ఆరంభం ఆశాజనకం | tobacco rates high in starting sales | Sakshi
Sakshi News home page

ఆరంభం ఆశాజనకం

Mar 16 2017 11:26 AM | Updated on Sep 5 2017 6:16 AM

జిల్లాలో పొగాకు కొనుగోళ్లు ఆశాజనకంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 12 వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు తొలిరోజు జరిగాయి. వెల్లంపల్లి వేలం కేంద్రంలో కిలోకి రూ.160కు వేలం మొదలైంది.

► ఆశాజనకంగా తొలిరోజు పొగాకు వేలం ధరలు 
► మున్ముందు ఈ ధరలు కొనసాగించడంపైనే అనుమానం
► 38 మంది వ్యాపారులకు గాను వేలంలో పాల్గొన్నది తొమ్మిది మందే
► వ్యాపారులంతా వేలంలో పాల్గొనేలా బోర్డు చర్యలు తీసుకోవాలి
► పొగాకు రైతు నాయకుల డిమాండ్‌ 
ఒంగోలు టూటౌన్‌:
జిల్లాలో పొగాకు కొనుగోళ్లు ఆశాజనకంగా ప్రారంభమయ్యాయి. మొత్తం 12 వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు తొలిరోజు జరిగాయి. వెల్లంపల్లి వేలం కేంద్రంలో కిలోకి రూ.160కు వేలం మొదలైంది. తొలిరోజు కావడంతో తొమ్మిది బేళ్లే వచ్చాయి.  దీంతో పాటు వెల్లంపల్లి –1,2 కేంద్రాలను కలిపి ఒకే వేలం కేంద్రాన్ని చేశారు. కొండపి వేలం కేంద్రంలో అత్యధిక ధర కిలోకు రూ.162 లభించింది.
 
ఒంగోలు వేలం కేంద్రం–2 లో ధర కిలోకి రూ.161 వచ్చింది.  పొదిలి–1 వేలం కేంద్రానికి 9 బేళ్లు రాగా తొమ్మిదీ కొనుగోలు చేశారు. అత్యధిక ధర రూ.160 రాగా అత్యల్ప ధర రూ.158 పలికింది. అదేవిధంగా కందుకూరు–2 వేలం కేంద్రంలో కూడా అత్యధిక ధర కిలోకి రూ.160 రాగా 
 
అత్యల్ప ధర రూ.159 వచ్చింది. అదే విధంగా టంగుటూరు–1, టంగుటూరు–2  వేలం కేంద్రాలలో ఇవే ధరలు పలికాయి. నెల్లూరు జిల్లా పరిధిలో ఉన్న  కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాలలో కూడా అత్యధిక ధర గ్రేడ్‌–1 రకానికి రూ.160 రాగా అత్యల్ప ధర రూ.157 వచ్చింది. మొత్తం చూసుకుంటే తొలిరోజు వేలం కేంద్రాల్లో వచ్చిన ధరలు రైతులకు కొంత ఊరట కలిగించాయి. అయితే ఈ ధరలు మున్ముందు కొనసాగుతాయా లేదా అన్న సందేహాన్ని అటు రైతులు, ఇటు రైతు సంఘాల నాయకులు వెలిబుచ్చుతున్నారు. వేలం కేంద్రాల్లో పాల్గొనే వ్యాపారులు మొత్తం 38 మంది ఉండగా..వీరంతా బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన వారే. ప్రస్తుతం వీరిలో తొలి రోజు కేవలం తొమ్మిదిమందే వేలం కేంద్రాలలో పాల్గొనటంపై రైతులు కొంత నిరాశ వెలిబుచ్చారు. 
 
వేలం కేంద్రాల్లో పోటీ రావాలంటే వ్యాపారులందరూ పాల్గొనాలి. పోటీతత్వం పెరగాలి. ఇలా జరిగితేనే రైతుకు గిట్టుబాటు ధర వస్తుంది. కనుక ఈ పరిస్థితుల్లో వ్యాపారులందరూ వేలంలో పాల్గొనేలా బోర్డు చర్యలు తీసుకోవాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపినా«థ్, వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ ఏడాది ప్రతికూల వాతావరణంలో రైతులు పొగాకు పంట సాగు చేశారు. మొత్తం జిల్లాలో 82 మిలియన్‌  కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతివ్వగా కేవలం 50 మిలియన్‌ ఉత్పత్తి మాత్రమే వచ్చిందని అంచనా. దాదాపు 30 మిలియన్‌ కిలోల నుంచి 35 మిలియన్ వరకు ఉత్పత్తి తగ్గింది. వర్షాలు లేకపోవడం, పొగమల్లె తెగుళ్ల వలన  రైతులు ఖర్చు అధికంగా పెట్టాల్సి వచ్చింది. ఒక్కొక్క కిలో పొగాకు ఉత్పత్తికి దాదాపు రూ.135 ఖర్చు చేశారు. ఇలా గత రెండేళ్లలోనూ పొగాకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. అయినా బ్యాంక్‌ కు సుమారుగా రూ. 2 లక్షలకుపైగా నష్టపోయారు. 
ఈ ఏడాది ఎకరానికి అదనంగా రూ.15 వేలకుపైగా ఖర్చు పెట్టి పంటను కాపాడుకున్నారు. పంట ఉత్పత్తి తగ్గింది. ఈ పరిస్థితుల్లో రైతులకు మంచి ధరలు ఇస్తేనే గట్టెక్కుతారు. కనుక వేలం కేంద్రాలలో పొగాకు వ్యాపారులందరూ పాల్గొనేలా బోర్డు చర్యలు చేపట్టాలని     రైతులు కోరుతున్నారు. వేలంలో పోటీ పెరిగేలా చూడాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement