ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ

Tragic movements of Devipatnam Boat Capsize Victims Relatives - Sakshi

బోటు ప్రమాద స్థలి నుంచి సాక్షి బృందం: గోదావరిలో ప్రైవేట్‌ బోటు మునిగిన ఘటనలో గల్లంతైన వారి కోసం వారి బంధువులు కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు.  ఓ వైపు సహాయక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మరో వైపు బోటులో ప్రయాణించిన వారి బంధువులు ఘటన స్థలికి చేరుకుని తమ వారితో మాట్లాడిన చివరి మాటలను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు.  

వెళ్లొస్తానని.. ఇలా వెళ్లావా తల్లీ.. 
‘కోరుకున్న ఉద్యోగం సాధించావు.. మొదటి జీతాన్ని వినాయకుడికి నైవేద్యంగా పెట్టావు.. నిమజ్జనం రోజు బంధువులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపావు. స్నేహితులతో పాపికొండలు చూసొస్తా నాన్నా అంటే.. నా కూతురు సంతోషంగా గడపాలని పంపిస్తే.. ఆచూకీ కూడా తెలియని యాత్రకు పోతావని కలలో కూడా అనుకోలేదు కదా తల్లీ..’ అని బోటు ప్రమాదంలో గల్లంతైన ఇంజనీర్‌ రమ్య తండ్రి సుదర్శన్‌ విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. తన కుమార్తె ఆచూకీ తెలుసుకునేందుకు ప్రమాద స్థలానికి వచ్చిన ఆ తండ్రి ఒక్కసారిగా ఉద్వేగానికి గురై కుప్పకూలిపోయాడు.

చివరకు బంధువులు రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలం నంనూరుకు చెందిన కారుకూరి రమ్య (24) బోటు ప్రమాదంలో గల్లంతయింది. తండ్రి సుదర్శన్‌ విద్యుత్తు సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్‌ కావడంతో ఆదే శాఖలో ఆమె ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించాలనుకుంది. కష్టపడి చదివి ఇటీవల విద్యుత్‌ శాఖలో ఏఈగా ఉద్యోగం సాధించింది. ఇటీవల గణేష్‌ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహించింది.  కొన్ని రోజుల వ్యవధిలోనే కనపడకుండా పోవడంతో వారి కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. రమ్య ఆచూకీ కోసం వచ్చిన ఆమె మామయ్య రామచంద్రయ్య ఈ విషయాన్ని వివరిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.

నేనొక్కడినే బయటపడ్డా..  
తాలిబ్‌ పటేల్, సాయికుమార్, నేను స్నేహితులం. పాపికొండల అందాలను తిలకించేందుకు హైదరాబాద్‌ నుంచి వచ్చాం. ఆదివారం బోటులో ఎక్కాం. మధ్యాహ్నం భోజనం చేద్దామని బోటు కింది అంతస్తుకు చేరుకున్నాం. ఒక్కసారిగా బోటు తిరగబడింది. ఉన్నట్టుండి బోటు డ్రైవర్‌ గోదావరిలో దూకేశాడు, అతని వెనుకనే నేనూ దూకేశా. మా వాళ్లు లోపల ఉండిపోయారు.  గిరిజనులు పడవలు వేసుకొచ్చి నన్ను ఒడ్డుకు చేర్చి కాపాడారు. మా వాళ్లు ఎక్కడున్నారో? తెలియడం లేదు.  
– తాలిబ్‌ మజర్‌ఖాన్‌  

జీవితంలో స్థిరపడ్డాడనుకున్నాం.. 
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌  ఉద్యోగం.. ఇంకేముందిలే జీవితంలో స్థిరపడ్డాడనుకున్నాం.. ఆదివారం కదా.. అని పాపికొండల అందాలను చూసేందుకు మా అన్న కుమారుడు విష్ణుకుమార్‌ వచ్చాడు. ప్రమాద విషయం తెలిసి నేను ఇక్కడకు వచ్చాను. ఏ వైపు నుంచి అయినా వస్తాడేమోనని  ఎదురు చూస్తున్నా.  
– వేపాకులు నాగేశ్వరరావు,నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా  

చివరి నిమిషం వరకూ సహాయక చర్యలు 
బోటు ప్రమాదంలో గల్లంతైన వారి వివరాలు పూర్తి స్థాయిలో ఓ కొలిక్కి వచ్చే వరకు సహాయక చర్యలు కొనసాగిస్తాం. ఘటన స్థలాన్ని పరిశీలించాం. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.

సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఎస్డీఆర్‌ఎఫ్‌ కమిషనర్‌ అనురాధ  

తొలుత బోటు బయటికి తీస్తే అందులో ఎంత మంది ఉన్నారు? అనే అంశంపై స్పష్టత వస్తుంది. బోటు 300 అడుగుల కంటే లోతులో ఉండటంతో బయటకు తీయడం శ్రమతో కూడుకున్న పని. ఇందుకోసం మరో రెండు, మూడు రోజులు పట్టొచ్చు. అప్పుడే మరికొందరి ఆచూకీ తెలిసే అవకాశం ఉంది. గోదావరి ఉధృతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రమాద ప్రాంతంలో ఆపరేషన్‌ నిర్వహించాల్సి ఉండటం కష్టంగా ఉంది. ఇప్పటికే సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసులు.. సమన్వయంతో గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. నేవీ హెలికాఫ్టర్లు, ఉత్తరాఖండ్‌ నుంచి వచ్చిన ప్రత్యేక బందాన్ని రంగంలోకి దింపాం.   
 – అనురాధ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top