ఆగమోక్తంగా అష్టబంధన సమర్పణ

Today is Mahashanti Purnahuthi - Sakshi

నేడు మహాశాంతి పూర్ణాహుతి 

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయ అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణలో భాగంగా మంగళవారం ఆగమోక్తంగా అష్టబంధన సమర్పణ జరిగింది. ఉదయం 5.30 నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తిరిగి రాత్రి 7 నుంచి 10 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరిగాయి. గర్భాలయంలోని శ్రీవారి మూలమూర్తితోపాటు ఉప ఆలయాలైన గరుడాళ్వార్, పోటు తాయార్లు, వరదరాజస్వామి, యోగ నరసింహస్వామి, విష్వక్సేన, భాష్యకార్లు, వేణుగోపాలస్వామి, బేడి ఆంజనేయస్వామివారి విగ్రహాలకు అష్టబంధన సమర్పణ జరిగింది. ఈ అష్టబంధనాన్ని పద్మపీఠంపై స్వామివారి పాదాల కింద, చుట్టుపక్కలా తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైఋతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్య దిక్కుల్లో సమర్పించారు.

ఆనందనిలయ విమానం, ధ్వజస్తంభం శుద్ధి పనులను టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, తిరుమల జేఈవో కె.ఎస్‌.శ్రీనివాసరాజు పరిశీలించారు. ధ్వజస్తంభ శిఖరానికి అలంకరించేందుకు రూ.1.5 లక్షల విలువైన 11 నూతన బంగారు రావి ఆకులను, పీఠానికి, స్తంభానికి మధ్య ఉంచేందుకు రూ.4 లక్షల విలువైన బంగారు చట్రాన్ని, విమాన వేంకటేశ్వర స్వామికి అలంకరించేందుకు రూ.1.75 లక్షల విలువైన వెండి మకరతోరణాన్ని టీటీడీ సిద్ధం చేసింది. అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణలో భాగంగా బుధవారం ఉదయం శ్రీవారి మూలవర్లకు, పరివార దేవతలకు చతుర్దశ కలశ స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకు మహాశాంతి పూర్ణాహుతి, తరువాత శ్రీవారి మూలవర్లకు, పరివార దేవతలకు మహాశాంతి తిరుమంజనం చేపడతారు. రాత్రి యాగశాల కార్యక్రమాలు నిర్వహిస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top