పరీక్షల తర్వాతే భక్తులను కొండపైకి అనుమతి

TTD Darshan Tickets Available In Online From 8th June Says EO - Sakshi

ఆన్‌లైన్‌లో రోజుకు 3,000 దర్శనం టికెట్లు

గ్రామ సచివాలయాల్లో కూడా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు

బస్సులతో పాటు భక్తుల సామాగ్రికి శానిటైజేషన్‌

క్యూలైన్‌లో విధులు నిర్వహించే వారికి పీపీఈ కిట్లు

టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌

సాక్షి, తిరుమల : లాక్‌డౌన్‌ కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో రెండు నెలలకు పైగా నిలిచిపోయిన భక్తుల దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తిరిగి పునఃప్రారంభిస్తోంది. తొలుత ఈనెల 8 నుంచి టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో మూడ్రోజులపాటు ప్రయోగాత్మకంగా ట్రయల్‌ రన్‌ పద్ధతిలో దర్శనాలను టీటీడీ ప్రారంభించనుంది. ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లను టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ పరిశీలించారు. అనంతరం అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 8 నుంచి ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శనం టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆన్‌లైన్‌లో రోజుకు మూడు వేల టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. (ప్రతిరోజూ 7 వేల మందికి మాత్రమే దర్శనం)

ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన వారికి గదులు కేటాయిస్తామని పేర్కొన్నారు. సరి, బేసి పద్దతిలో గదుల కేటాయింపు ఉంటుందని, ఒక్కో రూమ్‌లో ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. గ్రామ సచివాలయాల్లో కూడా ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సూచించారు. క్యూలైన్‌లో విధులు నిర్వహించే వారికి పీపీఈ కిట్లు ఇస్తామన్నారు. బస్సులతో పాటు భక్తుల లగేజీని కూడా పూర్తిగా శానిటైజ్‌ చేస్తామన్నారు. ప్రతీ రెండు గంటలకు ఒకసారి లడ్డూ కౌంటర్లను మారుస్తామని తెలిపారు. 

రోజూ ర్యాండమ్‌గా 200 మంది భక్తులకు పరీక్షలు నిర్వహిస్తామని, పరీక్షల తర్వాతే కొండపైకి అనుమతినిస్తామన్నారు. ప్రస్తుతానికి కల్యాణకట్ట వద్దకు అనుమతి లేదన్నారు. హుండీ, అన్నప్రసాదం దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఈవో సూచించారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో కూడా పరిమితంగానే భక్తులకు అనుమతిస్తామన్నారు. తిరుమలలో గడువు దాటిన వస్తువులు తొలగిస్తామన్నారు. కేంద్రం నిబంధనల పర్యవేక్షణకు సీనియర్‌ అధికారులు నియమిస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా పాటించాలని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ స్పష్టం చేశారు.    

సిఫార్సు లేఖలకు అనుమతి లేదు: ధర్మారెడ్డి
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే శ్రీవారి భక్తులు ఆయా రాష్ట్రాల అనుమతితోనే టికెట్లు తీసుకోవాలని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు. 24 గంటలు పర్యవేక్షిస్తూ భక్తుల దర్శనానికి అనుమతిస్తామన్నారు. ఉదయం గంట మాత్రమే ప్రోటోకాల్‌ వీఐపీఎలకు అనుమతి ఉంటుందన్నారు. సిఫార్సు లేఖలకు అనుమతి లేదన్నారు. శ్రీవాణి ట్రస్ట్‌ భక్తులకు ప్రస్తుతానికి అనుమతి లేదని ధర్మారెడ్డి పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top