందుతుందని చెబుతున్నారు. లేబర్‌ కాంట్రాక్టర్‌ వ్యవస్థను పూర్తిగా రద్దుచేయాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలు ప్రారంభించిన సంతకాల సేకరణతో టీటీడీ పెద్దలు స్పందించకపోతే అంతా కలిసి సమ్మెకు దిగుతామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top