ప్రాణాలకు ‘పొగ’!

Tobacco aspect cancers in Telugu states is 35 thousand per year - Sakshi

     తెలుగు రాష్ట్రాల్లో ఏటా 35 వేలకు పైనే పొగాకు కారక క్యాన్సర్లు

     బాధితుల్లో 30 నుంచి 40 ఏళ్లలోపువారే అధికం

     చివరి దశలోనే వ్యాధి తెలుస్తుండటంతో ప్రాణాలు కోల్పోతున్న బాధితులు

     ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా పొగరాయుళ్లు

     తెలంగాణలో ఎక్కువగా గుట్కా, పాన్‌పరాగ్‌ నమిలేవాళ్లు

     నేడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం

తెలుగు రాష్ట్రాల్లో పొగాకు పలువురి ప్రాణాలు తీస్తోంది. పొగాకు ఉత్పత్తులతో ఏటా లక్షలాది మంది కేన్సర్‌ బారిన పడుతున్నారు. పలు రాష్ట్రాలతో పోలిస్తే పొగతాగే వారు ఆంధ్ర ప్రదేశ్‌లో ఎక్కువ మంది ఉండటం ఆందోళన కలిగించే విషయం

సాక్షి, అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పొగరాయుళ్లు ఏటా పెరిగిపోతున్నారు. ప్రస్తుతం వీరి సంఖ్య కోటీ ఎనభై లక్షలు. పొగ తాగే వారిలో ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉండగా (14.2 శాతం), గుట్కా, కిళ్లీ, పాన్‌మసాలాలు వంటివి వాడేవారు తెలంగాణలో ఎక్కువ (10.1) శాతం ఉన్నారు. పొగతాగే వారి కనిష్ట వయసు 17 ఏళ్లు కాగా.. గుట్కా, పాన్‌మసాలాలు పదిహేనేళ్ల వయసు నుంచే మొదలెడుతున్నట్టు వెల్లడైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పొగతాగే వారు, గుట్కాలు వాడే వారు ఎంత ఎక్కువగా పెరుగుతున్నారో.. అంత తీవ్ర స్థాయిలో క్యాన్సర్‌ బాధితులూ పెరిగిపోతున్నారు. పొగాకు ఉత్పత్తులపై హెచ్చరికలున్నా నామమాత్రంగా కూడా లెక్కచేయడం లేదని తేటతెల్లమైంది.

భారీగా పెరుగుతున్న పొగాకు కారక క్యాన్సర్లు
ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా పొగాకు, గుట్కా కారక క్యాన్సర్లు తీవ్రమైనట్టు గాట్స్‌ (గ్లోబల్‌ అడల్ట్స్‌ టుబాకో సర్వే) వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏటా పొగాకు, గుట్కా కారక క్యాన్సర్లు 35 వేలకు పైనే నమోదవుతున్నట్టు తేలింది. నోరు, నాలుక, మెడ భాగాలకు ఈ క్యాన్సర్‌ వస్తోంది. ప్రతి పది క్యాన్సర్లలో 3 పొగాకు కారక క్యాన్సర్లే. ఇవిగాకుండా ఊపిరితిత్తులు, కాలేయ క్యాన్సర్లు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ క్యాన్సర్లు ఎక్కువగా మూడు, లేదా నాలుగో స్టేజ్‌లోనే తెలుస్తుండటంతో 80% మంది మృత్యువాత పడుతున్నట్టు వైద్యులు వెల్లడిస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ప్రతి లక్ష మందిలో 150 నుంచి 200 మందికి ఏటా కొత్తగా క్యాన్సర్‌లు వస్తుంటే.. అందులో 30 శాతం పొగాకు కారక క్యాన్సర్లే ఉన్నాయి.

మెడ, తల భాగంలోనే అధికం
పొగాకు వాడే వారికి ఎక్కువగా మెడ, తల భాగంలో క్యాన్సర్లు సోకుతున్నాయి. నా దగ్గరకు వచ్చే కేసుల్లో ప్రతి పదింటిలో మూడు లేదా నాలుగు ఇలాంటి క్యాన్సర్లే. వీరి వయసు కూడా 30 నుంచి 40 ఏళ్లలోపే. బాధితుల సంఖ్య ఏటా పెరిగిపోతోంది. 
–డా.రమేష్‌ మాటూరి, క్యాన్సర్‌ శస్త్రచికిత్సా నిపుణులు,ఎంఎన్‌జే ప్రభుత్వ ఆస్పత్రి, హైదరాబాద్‌

చిన్న వయసు వారిలోనూ వస్తోంది
పొగతాగడం, గుట్కాలు తీసుకోవడం వంటి వాటి వల్ల చిన్న వయసులోనే క్యాన్సర్లు వస్తున్నాయి. దీన్నిబట్టి పొగాకు తీవ్రత ఎలా ఉందో అంచనా వేయొచ్చు. అయితే చివరి దశలో గుర్తించడం వల్ల చికిత్స చేసినా పెద్దగా ప్రయోజనం ఉండటంలేదు. 
– డా.రవికిరణ్‌ బొబ్బా, మెడికల్‌ ఆంకాలజిస్ట్‌ రవి అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్, విజయవాడ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top