పాత శనగలకు ‘మద్దతు’ | To provide support to local farmers or peanut... | Sakshi
Sakshi News home page

పాత శనగలకు ‘మద్దతు’

Feb 3 2014 3:57 AM | Updated on Sep 2 2017 3:17 AM

గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న శనగ రైతులకు ఆసరా కల్పించే దిశగా చర్యలు చేపట్టిన ప్రభుత్వం ఎట్టకేలకు మద్దతు ధరతో కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది.

కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న శనగ రైతులకు ఆసరా కల్పించే దిశగా చర్యలు చేపట్టిన ప్రభుత్వం ఎట్టకేలకు మద్దతు ధరతో  కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కోల్డుస్టోరేజీల్లోని నిల్వలను పరిశీలనకు మూడు బృందాలు ఏర్పాటయ్యాయి. ధర పూర్తిగా పడిపోయిన నే పథ్యంలో శనగలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు కొద్దినెలలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఇప్పటి దాకా జాప్యం చేస్తూ వచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది సరుకు రైతులకు చేతికొస్తున్న క్రమంలో గత ఏడాది సరుకును కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకంది. మద్దతు ధర రూ. 3100గా ఉన్నప్పటికీ ఏడాది పాటు నిల్వ బాడుగల రూపంలో రైతులు నష్టపోయిన క్రమంలో రూ. 3500 ప్రకారం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకున్నారు.
 
 ఇదే సమయంలో రైతుల ముసుగులో దళారులు లబ్ధి పొందకుండా జాయింట్ కలెక్టర్ కన్నబాబు చర్యలు చేపట్టారు. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచుకున్న సరుకు రైతులదేనా లేకా వ్యాపారులు, దళారులదా, ఏ మేరకు నిల్వలున్నాయనే విషయాల నిర్ధారణకు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ సాలురెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వెంకటకృష్ణుడు, మార్కెటింగ్ ఏడీ ఉపేంద్రకుమార్‌తో కూడిన మూడు బృందాలను నియమించారు. వీరు ఇచ్చే నివేదికల మేరకు కొనుగోళ్లకు చర్యలు చేపడతారు.
 
 ఈనెల 15లోగా రూ.3,500 ప్రకారం పాత శనగలు(2012-13) కొనుగోలు చేస్తారు. ఆ తర్వాత 2013-14 పండిన సరుకును కనీస మద్దతు ధర రూ.3,100 ప్రకారం సేకరించేందుకు నిర్ణయించారు. అయితే కేవలం కోల్డ్ స్టోరేజీల్లోని సరుకునే కొనాలని నిర్ణయించడంపై రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీనిపై మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజీల్లోని సరుకునే కొనుగోలు చేయాలని జీవోలో ఉన్నట్లు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement