కోడికూర కిలో రూ.30; ఎగబడి కొంటున్న ప్రజలు  | Sakshi
Sakshi News home page

కోడికూర కిలో రూ.30; ఎగబడి కొంటున్న ప్రజలు 

Published Wed, Mar 11 2020 9:22 AM

Trader Selling Rs 30 Per Kg Of Chicken In Kodumur - Sakshi

సాక్షి, కోడుమూరు: వ్యాపారుల మధ్య నెలకొన్న పోటీ కారణంగా చికెన్‌ ధరలు అమాంతం తగ్గించేశారు. గూడూరు మండలం కె.నాగలాపురం గ్రామంలో కిలో రూ.30లకే చికెన్‌ అమ్ముతున్న విషయం సంచలనమైంది. మంగళవారం కె.నాగలాపురంలో సుంకులమ్మ దేవర జరుగుతోంది. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. చికెన్‌ కిలో రూ.30లకే అమ్ముతున్న విషయం తెలియడంతో కోడి కూర కోసం చికెన్‌ అంగళ్ల దగ్గర క్యూ కట్టారు. బహిరంగ మార్కెట్లో కిలో చికెన్‌ ధర రూ100లు పలుకుతోంది. హోల్‌సెల్‌ చికెన్‌ ధర వ్యాపారస్తులు రూ.46లకు వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు.

వాహిద్‌ అనే హోల్‌సెల్‌ వ్యాపారికి గూడూరులో కోళ్లఫారం ఉంది. సదరు వ్యక్తి దగ్గర వ్యాపారస్తులు కోళ్లను తీసుకోకపోతే ఆ గ్రామాల్లో పోటీగా వ్యాపారం పెట్టి ఇతరులను దెబ్బతీసే పనులు చేస్తున్నాడు. గతంలో ప్యాలకుర్తి గ్రామంలో కూడా ఇదే విధంగా చికెన్‌ వ్యాపారస్తుల మధ్య పోటీ పెట్టాడు. నాలుగైదు రోజులుగా కె.నాగలాపురంలో కిలో రూ.40లకే చికెన్‌ అమ్మేందుకు దుకాణం తెరిచాడు. సదరు పోటీదారుడిని దెబ్బతీసేందుకు గ్రామంలో చికెన్‌ వ్యాపారస్తులు కిలో రూ.30లకే చికెన్‌ అమ్మడం మొదలు పెట్టడంతో చికెన్‌ ప్రియుల పంట పండింది.  

పప్పన్నం మానేసి చికెన్‌ కూర తినేందుకు చికెన్‌ అంగళ్ల దగ్గర జనం క్యూ కడుతున్నారు. కిలో కూరగాయలు బీన్స్‌ రూ.60, బీరకాయలు రూ.30 ధర పలుకుతుండగా, కూరగాయలు తినడం మానేసి ఓ పూట కోడి కూర తినడం జనాలు అలవాటు చేసుకుంటున్నారు. కోడి గ్రుడ్ల ద్వారా డజను రూ.60లుండగా, అంతకంటే తక్కువగా కిలో చికెన్‌ రూ.30లకే వస్తోందని జనం కోడి కూర కోసం ఎగబడుతున్నారు. కె.నాగలాపురంలో మహమ్మద్‌బాషా అనే చికెన్‌ వ్యాపారి మంగళవారం నాడు దాదాపు 500కిలోలకు పైగా చికెన్‌ అమ్మినట్లు తెలిపాడు. పోటీ వ్యాపారంలో నిలదొక్కునేందుకు నష్టానికైనా వ్యాపారం చేస్తున్నామంటూ మహమ్మద్‌బాషా తెలిపారు. ఇద్దరు వ్యాపారుల మధ్య పెరిగిన పోటీ కారణంగా చికెన్‌ ప్రియులు కోడి కూరకు రుచి మరిగారు.    

Advertisement
Advertisement