
మహాలక్ష్మీ నమోస్తుతే
దసరా ఉత్సవాలలో భాగంగా దుర్గమ్మ శుక్రవారం మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులతో ఉదయం అన్ని క్యూలైన్లు కిటకిటలాడాయి.
= ఇంద్రకీలాద్రి కిటకిట
= ఉదయం అంతరాలయాల దర్శనం రద్దు
= తరలి వస్తున్న భవానీ భక్తులు
= తెప్పోత్సవానికి ట్రయల్ రన్
= నేడు రెండు అలంకారాల్లో దుర్గమ్మ దర్శనం
సాక్షి, విజయవాడ : దసరా ఉత్సవాలలో భాగంగా దుర్గమ్మ శుక్రవారం మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులతో ఉదయం అన్ని క్యూలైన్లు కిటకిటలాడాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రద్దీ కొనసాగింది. అమ్మవారికి ప్రీతిపాత్రమైన శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి రూపంలో దర్శించుకోవడం మంచిదనే భావనతో భక్తులు ముఖ్యంగా మహిళలు పెద్దసంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు.
దీంతో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేశారు. వెయ్యి, రెండు వేల రూపాయల టికెట్ బుక్‌లెట్స్, రూ.250 టికెట్లు కొనుగోలు చేసిన వారిని కూడా లఘుదర్శనానికే అనుమతించారు. దీంతో వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళప్రదమైన రోజుగా భావించిన పలువురు మహిళలు ముత్తయిదువులకు పసుపు, కుంకుమ, తాంబూలాలు పంచిపెట్టారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు.
కుంకుమపూజలో ప్రముఖులు
భవానీమండపంలో జరిగిన లక్షకుంకుమార్చనలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఇంటెలిజెన్స్ డీఐజీ మధుసూదనరెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ ఉదయలక్ష్మి, ఈవో ప్రభాకరశ్రీనివాస్ తదితరులు కుంకుమార్చనలో పాల్గొన్నారు. భద్రాచలం ఈవో రఘునాథ్‌తో పాటు అలనాటి ప్రముఖ నటి కాంచన తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
భవానీల రాక ప్రారంభం
మండలం రోజులపాటు భవానీ దీక్షలు చేపట్టిన భక్తులు విజయదశమికి ఇంద్రకీలాద్రికి చేరుకుని భవానీబంధనాలు తీసివేయడం ఆనవాయితీ. శుక్రవారం నుంచి భవానీలు అమ్మసన్నిధికి రావడం మొదలైంది. సమైక్య ఉద్యమం కారణంగా బస్సులు లేకపోవడంతో జిల్లాలోని భవానీలు కాలినడకన కొండకు చేరుకుంటున్నారు. సహజంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల నుంచి భవానీలు ఎక్కువగా వస్తారు. వారి రాక కూడా శుక్రవారం నుంచి ప్రారంభమైంది.
తెప్పోత్సవం ట్రయల్ రన్
విజయదశమి రోజు సాయంత్రం కృష్ణానదిలో అమ్మవారి తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ప్రస్తుతం వాతావరణం కూడా అనుకూలంగా ఉండటంతో తెప్పోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాటు పూర్తి చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం కృష్ణానదిలో హంసవాహనం ట్రయల్ రన్ నిర్వహించారు. తెప్పోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు మోడల్ గెస్ట్‌హౌస్‌లో సబ్‌కలెక్టర్, ఇతర అధికారులు సమావేశమయ్యారు.
నేడు రెండు అలంకారాల్లో..
శరన్నవరాత్రి ఉత్సవాల్లో దుర్గమ్మ శనివారం రెండు అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనుంది. ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన శనివారం దుర్గాష్టమి, మహార్నవమి రెండు తిథులు వచ్చారుు. దీంతో శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి దుర్గాదేవిగా, మధ్యాహ్నం 3 గంటల నుంచి మహిషాసురమర్దినిగా అమ్మ దర్శనమిస్తుంది. అమ్మవారి అలంకరణ నిమిత్తం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు దర్శనాన్ని నిలిపివేస్తారు. ఒకేరోజు దుర్గమ్మను రెండు అలంకారాల్లో దర్శించుకునే భాగ్యం చాలా అరుదుగా కలుగుతుంది.