పాపం గిరిజనులు.. ఫ్లోరైడ్ బాధితులు | Tribals Victims fluoride | Sakshi
Sakshi News home page

పాపం గిరిజనులు.. ఫ్లోరైడ్ బాధితులు

Apr 1 2016 12:51 AM | Updated on Apr 6 2019 8:55 PM

ప్రజలందరికీ స్వచ్ఛ జలాలు అందిస్తాం.. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తాం.. అంటూ పాలకులు చెబుతున్న

 ప్రజలందరికీ స్వచ్ఛ జలాలు అందిస్తాం.. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తాం..  అంటూ పాలకులు చెబుతున్న మాటలకు వాస్తవ పరిస్థితికి పొంతన ఉండటం లేదు. అడవి బిడ్డల పాపమో, ప్రభుత్వాల శాపమో తెలియదు గాని ఏజెన్సీ ప్రాంతాల్లో స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదు. కనీసం మంచినీటి పథకాలు ఏర్పాటుచేయకపోవడంతో కుకునూరు మండలంలోని సుమారు ఆరు గ్రామాల్లో ప్రజలు కలుషిత నీటిని తాగి ఫ్లోరైడ్ బారిన పడుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే రెండు మూడు రోజులు హడావుడి చేసి నీటి నమూనాలు సేకరించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. దీంతో గిరిపుత్రుల గోడు అరణ్యరోదనగా మారుతోంది.
 - కుకునూరు
 
 కుకునూరు మండలంలో ఫ్లోరైడ్ భూతం
 కుకునూరు మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామాలైన అర్వపల్లి, గుండంబోరు, 
 నెమలిపేట, రామన్నగూడెం, రావికుంట, సీతారామపురం తదితర గ్రామాల్లో ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు. ఆయా గ్రామాల్లో పలువురికి చిన్న వయసులోనే పళ్లు గారపట్టడం, నడుము వంగిపోవడం, కాళ్లు వాచిపోవడం, కాళ్లు, చేతులు వంకర్ల తిరగడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఆయా గ్రామాల్లో సురక్షిత తాగునీటి పథకాలు లేకపోవడం ప్రధాన కారణం.  
 
 స్థానికంగా నీటిలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉండటంతో వీరంతా రోగాలబారిన పడుతున్నారు. తాము ఇంతలా బాధపడుతున్నా ఐటీడీఏ అధికారులు పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. కొన్నిసార్లు ఫిర్యాదు చేస్తే నీటి నమూనాలు సేకరించి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారిందంటున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమ సొంత ఖర్చులతో బోరు వేసుకున్నామని రామన్నగూడెం గిరిజనులు చెబుతున్నారు. 
 
  ఈ చిన్నారి పేరు ఇరకం సారమ్మ. రావికుంట గ్రామంలో 5వ తరగతి చదువుతోంది. 
 పుట్టిన తర్వాత కొంతకాలం బాగానే ఉన్నా తర్వాత బాలిక కాళ్లు, చేతులు వంకర్లు తిరిగిపోయాయి. ప్రస్తుతం నడవలేని స్థితిలో పాఠశాలకు వెళుతోంది. ముద్దులొలికే ఈ చిన్నారిని చూస్తే ఎవరైనా 
 అయ్యోపాపం అనకమానరు. పాప భవిష్యత్‌ను ఫ్లోరైడ్ మింగేసింది అన డానికి ఇదో నిదర్శనం. 
 ఏజెన్సీ ప్రాంతంలో ఇలాంటి చిన్నారులు ఎందరో ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నారు. 
 
 ఎవరూ పట్టించుకోరు
 మా గ్రామంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా ఎందరో ఫ్లోరైడ్ సమస్య వల్ల కాళ్ల వాపులతో బాధపడుతున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటోంది. ఐటీడీఏ, ప్రభుత్వ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. 
 - ఇరక ం శ్రీను, రావికుంట  
 
 రక్షిత మంచినీటి పథకాలు లేవు
 ఫ్లోరైడ్ సమస్య వల్ల మా గ్రామంలో ఎందరో ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా ఒళ్లు నొప్పులతో తరచుగా బాధపడుతున్నా. రక్షిత మంచినీటి పథకాలు లేకపోవడంతో కుకునూరు వెళ్లి మినరల్ వాటర్ తెచ్చుకుని తాగుతున్నాం. 
 - వర్సా శివక్రిష్ణ, 
 విద్యా వలంటీర్, రామన్నగూడెం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement