రాష్ట్రానికి 500 మెగావాట్ల విద్యుత్ సరఫరా కాకుండా అడ్డుకున్న కర్ణాటక ప్రభుత్వంపై ట్రాన్స్‌కో న్యాయ పోరాటానికి దిగింది.
హైకోర్టులో ట్రాన్స్‌కో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి 500 మెగావాట్ల విద్యుత్ సరఫరా కాకుండా అడ్డుకున్న కర్ణాటక ప్రభుత్వంపై ట్రాన్స్‌కో న్యాయ పోరాటానికి దిగింది. జాతీయ విద్యుత్ చట్టం-2003 స్ఫూర్తికి విరుద్ధంగా కర్ణాటక వ్యవహరిస్తోందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కర్ణాటకలోని జేఎస్‌డబ్ల్యూ, శాలివాహన తదితర సంస్థల నుంచి 500 మెగావాట్ల విద్యుత్‌ను రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. 2013 జూన్ నుంచి 2014 ఏప్రిల్ 30 వరకు విద్యుత్ సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి.
ఈ ఏడాది మార్చి వరకు రాష్ట్రానికి విద్యుత్ సరఫరా జరిగింది. అయితే, ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ సరఫరా కాకుండా కర్ణాటక అడ్డుకుంది. ఇందుకోసం జాతీయ విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 11ను ప్రయోగించింది. ఈ సెక్షన్ ప్రకారం భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు వంటి అత్యవసర సందర్భాల్లో విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ఆదేశించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ, ఇలా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను సొంత రాష్ట్రానికే సరఫరా చేయాలని ఆదేశించే అధికారం మాత్రం లేదు. నిజానికి ఒక రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌ను అదే రాష్ట్రానికి ఇవ్వాలంటూ ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లను (ఐపీపీ) శాసించే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికే పరిమితమై ఆలోచిస్తే దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా దెబ్బతింటుందని అభిప్రాయపడిం ది. ఇవే విషయాలను పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, విచారణకు స్వీకరించినట్టు ట్రాన్స్‌కో వర్గాలు తెలిపాయి.