పోలీసుల అదుపులో ట్రేడ్‌ కంపెనీ సిబ్బంది | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో ట్రేడ్‌ కంపెనీ సిబ్బంది

Published Mon, Nov 20 2017 12:30 PM

trade company staff in police custody

సంతకవిటి : మండలంలోని మందరాడ గ్రామానికి చెందిన ట్రేడ్‌ బ్రోకర్‌ టంకాల శ్రీరామ్‌ ఏర్పాటుచేసిన ట్రేడ్‌ కంపెనీలో పనిచేసిన సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కేసు విచారణలో భాగంగా శ్రీరామ్‌ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మందరాడకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ట్రేడ్‌లో పనిచేసి రెండు నెలల క్రితం మానేసిన మందరాడ గ్రామానికి చెందిన సాకేటి ప్రసాద్‌రావు అనే యువకుడుతోపాటు మరో ఇద్దరిని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. రాజాం రూరల్‌ సీఐ ఎం.వీరకుమార్‌ ఈ ముగ్గురిని సంతకవిటి పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి ఆరా తీస్తున్నారు. వీరి వద్ద ఉన్న డాక్యుమెంట్లు, ట్రేడింగ్‌కు సంబంధించి ఆన్‌లైన్‌ వ్యవహారాలను, బ్యాంకు ఖాతాలను, నగదు లావాదేవీలను పరిశీలిస్తున్నారు. తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని, కేవలం ఉద్యోగ విధులు మాత్రమే నిర్వహించేవారమని, ఎక్కువగా రిసెప్షనిష్టులుగా వ్యవహరించామని వీరు చెప్పినట్లుగా తెలిసింది. మరికొందరి కోసం పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

అరెస్టులకు ప్రత్యేక బృందాలు..
ఓ వైపు దర్యాప్తు చేస్తూనే మరోవైపు ఈ వ్యవహారంలో ఉన్న నిందితులందరినీ అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. మూడు ప్రత్యేక బృందాలుగా పోలీసులు ఏర్పడి దర్యాప్తును పలు కోణాల్లో ముమ్మరం చేశారు. ప్రధాన నిందితుడైన శ్రీరామ్‌ను అరెస్టు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిసింది. ఈయన ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా మరికొందరినీ కూడా అరెస్టు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో ఓ ప్రభుత్వ ఉద్యోగితోపాటు ట్రేడ్‌బ్రోకర్‌ బినామీలు, ప్రజాప్రతినిధులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ వివరాలన్నీ బహిర్గతం చేసేందుకు పోలీసులు నిరాకరించారు.

ట్రేడ్‌ కార్యాలయంలో బీర్‌ సీసాలు, నైటీలు..!
తాలాడలోని ట్రేడ్‌ బ్రోకర్‌ కార్యాలయంలో బీరు సీసాలు, నైటీలు ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల కార్యాలయాన్ని పోలీసులు తనిఖీచేసిన అనంతరం ఓ గదిలో ఇవి ఎక్కువగా బయటపడినట్లు సమాచారం. ట్రేడ్‌ కార్యాలయంలో పగలు విధులు అనంతరం సిబ్బంది ఇంటికి వెళ్లిపోగా సాయంత్రం కార్యాలయ గదుల్లో ఈ రాసలీలలు జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో బ్రోకర్‌ శ్రీరామ్‌తోపాటు కొంతమంది మండలానికి చెందిన ప్రధాన వ్యక్తుల పాత్ర కూడా ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

‘టంకాలది వ్యక్తిగత ఫ్రాంచైజీ మాత్రమే’
శ్రీకాకుళం సిటీ: ఇండీట్రేడ్‌ బ్రోకింగ్‌ హౌస్‌లో టంకాల శ్రీరామ్‌ది వ్యక్తిగత ఫ్రాంచైజీ మాత్రమే అని ఇండీట్రేడ్‌ చీఫ్‌ డిజిటల్‌ ఆఫీసర్‌ ఆనంద్‌ మలివాల్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. దక్షిణ భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు, ఆర్థిక వ్యాపారంలో పేరొందిన ఆర్థిక సేవల ప్రదాతగా ఇండీట్రేడ్‌ ప్రముఖ పాత్ర పోషిస్తోందని గుర్తు చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈక్విటీ, కమొడిటి బ్రోకింగ్‌ వ్యాపారాలు చేస్తూ విశ్వసనీయ సంస్థగా పేరు సంపాదించిందని తెలిపారు. అత్యున్నత సాంకేతిక విలువలస్వీకరణ, క్రెడిట్, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ పటిష్టపరచడం, నూతన ఉత్పత్తులు సృజించడం, క్లయింట్స్‌ సంబంధాలు బలోపేతం చేయడం వంటి సేవలు అందిస్తోందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement