పట్టాలు తప్పిన రైలింజన్‌

Train Engine Derails At Visakha Railway Station Outer - Sakshi

పలు రైళ్లు ఆలస్యం

కొన్ని రైళ్లు రద్దు, మరికొన్ని గమ్యం కుదింపు

ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం 

సాక్షి, తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): విశాఖ రైల్వే స్టేషన్‌ ఔటర్‌లో ఖాళీ రైలు ఇంజిన్‌ పట్టాలు తప్పడంతో విశాఖ నుంచి బయల్దేరాల్సిన, విశాఖకు రావాల్సిన పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కొన్ని రద్దు కాగా, మరికొన్ని గమ్యం కుదించారు. విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీ వెళ్లాల్సిన ఏపీ ఏసీ ఎక్స్‌ప్రెస్‌(ఖాళీ రేకు)ను శనివారం  యార్డు నుంచి ప్లాట్‌ఫాం మీదకు తీసుకువస్తున్న సమయంలో ఇంజిన్‌ పట్టాలు తప్పింది. అప్పటి నుంచి ఒకే ట్రాక్‌పై రైళ్లు నడిచాయి. దీంతో విశాఖపట్నం నుంచి పలు రైళ్లు గంటల కొద్దీ ఆలస్యంగా రాకపోకలు సాగించడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. తిరుపతి నుంచి విశాఖ రావాల్సిన డబుల్‌ డెక్కర్, ఎల్‌టీటీ, తిరుమల ఎక్స్‌ప్రెస్‌లను దువ్వాడలోనే నిలిపివేశారు.

విజయవాడ నుంచి విశాఖపట్నం రావాల్సిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను దువ్వాడలోనే నిలిపివేసి.. అక్కడ నుంచి విజయవాడకు తరలించారు. డిఘా –విశాఖపట్నం(22873)ఎక్స్‌ప్రెస్‌ను సింహాచలం నార్త్‌లో నిలిపివేశారు. కోరాఫుట్‌– విశాఖపట్నం(18511)ఎక్స్‌ప్రెస్‌ను పెందుర్తిలో నిలిపివేసి అక్కడ నుంచి విశాఖపట్నం–భువనేశ్వర్‌ (22820) ఇంటర్‌సిటీగా పంపించారు. అలాగే దుర్గ్‌–విశాఖపట్నం(58529) పాసింజర్‌ను సింహాచలం నార్త్‌లో, రాయగడ–విశాఖపట్నం(58503)పాసింజర్‌ను కొత్తవలసలో, పలాస–విశాఖపట్నం(58531)పాసింజర్‌ను అలమండలో నిలిపివేశారు. ఇదిలా ఉండగా.. అధికారులు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. సాయంత్రం 4 గంటలకు పూర్తిస్థాయిలో రైళ్ల రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకున్నారు.  రద్దయిన రైళ్లకు సంబంధించి ప్రయాణికులకు టికెట్‌ చార్జీలను వాపస్‌ ఇస్తున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. 

గంటల తరబడి నిరీక్షణ
మెయిల్‌కు కుటుంబ సభ్యులతో కలసి చెన్నై వెళ్లాలి. రైలు దాదాపు నాలుగు గంటల ఆలస్యంగా వస్తుందని ప్రకటించారు. రైలు ఎప్పుడొస్తుందో తెలియక.. స్టేషన్‌లోనే గంటల తరబడి వేచి ఉన్నాం.  
– దేముడు, విశాఖపట్నం

నరకంగా ప్రయాణం
మాది అనంతపురం. విశాఖపట్నంలోని పర్యాటక ప్రాంతాలను వీక్షించేందుకు కుటుంబంతో కలిసి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో వచ్చాం. ఈ ప్రయాణం నరకం అనిపించింది. ఎక్కడపడితే అక్కడ గంటల కొద్దీ రైలును ఆపేశారు. ఏం జరుగుతుందో తెలియక కంగారు పడ్డాం. 
– అర్చన, అనంతపురం

రాయగడ వెళ్లాలి
ఏలూరు నుంచి రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌కు వచ్చాం. రాయగడ గుడికి వెళ్తున్నాం. కానీ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ దువ్వాడలో నిలిపి వేయడంతో అక్కడే సాయంత్రం వరకు వేచి ఉండి.. ఇప్పుడు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ చేరుకున్నాం. కోర్బాలో రాయగడ వెళ్లాలనుకుంటున్నాం. అదీ కూడా సమయం మారిందని చెప్పారు. పిల్లా పాపలు, పెద్దలతో చాలా అవస్థలు పడ్డాం.      – గౌరీ, ఏలూరు

పరామర్శకు వెళ్లాలని వస్తే.. 
పార్వతీపురం నుంచి వస్తున్నాం. మా బంధువుకు ప్రమాదం జరిగింది. తొందరగా మచి లీపట్నం వెళ్లాలి. ఇక్కడకు వచ్చి చూస్తే.. మచిలీపట్నం రైలు రద్దు చేసినట్టు చెబుతున్నారు. ఎల్‌టీటీలోనైనా వెళ్తాం. 
– డి.పద్మ, పార్వతీపురం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top