బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

TTD Ready For Brahmothsavalu Tirupati - Sakshi

తిరుమలలో విస్తృత ఏర్పాట్లు  

భక్తుల కోసం భారీ సంఖ్యలో లడ్డూలు

గంట ముందుగా వాహన సేవలు

భారీ ఎత్తున అలంకరణలు టీటీడీ ఈఓ సింఘాల్‌ వెల్లడి

చిత్తూరు, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపట్నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 21వ తేదీ వరకు జరుగుతా యి. ఈ ప్రతిష్టాత్మక వేడుకకు విస్తృత ఏర్పాట్లు చేశామని టీటీటీ ఈఓ  అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జేఈఓలు శ్రీనివాసరాజు.. పోలా భాస్కర్‌తో కలిసి సమీక్షించారు. అనంతరం ఈఓ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో రాత్రి వాహనసేవను గంట ముందుగా ప్రారంభిస్తామన్నారు.  రాత్రి 8 నుంచి 10 గంటల వరకు జరుపుతామన్నారు.  గరుడవాహనసేవను  రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. రద్దీ దృష్ట్యా ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు. భక్తుల కో సం రోజూ 7 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నామన్నారు. శ్రీవారి ఆలయం,ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో విద్యుత్, పుష్పాలం కరణలు చేపట్టామన్నారు. జిల్లా యంత్రాంగం కూడా సహకారం అందిస్తోందన్నారు.

రూ.9 కోట్లతో అలంకరణ..
రూ.9 కోట్లతో విద్యుత్‌ అలంకరణలు, పెయింటింగ్, బారికేడ్లు తదితర ఇంజినీరింగ్‌ పనులు చేపట్టామన్నారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం రూ.26 కోట్లతో అదనపు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ఆలయ మాడ వీధులు, ఇతర ముఖ్యమైన ప్రాంతాల్లో అదనపు మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. వాహన సేవలను తిలకించేందుకు 31 పెద్ద డిజిటల్‌ స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు. గరుడసేవ సమయంలో గ్యాలరీల్లో 2 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదాలు, 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 6 లక్షల తాగునీటి ప్యాకెట్లు పంపిణీ చేస్తామన్నారు.

7వేల వాహనాలకు పార్కింగ్‌..
తిరుమలలో 7 వేల వాహనాలు పార్కింగ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. గరుడసేవ సందర్భంగా ఘాట్‌ రోడ్లలో ద్విచక్ర వాహనాలను నిషేధించామన్నారు. ఇందుకోసం తిరుపతిలో పార్కింగ్‌ ప్రదేశాలను ఏర్పాటు చేశామన్నారు. ఘాట్‌ రోడ్లలో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు, ప్రమాదాల నివారణకు 8 ప్రాంతాల్లో క్రేన్లు, ఆటోమొబైల్‌ క్లినిక్‌ వాహనాలు అందుబాటులోకి తెచ్చామన్నారు. పోలీసులకు బాడివోర్న్‌ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్‌ సాఫ్ట్‌వేర్‌ అందించినట్టు చెప్పారు. 3 వేల మంది పోలీసులు, 3 వేల మంది శ్రీవారి సేవకులు, వెయ్యి మంది స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్, ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, ఈతగాళ్లు అందుబాటులో ఉంటారన్నారు.

దాతలకే గదులు..
బ్రహ్మోత్సవాల రోజుల్లో స్వయంగా వచ్చే కాటేజి దాతలకు మాత్రమే గదులు కేటాయిస్తామన్నారు. గరుడసేవ సందర్భంగా 15 నుంచి 17వ తేదీ వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అక్టోబరు 12 నుంచి 14వ తేదీ వరకు కాటేజి దాతలకు గదుల కేటాయింపు ఉండదన్నారు. 11 ప్రథమ చికి త్స కేంద్రాలను ఏర్పాటు చేశామని, 12 అంబులెన్స్‌లు అందుబాటులో ఉంటాయని చెప్పారు. వాహనసేవల ముందు స్థానిక కళాకారులతోపాటు ఇతర రాష్ట్రాల కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తిరుమల జెఈఓ శ్రీనివాసరాజు మాట్లాడుతూ గరుడసేవ సందర్భంగా ఈనెల 16, 17 తేదీల్లో దివ్యదర్శనం టోకెన్లు రద్దు చేశామన్నారు. సెప్టెంబరు 17న సర్వదర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను రద్దు చేసినట్టు తెలిపారు. టీటీడీ ఇన్‌చార్జి సీవీఎస్‌ఓ శివకుమార్‌రెడ్డి, చీఫ్‌ ఇంజినీర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ–2 రామచంద్రారెడ్డి, ఆలయ డెప్యూ టీ ఈఓ హరీంద్రనాథ్, ట్రాన్స్‌పోర్టు జీఎం శేషా రెడ్డి, కల్యాణకట్ట డెప్యూటీ ఈఓ నాగరత్న, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

బ్రహోత్సవాల నిర్వహణకు సకల ఏర్పాట్లూ పూర్తి చేశాం. టీటీడీలోని అన్ని విభాగాలను సమన్వయపర్చుకుని ముందుకెళ్తున్నాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగరాదన్నది మా అభిమతం. వాహన సేవల్లో స్వామివారిని భక్తులు ఇబ్బంది లేకుండా వీక్షించేలా చర్యలు తీసుకుంటున్నాం. భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం.     – అనిల్‌కుమార్‌ సింఘాల్, టీటీడీ ఈఓ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top