
పారదర్శక పాలనే ధ్యేయం
జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో)గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నాగార్జునసాగర్ ప్రాధాన్యత క్రమంలో పనులు ....
జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో)గా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన నాగార్జునసాగర్ ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేస్తానని చెబుతున్నారు. ఆక్రమణలో జెడ్పీ ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. సోమవారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ
మచిలీపట్నం : జిల్లా పరిషత్‌లో పారదర్శక పాలనను అందించేందుకు కృషి చేస్తానని జెడ్పీ సీఈవో వి. నాగార్జునసాగర్ చెప్పారు. ఇటీవలే జెడ్పీ సీఈవోగా బాధ్యతలు తీసుకున్న తాను కార్యాలయంలోని అన్ని విభాగాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కార మార్గాల అన్వేషణలో ఉన్నానన్నారు. చైర్‌పర్సన్ ఇతర పాలకవర్గ సభ్యుల సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యతా క్రమంలో పనులు చేస్తానన్నారు. సోమవారం ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు...
సాక్షి : పాలన ఎలా ఉండబోతుంది?
సీఈవో : ఇప్పటి వరకు నేను పనిచేసిన చోట పెండింగ్ ఫైళ్లు లేకుండా చేశా. ఇప్పటికే ఉద్యోగులు, సిబ్బంది, అటెండర్ల నుంచి అన్ని వివరాలూ సేకరించా. దీర్ఘకాల సమస్యలకు సంబంధించి ఫైళ్లను పరిశీలిస్తున్నా. వీటి క్లియరెన్స్‌పై దృష్టి పెట్టా. సిబ్బంది సీనియారిటీ జాబితాలు తయారు చేసే పనిలో ఉన్నాం. పింఛన్ కేసులనూ పరిష్కరిస్తా. రెండు మూడు నెలలు ఓపిక పడితే పాలన ఎలా ఉంటుందో మీరే చూస్తారు.
సాక్షి : జిల్లా వ్యాప్తంగా ఆక్రమణలో ఉన్న జెడ్పీ ఆస్తులను స్వాధీనం చేసుకుంటారా ?
సీఈవో : తప్పకుండా. ఇప్పటికే ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి. అవి ఎవరి స్వాధీనంలో ఉన్నాయో వివరాలు సేకరిస్తున్నాం. జెడ్పీ చైర్‌పర్సన్ అనూరాధ కూడా దీనిపై దృష్టి సారించారు.
సాక్షి : ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలను ఆన్‌లైన్ చేయడంలో జాప్యాన్ని సరిచేస్తారా?
సీఈవో : వాస్తవమే... ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలు ఆన్‌లైన్ చేయడంలో జాప్యం ఉన్నట్లు తెలిసింది. దీనిపై దృష్టి సారించా. వాటిని ఆన్‌లైన్ చేయడంతో పాటు ఉద్యోగులు పీఎఫ్ ఖాతా నుంచి రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే త్వరితగతిన మంజూరు చేసేలా చర్యలు చేపడతా. వారం రోజుల వ్యవధిలో పీఎఫ్ ఖాతాలను ఆన్‌లైన్ చేయించేందుకు కృషి చేస్తా.
సాక్షి : ఉద్యోగులు రెండు యూనియన్లుగా విడిపోవడంతో కుంటుపడిన పాలనను ఏ మేరకు చక్కదిద్దుతారు?
సీఈవో : ఉద్యోగులు యూనియన్లగా ఏర్పడటంలో తప్పులేదు. రోజువారీ పరిపాలన వదిలేసి సమస్యలు తేవడం సబబు కాదు. వివాదాలు పరిష్కరించుకోకుండా పాలనకు ఆటంకం కలిగిస్తే ఉపేక్షించేది లేదు. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు.
సాక్షి : విజయవాడలోని జేసీ క్యాంపు కార్యాలయం భవనం జెడ్పీదే, దీన్ని ఎలా ఉపయోగిస్తారు?
సీఈవో : జేసీ క్యాంపు కార్యాలయం ఎన్నాళ్లుగానో జిల్లాకు చెందిన ఉన్నత ఉద్యోగి వినియోగిస్తున్నారు. జెడ్పీచైర్‌పర్సన్‌తో మాట్లాడి ఈ భవనాన్ని జెడ్పీ అవసరాలకు వాడుకునే అంశాన్ని పరిశీలిస్తా.
సాక్షి : రాజకీయ ఒత్తిళ్లను ఎలా అధిగమిస్తారు?
సీఈవో : జిల్లా పరిషత్ సీఈవో పోస్టు అంటే ప్రజాసంబంధాలు కలిగి ఉంటుంది. రకరకాల సమస్యలు పరిష్కరించాలని అనేక విజ్ఞప్తులు వస్తుంటాయి. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు ఉండటం సహజమే. వీటన్నింటిని అధిగమించేందుకు ప్రయత్నిస్తా. నూతన ప్రజాప్రతినిధులకు పాలనపై అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తా.